నాదేం తప్పు.. అంతా స్పీకర్లదే: తమన్
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 19 Dec 2025 11:55 PM ISTటాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. వరుస సినిమాలకు మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కౌర్ అందిస్తూ బిజీగా ఉండే ఆయన.. అటు ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.. అదే సమయంలో విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు.
రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2: తాండవం మూవీకి వర్క్ చేసిన తమన్.. మ్యూజిక్ మిక్సింగ్ పై ఇప్పుడు ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. తమన్ సంగీతంలో సౌండ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని, ఆయన సౌండ్ మిక్సింగ్ కూడా సరిగ్గా ఉండదని కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఇప్పుడు ఆ విషయంపై తమన్.. అఖండ 2 పోస్ట్ ప్రమోషన్స్ లో స్పందించారు. మ్యూజిక్ మిక్సింగ్ విషయంలో తప్పు తనది కాదని.. స్పీకర్లదేనని క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ కు సంబంధించి నిర్ణయం తీసుకునేది తాను కాదని తెలిపారు. ఈ మధ్య చాలా థియేటర్లలో స్కీన్లు, ప్రొజెక్టర్లను మార్చారని తెలిపారు.
కానీ చాలా థియేటర్లలో స్పీకర్లు అలానే ఉన్నాయని, వాటిని మార్చలేదని చెప్పారు. అయితే ముఖ్యంగా తాను మిక్సింగ్ ను కంప్లీట్ చేసిన తర్వాత డాల్బీ కంపెనీకి చెందిన నిపుణులు సౌండ్ ను చెక్ చేస్తారని తెలిపారు. ఆ సమయంలో మ్యూజిక్ క్వాలిటీకి సంబంధించి అనేక తనిఖీలు చేస్తారని కూడా తమన్ వెల్లడించారు.
మిక్సింగ్, డెసిబుల్ స్థాయిలపై తుది నిర్ణయం తీసుకునే వ్యక్తిని తాను కాదని తమన్ తెలిపారు. అయితే స్పీకర్లకు థియేటర్స్ యజమానులు సర్వీసింగ్ చేయించాలని తెలిపారు. పాడైపోయిన స్పీకర్లు ఉన్న చోట.. ఆడియన్స్ ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఆ పరిస్థితి అన్ని చోట్లా లేదని, అది తన తప్పు కాదు కదా అని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.
అయితే అఖండతో పోలిస్తే అఖండ 2కి సంగీతమందించడమే తనకు ఎక్కువ సవాల్ గా అనిపించిందని మరో ఇంటర్వ్యూలో తెలిపారు. తానెక్కువ ప్రయోగాలు చేసింది మాత్రం సీక్వెల్ కోసమేనని అన్నారు. అఖండ తాండవం అనే క్యాప్షన్ కు తగ్గట్లుగా థియేటర్లలో ప్రేక్షకుల్ని ఎలా తాండవమాడించేలా చేయొచ్చనే దానిపై చాలా వర్క్ చేశానని చెప్పారు.
కనకవ్వ, సర్వేపల్లి సిస్టర్స్, ఐశ్వర్య, సౌందర్య ఇలా కొత్త సింగర్స్ ను పరిచయం చేసే ప్రయత్నం కూడా చేశానని వెల్లడించారు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను పూర్తి చేయడానికి తనకు 73 రోజులు పట్టిందని అన్నారు. ఒక్క జాజికాయ పాట మినహా మూవీలోని మిగతా పాటలన్నింటినీ సినిమా కథ ఆధారంగా చేశామని పేర్కొన్నారు. ఏ విషయంలో కూడా ఏఐ సాయం తీసుకోలేదని తమన్ తెలిపారు.
