తమన్ చేతిలో రాజాసాబ్ అస్త్రం!
టాలీవుడ్ లో తమన్ తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్ అన్నది ఎంత నిజమో, పాన్ ఇండియా రేంజ్ లో ఆయన ఇంకా తన మార్క్ చూపించలేకపోయారన్నది కూడా అంతే నిజం.
By: M Prashanth | 19 Nov 2025 5:07 PM ISTటాలీవుడ్ లో తమన్ తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్ అన్నది ఎంత నిజమో, పాన్ ఇండియా రేంజ్ లో ఆయన ఇంకా తన మార్క్ చూపించలేకపోయారన్నది కూడా అంతే నిజం. లోకల్ గా 'అల వైకుంఠపురములో', 'అఖండ' లాంటి సినిమాలతో రికార్డులు సృష్టించినా, నేషనల్ వైడ్ గా మారుమోగే ఆల్బమ్ మాత్రం ఆయన ఖాతాలో పడలేదు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ కు 'పుష్ప'తో దక్కిన గుర్తింపు చూశాక, తమన్ కు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
నిజానికి శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన 'గేమ్ చేంజర్' తమన్ జాతకాన్ని మారుస్తుందని అందరూ భావించారు. అదొక గోల్డెన్ ఛాన్స్. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఫలితం డిజాస్టర్ గా మారింది. కనీసం పాటలైనా నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాయా అంటే అదీ లేదు. 'జరగండి' లాంటి పాటలు ట్రోల్స్ కు గురయ్యాయే తప్ప, పాన్ ఇండియా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో తమన్ కెరీర్ లో మరో పెద్ద అవకాశం చేజారిపోయినట్లయింది.
మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ 'పుష్ప' సిరీస్ తో నేషనల్ అవార్డు రేంజ్ కు వెళ్ళిపోయాడు. అనిరుధ్ కూడా 'జవాన్', 'జైలర్' సినిమాలతో బాలీవుడ్ లోనూ పాగా వేశాడు. వీరిద్దరితో పోలిస్తే, అత్యధిక సినిమాలు చేస్తున్న తమన్ మాత్రం వెనుకబడిపోయాడు. తెలుగులో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నా, సరిహద్దులు దాటితే తమన్ మ్యూజిక్ వినిపించడం లేదనే విమర్శ బలంగా ఉంది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు తమన్ ముందున్న ఏకైక అస్త్రం ప్రభాస్ 'ది రాజా సాబ్'. 'గేమ్ చేంజర్' మిగిల్చిన చేదు అనుభవాన్ని చెరిపేసుకోవాలంటే, ఈ సినిమా ఆడియో బ్లాక్ బస్టర్ అవ్వడం తమన్ కు అత్యవసరం. ప్రభాస్ సినిమా కాబట్టి ఆటోమేటిక్ గా రీచ్ ఉంటుంది, కానీ కంటెంట్ తో ఆడియన్స్ ను కట్టిపడేయాల్సింది మాత్రం తమనే.
ముఖ్యంగా ఈ సినిమాలో ప్లాన్ చేసిన 'జాతర సాంగ్' పైనే తమన్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇది కేవలం తెలుగు మాస్ సాంగ్ లా కాకుండా, దేశమంతా ఊగిపోయేలా డిజైన్ చేయాల్సి ఉంది. ఈ పాట గనక క్లిక్ అయితేనే తమన్ కు పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా గేట్లు తెరుచుకుంటాయి. లేదంటే ఆయన కేవలం టాలీవుడ్ కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.
మొత్తానికి 'ది రాజా సాబ్' అనేది ప్రభాస్ కు హిట్ అవసరమో లేదో తెలియదు కానీ, తమన్ కు మాత్రం ఇది ఛాలెంజింగ్ సిచువేషన్. 'గేమ్ చేంజర్' చేసిన గాయం మానాలంటే, రాజా సాబ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేయక తప్పదు. మరి ఈ సారైనా తమన్ ఆ "పాన్ ఇండియా" కలని నిజం చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి.
