OG టూర్ కన్సర్ట్.. తమన్ 'హార్ట్ బ్రేక్'కు కారణమేంటి?
కానీ రెండోసారి కూడా వాతావరణం సహకరించకపోవడంతో మరోసారి ఈవెంట్ నిలిచిపోయింది.
By: M Prashanth | 14 Jun 2026 1:35 AM ISTస్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఓజీ టూర్ ఇండియా హైదరాబాద్ లైవ్ కన్సర్ట్ మరోసారి వాయిదా పడటంతో ఆయన ఎమోషనల్ అయ్యారు. భారీ వర్షం కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించగా, దీనిపై తమన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. నా హార్ట్ బ్రేక్ అయింది అంటూ తన మనసులోని బాధను అభిమానులతో పంచుకున్నారు.
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న బౌల్డర్ హిల్స్ వేదికగా జూన్ 13న ఆ మెగా మ్యూజికల్ ఈవెంట్ గ్రాండ్ గా జరగాల్సి ఉంది. అయితే నగరంలో కురిసిన భారీ వర్షం, వాతావరణ పరిస్థితుల కారణంగా కార్యక్రమాన్ని నిర్వహించడం పాజిబుల్ కాలేదని నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షకుల భద్రతతో పాటు లైవ్ షోలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా తమన్ చేసిన పోస్ట్ అభిమానులను కదిలించింది. గత 45 రోజులుగా తాను, తన 56 మంది సభ్యులతో కూడిన టీమ్ రాత్రి, పగలు కష్టపడిందని ఆయన తెలిపారు. అభిమానుల నుంచి వచ్చిన ప్రతి సజెషన్ ను పాజిటివ్ గా తీసుకుంటూ, కన్సర్ట్ ను సక్సెస్ చేయాలని ప్రయత్నించామని చెప్పారు. కానీ చివరి నిమిషంలో నేచుర్ అడ్డుపడటం నిజంగా బాధ కలిగించిందన్నారు.
"కొన్ని సందర్భాల్లో దేవుడికి మనకంటే మంచి పామ్స్ ఉంటాయి. విధిని నమ్మక తప్పదు. ఇప్పుడు నాకు కావాల్సింది అభిమానుల ప్రేమ, నమ్మకం మాత్రమే. నా కమ్ బ్యాక్ ఎప్పుడూ మరింత బలంగా ఉంటుంది" అని తమన్ తన పోస్టులో పేర్కొన్నారు. వాస్తవానికి ఆ కన్సర్ట్ తొలుత జూన్ 6న నిర్వహించాలని ప్లాన్ చేశారు. అప్పట్లో కూడా వర్ష సూచనలు ఉండటంతో జూన్ 13కు వాయిదా వేశారు.
కానీ రెండోసారి కూడా వాతావరణం సహకరించకపోవడంతో మరోసారి ఈవెంట్ నిలిచిపోయింది. దీంతో ఆ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా వేదిక పరిసరాల్లో నీరు నిలిచిపోయిందని, షో కోసం సిద్ధం చేసిన పరికరాలు కూడా తడిసిపోయాయని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని కొనసాగించడం సేఫ్ కాదని టెక్నికల్ టీమ్ సూచించడంతో పూర్తి స్థాయిలో రద్దు చేసినట్లు వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ జోష్ ను అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసేందుకు తమన్ ఆ టూర్ ను రెడీ చేశారు. హైదరాబాద్ తో ప్రారంభించి బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాల్లో కూడా కన్సర్ట్ లు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేశారు. అయితే హైదరాబాద్ కార్యక్రమానికి కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఇక సినిమాల పరంగా కూడా తమన్ బిజీగా ఉన్నారు. పలువురు స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ వరుస ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు. అయితే ఎంతో ప్రేమతో సిద్ధం చేసిన ఆ మ్యూజికల్ కన్సర్ట్ వర్షం కారణంగా ఆగిపోవడం ఆయనను చాలా బాధపెట్టింది. అయినప్పటికీ అభిమానుల సపోర్ట్ తో మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తానన్న తమన్ నమ్మకం ఇప్పుడు ఆయన అభిమానుల్లో మరింత జోష్ నింపుతోంది.
