దళపతి వీడ్కోలు: భావోద్వేగంతో ఊగిపోయిన ఫ్యాన్స్
వేదికపై అభిమానులనుద్ధేశించి విజయ్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. అతడు స్పీచ్ ఇస్తున్నంతసేపూ ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు.
By: Sivaji Kontham | 28 Dec 2025 4:34 PM ISTదళపతి విజయ్ తన కెరీర్ చిట్ట చివరి సినిమాలో నటిస్తున్నాడు. అతడు నటించిన జననాయగన్ (జననాయకుడు) తమిళం, తెలుగు సహా పలు భాషల్లో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కి నిర్మాతలు సర్వసన్నాహకాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మలేషియాలో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుక.. విజయ్ కి చిట్టచివరి వీడ్కోలు సభగా మారింది. ఈ సభ చాలా ఉత్కంఠకు, ఉద్వేగాలకు నెలవుగా మారింది.
వేదికపై అభిమానులనుద్ధేశించి విజయ్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. అతడు స్పీచ్ ఇస్తున్నంతసేపూ ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. ఎంతో మదనపడ్డారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. హృదయ విదారకంగా బాధపడ్డారు. అందుకు సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు.. ఈ వేదికపై విజయ్ కూడా తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు. అతడు తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. నా అభిమానులు నా కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు.. ఇప్పుడు నేను వారి కోసం సినిమాలను వదులుకుంటున్నాను! అని ఆయన అన్నారు. దళపతి అత్యంత భావోద్వేగభరితమైన వీడ్కోలు సందేశాలలో ఇది ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఇదే వేదికపై దళపతి విజయ్ ఫ్రీస్టయిల్ డ్యాన్సులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తన పాటకు తానే నృత్యం చేస్తూ అభిమానుల కోరికను నెరవేర్చిన విజయ్, ఫ్యాన్స్ కి సలాం కొట్టి నిష్కృమించిన వీడియో వైరల్ అవుతోంది. దళపతి క్లాసిక్ సాంగ్ `కచ్చేరి`ని ఆలపిస్తూ, అతడు నృత్యం చేశాడు. ఇది అభిమానులకు నిజమైన విందుగా మారింది. జన నాయగన్ ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది.
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలోను భారీగా విడుదల కానుంది. ఇక్కడ ప్రభాస్ నటించిన- ది రాజా సాబ్, చిరంజీవి - మన శంకరవరప్రసాద్ గారు, రవితేజ - భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలతో జననాయకుడు పోటీపడనున్నాడు. జననాయకుడు చిత్రానికి అఖండ చిత్రం స్ఫూర్తి అని సాగించిన ప్రచారానికి దర్శకుడు హెచ్.వినోద్ తెర దించిన సంగతి తెలిసిందే.
