20ఏళ్ల తర్వాత సేమ్ గ్రేస్.. తమన్ 'హృదయం మురళి' క్లిక్ అయితే..
యంగ్ హీరో అథర్వ మురళి లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ చిత్రానికి ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించారు. ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
By: M Prashanth | 8 July 2026 9:08 AM ISTటాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమన్ ఇప్పుడు మరోసారి నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆయన కెమెరా ముందుకు రావడం సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. తమిళంలో రూపొందిన ఇదయం మురళి చిత్రాన్ని తెలుగులో హృదయం మురళి పేరుతో జూలై 10న విడుదల చేయనున్నారు. ఆ చిత్రంలో తమన్ కీలక పాత్ర పోషించడంతో పాటు సంగీతాన్ని కూడా అందించడం విశేషం.
2003లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాలో కృష్ణ అనే యువకుడి పాత్రలో తమన్ నటించారు. ఆ సినిమా తర్వాత పూర్తిగా సంగీతంపైనే దృష్టి పెట్టిన ఆయన, సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మరోసారి నటుడిగా రీఎంట్రీ ఇవ్వడం ఆ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
యంగ్ హీరో అథర్వ మురళి లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ చిత్రానికి ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించారు. ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ ను చూస్తే ఇది లవ్, ఎమోషన్స్, మ్యూజిక్ చుట్టూ సాగే కథగా కనిపిస్తోంది. కాలేజీ బ్యాక్ డ్రాప్, యువతను ఆకట్టుకునే ప్రేమకథ, సంగీతానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఆ సినిమాలో తమన్ పాత్ర కథకు కీలక మలుపు తీసుకొచ్చేలా ఉంటుందని ట్రైలర్ ద్వారా కనిపిస్తోంది. నటుడిగా ఆయనకు ఇది రెండో ఇన్నింగ్స్ కావడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో సంగీత దర్శకుడిగా కూడా వర్క్ చేయడం ఆ సినిమాకు మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ట్రైలర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ప్రస్తుతం తమన్ సంగీత దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఆయన మ్యూజిక్ అందించిన అనేక చిత్రాలు మంచి రెస్పాన్స్ పొందుతున్నాయి. అలాంటి సమయంలో నటుడిగా చేసిన ప్రయత్నం సక్సెస్ అయితే ఫ్యూచర్ లో మరిన్ని ఛాన్సులు కూడా ఆయనను వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉందని సినీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. మ్యూజిక్ తో పాటు యాక్టింగ్ లో కూడా తన ముద్ర వేయగలరా అనే చర్చ కూడా సాగుతోంది.
అయితే ఇప్పటికే హృదయం మురళి మూవీ ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా యూత్ ను ఎంత మేర ఆకట్టుకుంటుందో, అలాగే 20 ఏళ్ల తర్వాత నటుడిగా వస్తున్న తమన్ కు ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో జులై 10న తేలనుంది. ఆ సినిమా రిజల్ట్ బట్టి తమన్ నటుడిగా కూడా తన జర్నీ కొనసాగిస్తారో లేదో చూడాల్సి ఉంది.
