మాటలు రాసే గురూజీ మాటలు పడాలా?.. తమన్ ఎమోషనల్ కౌంటర్!
మాటలు రాసేవాడే మాటలు పడాల్సి వస్తే చూస్తూ ఊరుకోలేం అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతున్నాయి
By: M Prashanth | 29 Oct 2026 2:47 PM ISTమాటలు రాసేవాడే మాటలు పడాల్సి వస్తే చూస్తూ ఊరుకోలేం అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆదర్శ కుటుంబం ప్రెస్ మీట్ లో త్రివిక్రమ్ తో తన బాండింగ్ గురించి మాట్లాడినప్పుడు ఆయన గొంతులో కనిపించిన ఎమోషన్, వెనక ఉన్న ఆవేదన ఆలోచింపజేసింది. యాంకర్ అడిగిన నూడుల్స్, ఫ్రైడ్ రైస్ సరదా ప్రశ్నతో మొదలుపెట్టిన తమన్, మెల్లగా అసలు గ్రౌండ్ రియాలిటీ వైపు టాపిక్ తిప్పారు.
ప్రస్తుత ఇండస్ట్రీలో ఎంత హెవీ కాంపిటీషన్ ఉందో, ప్రతి సినిమాకు ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో ఓపెన్ గా ఒప్పుకున్నారు. ఇది కేవలం ఫ్రైడ్ రైస్ మాత్రమే కాదు, ఇద్దరం కలిసి గట్టిగా వండిన బిర్యానీ అంటూ అవుట్పుట్ పై ఉన్న నమ్మకాన్ని బయటపెట్టారు. అయితే ఇక్కడ అసలైన హైలైట్ త్రివిక్రమ్ పై వచ్చే విమర్శల గురించి ఆయన రియాక్ట్ అయిన తీరు. గుంటూరు కారం తర్వాత నుంచి మాటల మాంత్రికుడిపై సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్ ను తమన్ పరోక్షంగా గుర్తుచేశారు.
అంత గొప్పగా మాటలు రాసే దర్శకుడే బయట జనాల మాటలు పడాల్సి రావడం తనను ఎంతలా బాధించిందో ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశారు. ఎవరైనా విమర్శిస్తే ప్రతిసారీ మైకులు పట్టుకుని ప్రెస్ మీట్లలో ఎదురుదాడి చేయలేమని తమన్ చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారు. విమర్శకులకు ఆన్సర్ ఇచ్చే ఏకైక వేదిక సినిమానే అని స్పష్టం చేశారు.
త్రివిక్రమ్ తన పెన్నుతో పదునైన డైలాగులు రాస్తే, తాను బాక్సాఫీస్ షేక్ అయ్యే బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలతో గట్టి సమాధానం చెబుతానని ధీమా వ్యక్తం చేశారు. వీరిద్దరి కాంబినేషన్ కేవలం ఒకరిద్దరు వర్క్ చేసుకునే ప్రాజెక్ట్ మాత్రమే కాదు, పరస్పరం ఇచ్చే ఒక సాలిడ్ సపోర్ట్ సిస్టమ్. మాటల తూటాలకు పనులతోనే కౌంటర్ ఇవ్వాలనే ఈ ఇద్దరి మైండ్సెట్ వారిలోని వేవ్లెంగ్త్ ను క్లియర్ గా చూపిస్తోంది.
దర్శకుడిపై ఉన్న గౌరవం, ఆయన్ను వెనకేసుకొచ్చే ఒక టెక్నీషియన్ కమిట్మెంట్ తమన్ స్పీచ్ లో క్లియర్ గా కనిపించింది. నెగెటివిటీ, విమర్శలను తట్టుకుని నిలబడే కసి నుంచే ఎప్పుడూ ఒక పవర్ ఫుల్ కంటెంట్ పుడుతుంది. రేపు థియేటర్లలో పడే రిజల్ట్ ఎలా ఉంటుందో పక్కనపెడితే, తమపై పడ్డ ప్రతి కామెంట్ కు ఒక బ్లాక్బస్టర్ తోనే సమాధానం చెప్పాలనే ఆరాటం ఈ కాంబోలో కనిపిస్తోంది. తమన్ చెప్పినట్లు ఈ బిర్యానీ ఆడియన్స్ ఆకలిని ఎంతవరకు తీరుస్తుందో ఇంకొన్ని గంటల్లో తేలనుంది.
