తమిళ హీరో విజయ్ కు మన విజయ్ సపోర్ట్.. ఆలోచించాల్సిందే!
అయితే, కంటెంట్ లీక్ అవ్వడంపై ఇప్పటికే మేకర్స్ లీగల్ నోటీసులు జారీ చేయగా, తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఇష్యూపై స్పందించారు.
By: M Prashanth | 11 April 2026 11:44 AM ISTకోలీవుడ్ స్టార్ విజయ్ ‘జన నాయగన్’కు సంబంధించిన కీలక సన్నివేశాలు లీక్ అవ్వడం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. హెచ్ వినోత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విజయ్ పొలిటికల్ లీడర్ గా బిజీ అవుతున్న తరుణంలో వస్తున్న సినిమా కావడం వలన మార్కెట్ లో డిమాండ్ అయితే మామూలుగా లేదు. అయితే, కంటెంట్ లీక్ అవ్వడంపై ఇప్పటికే మేకర్స్ లీగల్ నోటీసులు జారీ చేయగా, తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఇష్యూపై స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. పైరసీ వల్ల చిత్ర బృందం పడే బాధ ఎలా ఉంటుందో వివరిస్తూ ఆయన తన మద్దతు తెలిపారు. విజయ్ దేవరకొండ తన పోస్ట్‌లో ‘జన నాయగన్’ లీక్ తనను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందని పేర్కొన్నారు. తన కెరీర్ మొదట్లో ‘టాక్సీవాలా’ వంటి సినిమాల సమయంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని, ఆ సమయంలో కలిగే వేదన వర్ణనాతీతమని గుర్తు చేసుకున్నారు.
ఒక సినిమా వెనుక దర్శకులు, నిర్మాతలు, నటీనటుల కలలు ఉంటాయని, ఇలాంటి లీకుల వల్ల వారంతా ఒక టార్గెట్‌లా మారిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిని త్వరగా గుర్తించాలని, లేదంటే ఇది వ్యవస్థ వైఫల్యంగా మారుతుందని ఆయన ఘాటుగా స్పందించారు. ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడుతూ వస్తుండటం వల్ల ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సాధారణంగా విజయ్ నటించిన సినిమాలు ఓపెనింగ్ డే రోజే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధిస్తుంటాయి. గత చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 126 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. కానీ ఇలాంటి లీకుల వల్ల సస్పెన్స్ ఎలిమెంట్స్ బయటకు వస్తే, అది బాక్సాఫీస్ వసూళ్లపై, ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ పై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ ఇప్పటికే రూ. 100 కోట్ల మార్కును దాటింది. నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. ఇలాంటి భారీ స్థాయి బిజినెస్ ఉన్నప్పుడు కంటెంట్ లీక్ అవ్వడం నిర్మాతలకు పెద్ద నష్టమే. అందుకే విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా స్పందిస్తూ పైరసీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. షూటింగ్ పనులు పూర్తి కావస్తున్న తరుణంలో ఈ లీక్ కలకలం రేపడం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.
మరోవైపు, లీకైన వీడియోలను షేర్ చేయవద్దని మేకర్స్ హెచ్చరిస్తున్నా, సోషల్ మీడియాలో కొన్ని క్లిప్పింగ్స్ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. దీనివల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం పడకుండా ఉండాలని చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వస్తున్న సినిమా కావడంతో దీనిపై పొలిటికల్ మైలేజ్ కూడా ఆధారపడి ఉంది. అందుకే ఈ మేటర్ ను కేవలం పైరసీగా మాత్రమే కాకుండా, ఒక ఇంటెన్షనల్ డ్యామేజ్ గా కూడా భావిస్తున్నారు. దేవరకొండ తన సపోర్ట్ తెలపడం ద్వారా ఈ ఇష్యూ పాన్ ఇండియా లెవల్లో చర్చకు దారితీసింది. ‘జన నాయగన్’ టీమ్ కు ఇప్పుడు అంతా అండగా నిలుస్తున్నారు. పైరసీ రక్కసిని అరికట్టడంలో ప్రేక్షకులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించి, గ్రాండ్ గా థియేటర్లలోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
