Begin typing your search above and press return to search.

నూడుల్స్ ని ఫ్రైడ్ రైస్ చేసిన త్రివిక్రమ్

సినిమా వేదికలపై దర్శకులను ఆకాశానికి ఎత్తేయడం మ్యూజిక్ డైరెక్టర్లకు అలవాటైన పనే.

By:  M Prashanth   |   27 Oct 2026 9:53 PM IST
నూడుల్స్ ని ఫ్రైడ్ రైస్ చేసిన త్రివిక్రమ్
X

సినిమా వేదికలపై దర్శకులను ఆకాశానికి ఎత్తేయడం మ్యూజిక్ డైరెక్టర్లకు అలవాటైన పనే. అయితే 'ఆదర్శ కుటుంబం' ఈవెంట్ లో తమన్ మాట్లాడిన తీరు మాత్రం రొటీన్ పొగడ్తల్లా సాగలేదు. తన మైండ్ లో ఆలోచనలు నూడుల్స్ లా చిక్కుకుపోయినప్పుడు త్రివిక్రమ్ దగ్గరకు వెళ్తే, వాటిని చక్కటి ఫ్రైడ్ రైస్ లా చేసి పంపిస్తారంటూ ఆయన వేసిన పంచ్ వెనుక ఒక బలమైన క్రియేటివ్ బాండింగ్ కనిపించింది. తన ఆలోచనా విధానాన్ని మాటల మాంత్రికుడు ఎలా మలిచారో చెప్పడానికి ఈ ఒక్క మాటే అద్దం పడుతోంది.

'అతడు' సమయంలో మణిశర్మ దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేస్తున్న రోజుల్లోనే త్రివిక్రమ్ ఆలోచనలు పది అడుగులు ముందుండేవని తమన్ గుర్తుచేసుకున్నాడు. ఒకప్పుడు లౌడ్ మ్యూజిక్ తో రొటీన్ ట్రాక్స్ ఇస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొన్న తమన్ గ్రాఫ్ ను 'అరవింద సమేత' సినిమాతో పూర్తిగా మార్చేశారు త్రివిక్రమ్. తనలోని అసలైన మెలోడీని, ఎమోషనల్ డెప్త్‌ను బయటకు తీసి, కెరీర్ లో నెక్స్ట్ లెవెల్ లీగ్ కు చేర్చిన గురువుగా ఆయన్ను తమన్ ఎంతగా ఓన్ చేసుకున్నాడో అర్థమవుతుంది.

హారిక హాసిని బ్యానర్‌పై అరవింద సమేత, అల వైకుంఠపురములో, భీమ్లా నాయక్, గుంటూరు కారం నుంచి ఇప్పుడు వస్తున్న AK 47 ప్రాజెక్ట్ దాకా రెండో హ్యాట్రిక్ కొడుతున్న సంగతి తెలిసిందే. నిర్మాత చినబాబు బడ్జెట్ పరిమితులు పెట్టకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపాడు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'OG' తమన్ చేతికి రావడం వెనుక కూడా త్రివిక్రమ్ మార్గదర్శకత్వమే కారణమనే నిజాన్ని బయటపెట్టారు.

నార్మల్ గా సంగీత దర్శకులు తమ ఆల్బమ్ గురించి గొప్పలు చెప్పుకుంటారు. కానీ తమన్ మాత్రం ఇది పాటల సినిమా కాదు, త్రివిక్రమ్ మాటల సినిమా అని చాలా నిజాయితీగా చెప్పేశాడు. ప్రేక్షకులు థియేటర్ల నుంచి ఇంటికి తీసుకెళ్లే బలమైన సంభాషణలు ఇందులో ఉన్నాయని గుర్తుచేశాడు. పాటల కంటే కథకే ప్రాధాన్యత ఇస్తూనే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం సరికొత్త జానర్స్ ట్రై చేశామని, జూక్ బాక్స్ లో ఏడు సరికొత్త థీమ్ ట్రాక్స్ రాబోతున్నాయని చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

క్రియేటివ్ ఫీల్డ్ లో ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని సరైన గాడిన పెట్టే ఒక బలమైన మార్గదర్శి తోడైతే ఫలితం ఎలా ఉంటుందో తమన్ ప్రయాణమే చెబుతోంది. చిక్కుముడుల ఆలోచనలను పక్కనపెట్టి కథకు ఏం కావాలో మాత్రమే రాబట్టుకునే దర్శకుడు దొరికినప్పుడు సంగీతం కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సరికొత్త ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.