ఇంత బిజీలో కూడా చిన్న సినిమాను మోస్తున్న తమన్!
ఒకవైపు చిరంజీవి ‘కాకా’, బాలకృష్ణ ‘దాదా’లాంటి భారీ సినిమాలు. మరోవైపు వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల వాయిదా.
By: M Prashanth | 9 Oct 2026 11:02 AM ISTఒకవైపు చిరంజీవి ‘కాకా’, బాలకృష్ణ ‘దాదా’లాంటి భారీ సినిమాలు. మరోవైపు వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల వాయిదా. తమన్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల జాబితా చూస్తే స్టార్ హీరోల సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో కొత్త హీరో సినిమా పాట కోసం వైజాగ్‌లో స్టేజ్ ఎక్కి హీరోయిన్‌తో స్టెప్పులు వేయడం కాస్త స్పెషల్. ‘ఇట్లు అర్జున’ కోసం డిఫరెంట్ సాంగ్స్ ఇవ్వడమే కాకుండా ప్రమోషన్లలోనూ స్వయంగా పాల్గొంటున్నారు.
‘యెల్లో చున్ని’ పాట లాంచ్ సందర్భంగా తమన్ హీరోయిన్ అనస్వర రాజన్‌తో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. హీరోగా సాయి అనీష్‌కు, దర్శకుడిగా మహేష్ ఉప్పలకు ఇదే తొలి సినిమా. వెంకీ కుడుముల నిర్మాతగా చేస్తున్న మొదటి ప్రయత్నం కూడా ఇదే. మాటలు రాని యువకుడి ప్రేమకథ కావడంతో ఇందులో మ్యూజిక్‌కు స్పెషల్ స్కోప్ ఉందట. స్టార్ హీరో లేని ఇలాంటి సినిమాకు తమన్ స్వయంగా ప్రమోషన్లకు రావడం టీమ్‌కు ఉపయోగపడే విషయం.
ప్రస్తుతం తమన్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఈ చిన్న లవ్ స్టోరీ ఎంత డిఫరెంట్ అనేది అర్థమవుతుంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ‘కాకా’ జనవరి 13న రాబోతోంది. గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్‌లోని ‘దాదా’ డిసెంబర్ 24కు సిద్ధమవుతోంది. ఈ రెండూ మాస్ యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతున్నాయి. ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌కు తమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది.
ఇక వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’తోనూ తమన్‌కు ఇంకా వర్క్ ఉంది. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో మళ్లీ వాయిదా పడింది. టెక్నికల్ పనులు మరింత మెరుగ్గా పూర్తి చేయాలనే నిర్ణయంతోనే రిలీజ్ మార్చామని నిర్మాత నాగవంశీ చెప్పారు. కొత్త తేదీ ఇంకా ప్రకటించలేదు. రీరికార్డింగ్ పనులు ఆలస్యమయ్యాయన్న కథనాలూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమన్ ‘ఇట్లు అర్జున’ ఈవెంట్‌కు హాజరయ్యారు.
ఇక తమన్‌కు లవ్ స్టోరీలు కొత్తేమీ కాదు. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’లో అదిరిపోయే పాటలు ఇచ్చారు. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’లోనూ ఆల్ టైం బెస్ట్ మెలోడీలు ఉన్నాయి. ఇప్పుడు ‘ఇట్లు అర్జున’లో కూడా అలాంటి ఎమోషన్ కావాలనే దర్శకుడు మహేష్ అడిగారట. అందరూ స్పీకర్లు బద్దలయ్యే మ్యూజిక్ కోరుతుంటే, ఈ దర్శకుడు గుండెను తాకే సంగీతం అడిగారని తమన్ చెప్పారు. ‘యెల్లో చున్ని’ సాంగ్ ను తమన్ విశాల్ మిశ్రాతో కలిసి ఆలపించారు. శ్రీజో సాహిత్యం అందించారు.
మరో విషయం ఏమిటంటే, ఈ సినిమా హీరోయిన్ అనస్వర రాజన్ చిరంజీవి ‘కాకా’లోనూ నటిస్తున్నారు. అక్టోబర్ 30న విడుదల కానున్న ‘ఇట్లు అర్జున’ నుంచి ఇప్పటికే ‘హై రే’, ‘చిన్ని చిన్ని’, ‘యెల్లో చున్ని’ పాటలు వచ్చాయి. విశాఖ ఈవెంట్‌లో తమన్ గీతం విద్యార్థులకు మరో మాట కూడా ఇచ్చారు. వచ్చే కాలేజ్ ఫెస్ట్‌లో ఉచితంగా లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తానని ప్రకటించారు.
