సెకండాఫ్ దెబ్బకు కీబోర్డులు పియానో విరిచేసాడు
బాలయ్య బాబు 400 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చారు. అఖండ 2 ఏకంగా 250 కోట్లు వసూలు చేస్తుంది! అని ఒక అంచనా చెప్పారు ఎస్.ఎస్.థమన్.
By: Sivaji Kontham | 14 Nov 2025 10:39 PM ISTనందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ 2` డిసెంబర్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. అత్యంత భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. ఎన్బీకే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా రాక కోసం వేచి చూస్తుండగా, ఒక్కో సింగిల్ రిలీజ్ చేస్తూ బోయపాటి టీమ్ ప్రచారంలో వేగం పెంచింది.
అఖండ 2 గురించి సంగీత దర్శకుడు థమన్ తాజా ఈవెంట్లో బోల్డ్ కామెంట్స్ చేసాడు. ముంబైలో ఇటీవల జరిగిన పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో థమన్ మాట్లాడుతూ ``ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒక్కటే మనం చెల్లించే మొత్తం టికెట్ ధరకు సరిపోతుంద`ని అన్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి బయటకు రావచ్చు. అది మీ 500 రూపాయల విలువకు సరిపోయే ట్రీట్ అవుతుంది`` అని థమన్ అన్నారు.
సంగీతం గురించి తాను చాలా శ్రమించానని థమన్ ఈ వేదికపై అన్నారు. మొదటి భాగానికి సంగీతం పూర్తి చేసేసరికి ఇక అంతా పూర్తయిందని అనుకున్నాను.. సెకండాఫ్ చూసేప్పటికి అసలు కథ మళ్లీ మొదటికి వచ్చిందని థమన్ అన్నారు. సెకండాఫ్ మొదటి భాగం కంటే చాలా పెద్దది. దానికోసం చాలా పని చేయాల్సి వచ్చింది. నా పనికి రెండు మూడు కీబోర్డులు, పియానో కూడా విరిగిపోయాయి! అని చెప్పారు థమన్.
బాలయ్య బాబు 400 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చారు. అఖండ 2 ఏకంగా 250 కోట్లు వసూలు చేస్తుంది! అని ఒక అంచనా చెప్పారు ఎస్.ఎస్.థమన్. బాలయ్య బాబు సినిమాలను తాను ఒక కేస్ స్టడీలాగా చూస్తానని కూడా థమన్ అన్నారు. ఇది పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్ లాంటిది. ఎలా పాసవ్వాలి.. ఎలా ఉత్తమంగా సంగీతం అందించాలి? అని ఆలోచించాను. ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తావు? నా అభిమానుల కోసం ఏం చేస్తావు? అని కూడా నన్ను బాలయ్య బాబు ప్రశ్నించారు. పైగా నా పేరుకు నందమూరి ట్యాగ్ ఉంది. అందుకే నేను దీనికోసం చాలా శ్రమించాను అని కూడా థమన్ వ్యాఖ్యానించారు.
అఖండ 2 ప్రచార వేదికపై థమన్ వ్యాఖ్యలు నిజానికి బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబోపై మరింత అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ఈ సినిమా 250 కోట్లు వసూలు చేస్తుందని థమన్ ధీమాగా చెబుతుండడం ఫ్యాన్స్ ని ఎగ్జయిట్ చేస్తోంది. ఇక థమన్ వేదికపై మాట్లాడుతూ ఉంటే ఎన్బీకే, బోయపాటి ముఖాల్లో వెలుగులు కనిపించాయి.
ఇదే ప్రచార వేదికపైనే ఎన్బీకే మాట్లాడుతూ.. ``ఇలాంటి భారీ సినిమాని తెరకెక్కించడం అంత సులువు కాదు. ఇతరులు సంవత్సరాలు తీసుకుంటుంటే, తాము 130 రోజుల్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశాం`` అని తెలిపారు. ఈ చిత్రం భారతీయ సినీరంగంలో చరిత్ర సృష్టిస్తుందని ఎన్బీకే గర్వంగా పేర్కొన్నారు. ``అఖండ అనేది సాధారణమైన చిత్రం కాదు.. అఖండ 2 సినిమా కంటే చాలా పెద్దది.. అంతకంటే ఉత్తమమైన సినిమా.. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సినిమాను చూపించాలి.. కంటెంట్ పవర్ అలాంటిది`` అని అన్నారు.
స్వరకర్త థమన్ పైనా ఎన్బీకే ప్రశంసలు కురిపించారు. తమ కలయికలో మరిన్ని హిట్‌లను కూడా ఇస్తామని వ్యాఖ్యానించారు. హర్షాలీ పాత్ర, ఆది పినిశెట్టి పాత్ర మాసీగా ఉంటాయని కూడా అన్నారు. డిసెంబర్ 5న వస్తున్న అఖండ 2 పాన్-ఇండియా సెన్సేషన్ అవుతుందని ఎన్బీకే నమ్మకం వ్యక్తం చేసారు. తేజస్విని నందమూరి ఎం సమర్పణలో 14 రీల్స్ ప్లస్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది.
