చిరు సినిమాపై తమన్ మళ్లీ హైప్.. ఈసారి ఏమవుతుందో!
చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కాకా’పై తమన్ భారీ అంచనాలు పెంచుతున్నారు. డిసెంబర్ 1 నుంచి ప్రమోషన్లు ప్రారంభించి, జనవరి 13న బాక్సాఫీస్ వద్ద గట్టిగా కొడతామని ట్వీట్ చేశారు. గతంలో ‘గాడ్‌ఫాదర్’కు కూడా తమన్ ఇలాంటి హైప్ ఇచ్చినా, ఆశించిన స్థాయిలో సినిమా విజయం సాధించలేదు. ఈసారి మెగా అభిమానులు తమన్ సంగీతంపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
By: M Prashanth | 14 Nov 2026 4:14 PM ISTమెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతం అందించే అవకాశం వస్తే తమన్ హడావుడి మామూలుగా ఉండదు. పాటలు, బీజీఎం గురించి రిలీజ్‌కు ముందే భారీగా హైప్ పెంచుతూ ఉంటారు. గతంలో 'గాడ్‌ఫాదర్' సమయంలోనూ ఇలాగే అంచనాలు పెంచారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాకా' విషయంలో మరోసారి తమన్ నుంచి అలాంటి కామెంట్స్ వచ్చాయి. ఈసారి ఏకంగా సంక్రాంతి బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.
డిసెంబర్ 1 నుంచి 'కాకా' ప్రమోషన్ల సందడి మొదలుపెడతామని తమన్ ప్రకటించారు. జనవరి 13న గట్టిగా కొడతామని, ఇది ఫిక్స్ అంటూ ధీమా వ్యక్తం చేశారు. చిరంజీవిని ఉద్దేశించి 'బాస్ మెగాస్టార్ ర్యాంపేజ్' అని కూడా రాసుకొచ్చారు. తమన్ కామెంట్స్ చూస్తే సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతోంది. అయితే ఇంతకుముందు కూడా చిరంజీవి సినిమాకు తమన్ ఇదే స్థాయిలో హైప్ ఇచ్చారు.
చిరంజీవితో తమన్ చేసిన మొదటి సినిమా 'గాడ్‌ఫాదర్'. 2022లో విడుదలైన ఈ చిత్రానికి తమన్ పాటలు, బీజీఎం అందించారు. ముఖ్యంగా 'నజభజ' సాంగ్‌తో పాటు కొన్ని ఎలివేషన్ సీన్లలో బీజీఎంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి చిరంజీవి నటించిన 'థార్ మార్ థక్కర్ మార్' పాట కూడా అప్పట్లో విడుదలైంది. అయితే మ్యూజిక్ విషయంలో వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే సినిమా బాక్సాఫీస్ ఫలితం అంత పెద్దగా లేదు.
ఇప్పుడు బాబీతో చిరంజీవి చేస్తున్న 'కాకా'కు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మంచి విజయం సాధించింది. అయితే ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. 'బాస్ పార్టీ', 'పూనకాలు లోడింగ్' వంటి పాటలు హిట్ అయ్యాయి. దీంతో ఈసారి చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగ్గ పాటలు అందించాల్సిన బాధ్యత తమన్‌పై ఉంది.
మరోవైపు 'కాకా' విషయంలో రిలీజ్ వాయిదా పడుతుందనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై రచయిత కోన వెంకట్ ఇప్పటికే స్పందిస్తూ జనవరి 13న సినిమా వస్తుందని చెప్పారు. ఇప్పుడు తమన్ కూడా అదే తేదీని ప్రస్తావించారు. డిసెంబర్ 1 నుంచి ప్రమోషన్లు మొదలవుతాయని చెప్పడంతో సినిమా రిలీజ్ ప్లాన్‌పై చిత్రబృందం మరోసారి క్లారిటీ ఇచ్చినట్లయింది.
ఇక 'కాకా' కోసం డిసెంబర్లో అమెరికాలో ఓ పాటను భారీగా విడుదల చేసే ప్లాన్ ఉన్నట్లు తమన్ గతంలో చెప్పారు. అయితే డిసెంబర్ 1న ఏ అప్డేట్ ఇస్తారనేది ఇంకా ప్రస్తావించలేదు. చిరంజీవి, బాబీ కాంబినేషన్లో రెండో సినిమా కావడంతో ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. తమన్ కూడా బాక్సాఫీస్ గురించి ఇంత గట్టిగా చెబుతుండటంతో డిసెంబర్ నుంచి వచ్చే పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌పై మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
