విజయ్ సినిమా లీక్ వ్యవహారం.. వేటు వేశారుగా..
సినిమా రంగంలో పైరసీ అనేది ఎప్పటి నుంచో పెద్ద తలనొప్పిగా మారింది. అయితే సినిమా విడుదల కాకముందే, ఏకంగా ఎడిటింగ్ రూమ్ నుంచే ఫుటేజ్ లీక్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు
By: M Prashanth | 25 April 2026 10:49 AM ISTసినిమా రంగంలో పైరసీ అనేది ఎప్పటి నుంచో పెద్ద తలనొప్పిగా మారింది. అయితే సినిమా విడుదల కాకముందే, ఏకంగా ఎడిటింగ్ రూమ్ నుంచే ఫుటేజ్ లీక్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రానికి ఇప్పుడు ఇలాంటి వింత పరిస్థితే ఎదురైంది. షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా విజువల్స్ నెట్టింట ప్రత్యక్షమవ్వడంతో చిత్ర యూనిట్ షాక్ అయ్యింది. ఈ లీక్ వ్యవహారం ఇప్పుడు ఒక టెక్నీషియన్ కెరీర్ పైనే వేటు పడేలా చేసింది.
అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా ఎడిటర్ ప్రదీప్ ఇ. రాఘవ్‌ను సౌత్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ (SIFEA) తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఎడిటింగ్ రూమ్ లో సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో అసోసియేషన్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్ అక్రమంగా ఎడిటింగ్ రూమ్‌లోకి ప్రవేశించి ఫుటేజీని దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ, ఆ బాధ్యత ఎడిటర్ పైనే ఉంటుందని అసోసియేషన్ భావించింది.
నిజానికి ప్రదీప్ రాఘవ్ ఇండస్ట్రీలో మంచి పేరున్న టెక్నీషియన్. ప్రదీప్ రంగనాథన్ కోమలి, డ్రాగన్ లాంటి సినిమాలకు పనిచేశారు. అయితే డైరెక్ట్ గా అతను ఈ పని చేయకపోయినా, తన టీమ్ పర్యవేక్షణలో తప్పు జరగడంతో నైతిక బాధ్యత వహించాల్సి వచ్చింది. కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్న సినిమా ఫుటేజ్ ఇలా బయటకు వెళ్లడం వల్ల నిర్మాతలకు జరిగే నష్టం భారీగా ఉంటుంది. అందుకే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని ఎడిటర్స్ అసోసియేషన్ ఈ హెచ్చరిక లాంటి చర్య తీసుకుంది.
ఈ లీక్ దెబ్బ ‘జన నాయగన్’ బిజినెస్‌పై గట్టిగానే పడేలా ఉంది. ఇప్పటికే కొన్ని హెచ్‌డీ సీన్లు బయటకు రావడంతో ప్రేక్షకుల్లో ఉన్న క్యూరియాసిటీ దెబ్బతింటుందని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో ఇలాంటి వివాదాలు రావడం టీమ్ ను డిఫెన్స్ లో పడేసింది. ఎడిటింగ్ పనులు సగంలో ఉండగా ప్రధాన ఎడిటర్ సస్పెండ్ అవ్వడంతో ఆ పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విజయ్ చివరి సినిమా చుట్టూ ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంది. లీక్ వ్యవహారం ముగిసింది అనుకునేలోపే ఎడిటర్ సస్పెన్షన్ తో కొత్త రచ్చ మొదలైంది. పోలీసుల పూర్తి విచారణ తర్వాత మరిన్ని నిజాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటివరకు ఈ లీక్ గొడవ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగానే ఉంటుంది. మరి ఈ అడ్డంకులన్నీ దాటుకుని ‘జన నాయగన్’ థియేటర్లలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
