గేమ్ ఛేంజర్ తో రూపాయి కూడా రాలేదు.. ఫ్యాన్స్ ట్రోల్స్ పై తమన్ కౌంటర్!
నిజానికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సమయంలో తమన్ చేసిన వ్యాఖ్యలు రామ్ చరణ్ అభిమానులను బాగా హార్ట్ చేశాయి.
By: Madhu Reddy | 29 Sept 2025 1:16 AM ISTప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఈమధ్య వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ గతంలో జరిగిన విషయాలపై స్పందిస్తున్నారు.. అందులో భాగంగానే మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా సమయంలో తాను ఎదుర్కొన్న విమర్శలను మొదలుకొని.. ఈ ఏడాది రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'గేమ్ ఛేంజర్' సినిమా వరకు ఆయా హీరోల అభిమానుల నుండి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చారు.
నిజానికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సమయంలో తమన్ చేసిన వ్యాఖ్యలు రామ్ చరణ్ అభిమానులను బాగా హార్ట్ చేశాయి. "గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరైన స్టెప్పులు వేయకపోవడం వల్ల ఈ పాటలు జనాలలోకి వెళ్లలేదని" ఆయన కామెంట్లు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించాయి.. దాంతో చాలామంది రాంచరణ్ అభిమానులు.. "నువ్వే సరిగ్గా ట్యూన్ ఇవ్వలేదు.. పైగా చరణ్ డాన్స్ సరిగ్గా చేయలేదంటావా?" అంటూ విరుచుకుపడ్డారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అప్పటి గొడవపై కూడా స్పందించారు.
తమన్ మాట్లాడుతూ.." ఏ సినిమాలో అయినా సరే హుక్ స్టెప్ ఉంటేనే ఆ పాట జనాలలోకి వెళ్తుంది. అంతెందుకు కోర్ట్ సినిమాలో కథలెన్నో చెబుతాను అనే పాట గురించి ఎవరికి తెలుసు.. కానీ ఆ హుకు స్టెప్పుతోనే ఆ పాట జనాలలోకి భారీగా వెళ్ళిపోయింది. అలాగే నాయక్ సినిమాలో లైలా ఓ లైలా పాటలో రామ్ చరణ్ అద్భుతమైన స్టెప్పులు వేశారు. అలాంటి గొప్ప డాన్సర్ ను ఇక్కడ వాడుకోలేకపోయారన్నదే నా బాధ. ముఖ్యంగా నా కోపం అంతా డాన్స్ కొరియోగ్రాఫర్లపైనే.. రేయ్ అక్కడ ఉన్నది చరణ్ బాగా వాడుకోండి రా అని చెప్పాను. కానీ వాళ్లు మాత్రం రామ్ చరణ్ ను ఉపయోగించుకోలేకపోయారు. దానితో పాటు పాటలు కూడా పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు అయితే చరణ్ అభిమానులు మాత్రం నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు" అంటూ తమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే రెమ్యూనరేషన్ పై కూడా మాట్లాడుతూ.." ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. మచ్చా మచ్చా పాటను ఏకంగా రెండేళ్ల పాటు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాను ..ఈ సినిమా నుంచి రూపాయి కూడా నేను ఇంటికి తీసుకెళ్లలేదు . దిల్ రాజు ఎంత ఇస్తే అంతా నేను కేవలం మ్యూజిక్ కోసమే కేటాయించాను.. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. ఈ సినిమా కోసం కష్టపడ్డాను. అయితే ఫలితం శూన్యం కానీ అభిమానులు మాత్రం నన్ను తప్పుగా అర్థం చేసుకుని కామెంట్లు చేయడాన్ని నేను తట్టుకోలేకపోయాను" అంటూ తమన్ తెలిపారు. ప్రస్తుతం తమన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
