Begin typing your search above and press return to search.

తెలుగు సినిమా అసలు మార్కెట్ ఇంతే..

టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇండస్ట్రీ కలెక్షన్స్ గురించి సంచలన కామెంట్స్ చేశారు.

By:  M Prashanth   |   16 Dec 2025 4:34 PM IST
తెలుగు సినిమా అసలు మార్కెట్ ఇంతే..
X

టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇండస్ట్రీ కలెక్షన్స్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. మనం చూస్తున్న అంకెలు వేరు, గ్రౌండ్ లెవెల్ లో ఉన్న నిజం వేరు అని ఆయన కుండబద్దలు కొట్టారు. బాహుబలి సినిమా తర్వాత ఇండస్ట్రీలో లెక్కలు మారాయని, మనం వెయ్యి కోట్లు, పన్నెండు వందల కోట్లు అని గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ అందులో అసలు మ్యాటర్ వేరే ఉందని ఆయన వివరించారు.

మనం చూపిస్తున్న ఆ వెయ్యి కోట్ల వసూళ్లలో ఎక్కువ భాగం హిందీ డబ్బింగ్, ఓవర్సీస్ నుంచి వచ్చినవే అని తమ్మారెడ్డి గుర్తు చేశారు. అసలు సిసలైన తెలుగు వెర్షన్ వసూళ్లు చూస్తే ఇప్పటివరకు ఏ సినిమా కూడా 300 కోట్ల మార్కును దాటలేదని ఆయన షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. మన తెలుగు సినిమా మార్కెట్ ఇంకా 200 నుంచి 300 కోట్ల మధ్యలోనే ఉందని, ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారని ఆయన అన్నారు.

నిర్మాతలు ఈ అసలు లెక్కను గమనించకుండానే బడ్జెట్లు పెంచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన మార్కెట్ 300 కోట్లు కూడా లేనప్పుడు, అంతకు మించి ఖర్చు పెట్టడం వల్లే సినిమాలు నష్టాల్లోకి వెళ్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పక్క భాషల్లో ఆడుతుందనే నమ్మకంతో బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారని, ఒకవేళ అక్కడ తేడా కొడితే ఆ భారం మొత్తం నిర్మాత మీదే పడుతుందని ఆయన హెచ్చరించారు.

ఇక సినిమాల్లో జరుగుతున్న వృధా ఖర్చు గురించి కూడా తమ్మారెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ రోజుల్లో షూటింగ్ లలో అనవసరపు హంగులు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. ఐదుగురు ఆర్టిస్టులు ఉంటే వారికి ఐదు కార్లు, డ్రైవర్లు, పెట్రోల్ అంటూ లక్షలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు తాను స్కూటర్ మీద వెళ్లి సినిమాలు తీశానని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఇలాంటి వాటి వల్లే బడ్జెట్ తడిసి మోపెడవుతోందని ఆయన వివరించారు.

కేవలం డబ్బులు వసూలు చేసినంత మాత్రాన అది గొప్ప సినిమా అయిపోదని తమ్మారెడ్డి తనదైన శైలిలో చెప్పారు. కోట్లు కొల్లగొట్టిన సినిమాలు హిట్ సినిమాలు మాత్రమేనని, అంతమాత్రాన అవి అద్భుతమైన సినిమాలు కావని ఆయన తేల్చి చెప్పారు. చిన్న సినిమాలైనా సరే కంటెంట్ ఉంటే జనం ఆదరిస్తారని, విరూపాక్ష, సామజవరగమన లాంటి సినిమలే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు.

పెద్ద బ్యానర్లు చిన్న సినిమాలకు కూడా భారీగా ఖర్చు చేయడం వల్ల మార్కెట్ పాడవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సినిమాను చిన్న నిర్మాత తీస్తే సగం ఖర్చుతో అయిపోతుందని, కానీ పెద్ద సంస్థల వల్ల రేట్లు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. మొత్తానికి మన తెలుగు మార్కెట్ పరిధిని తెలుసుకుని ఖర్చు పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని తమ్మారెడ్డి ఇండస్ట్రీకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.