నాగార్జున కామెంట్స్‌పై థమన్ రియాక్షన్.. అసలు కారణం ఇదే!
సినిమాల ప్రొడక్షన్ పనులు, ఫస్ట్ కాపీని నెల రోజుల ముందే పూర్తి చేసుకోవాలంటూ గతంలో హీరో నాగార్జున చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తాజాగా స్పందించారు.
By: Madhu Reddy | 8 Aug 2026 11:35 PM ISTసినిమాల ప్రొడక్షన్ పనులు, ఫస్ట్ కాపీని నెల రోజుల ముందే పూర్తి చేసుకోవాలంటూ గతంలో హీరో నాగార్జున చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తాజాగా స్పందించారు. నాగార్జున చెప్పిన విషయం 100 శాతం సరైనదేనని, వర్క్ ముందే పూర్తయితే క్వాలిటీ ఇంకా బాగా వస్తుందని ఆయన అంగీకరించారు. అయితే నేటి సినీ ఇండస్ట్రీలో ప్రాక్టికల్‌గా అది ఎందుకు సాధ్యం కావడం లేదు, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌పై పడే ప్రెజర్ ఏంటి అనే విషయాలను తమన్ క్లియర్‌గా వివరించారు..
నాగార్జున కామెంట్స్ ప్రాక్టికల్ కావా?:
గతంలో అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా వంటి సినిమాల సమయం నుంచి నాగార్జునగారు నెల రోజుల ముందే ఫస్ట్ కాపీ చూసేవారని, దానివల్ల కరెక్షన్స్ చేసుకోవడానికి సమయం ఉండేదని తమన్ అన్నారు. ప్రొడ్యూసర్‌గా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా ఆయన్నుంచి వచ్చిన ఆ మాటల్లో ఎంతో పెయిన్ ఉందన్నారు. ఇక ఎడిటింగ్ పనులు వన్ మంత్ ముందే పూర్తయిపోతే, తను కూడా నెలకు ముందే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చేస్తానని, కానీ చివరి నిమిషం వరకు మార్పులు జరగడం వల్ల ఆలస్యం అవుతుందని తమన్ స్పష్టం చేశారు.
లాస్ట్ మినిట్ ట్రిమ్మింగ్‌తో వచ్చే ఇబ్బందులు:
సినిమా మేకింగ్ 24 క్రాఫ్ట్స్‌లో మ్యూజిక్ అనేది చిట్టచివరి డిపార్ట్‌మెంట్. ఎడిటర్లు చివరి నిమిషం వరకు సీన్లను కట్ చేయడం లేదా ట్రిమ్ చేయడం చేస్తుంటారు. ఎడిటింగ్ పూర్తయ్యాకే రీ-రికార్డింగ్ పనులు సాగుతాయి. ఇక సీన్ మారినప్పుడు, రెండు రీళ్ల మధ్య సౌండ్ ఓవర్‌లాప్ అవ్వకుండా స్మూత్‌గా మార్చడం, డైలాగ్స్ పైకి మ్యూజిక్ రాకుండా చూసుకోవడం వంటి సాంకేతిక అంశాలకు సమయం పడుతుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఆలస్యం చేస్తున్నారనే టాక్ వచ్చినా, అసలు లోపం ట్రిమ్మింగ్ ప్రాసెస్ వల్లే జరుగుతుందని ఆయన తెలిపారు.
క్యూబ్ డిస్పాచ్, ఓవర్సీస్ ప్రెజర్:
సినిమా రిలీజ్ విషయంలో క్యూబ్ ద్వారా డిజిటల్ కంటెంట్ పంపడం కూడా ప్రధాన సవాలుగా మారిందన్నారు. 'లెనిన్' లాంటి సినిమాలు సోలోగా రిలీజ్ అయినప్పుడు ఇబ్బంది ఉండదు కానీ, సంక్రాంతి వంటి పండుగ సీజన్లలో ఏకంగా 10 సినిమాలు వరుసగా ఉన్నప్పుడు ప్రింట్లు కొట్టడానికి క్యూబ్‌పై విపరీతమైన భారం పడుతుందని తమన్ తెలిపారు. ఇక దీనికి తోడు యుఏఈ, సింగపూర్ వంటి దేశాల్లో సెన్సార్ పనుల కోసం 3 నుండి 5 రోజుల ముందే ఫైనల్ కాపీ పంపించాల్సి ఉంటుందన్నారు.
అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మార్పు:
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎర్లీగా పూర్తయితే ప్రొడ్యూసర్లకే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఎంతో సమయం దొరుకుతుందని, 10 సార్లు చెక్ చేసుకుని ఔట్‌పుట్‌ను మరింత అద్భుతంగా ఇవ్వవచ్చని తమన్ చెప్పారు. ఇక నాగార్జున గారు చెప్పినట్లు క్వాలిటీ పెరగాలంటే అన్ని క్రాఫ్ట్‌లు కలిసికట్టుగా ప్లాన్ చేసుకోవాలని, అప్పుడే చివరి నిమిషం హడావుడి తగ్గుతుందని తమన్ అభిప్రాయపడ్డారు.
