జన నాయగన్ లీక్ ఇష్యూ.. ఎడిటర్స్ అసోసియేషన్ రెస్పాన్స్ ఏంటి?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లీడ్ రోల్ లో రూపొందిన జన నాయగన్ మూవీ విడుదలకు ముందే లీక్ కావడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
By: M Prashanth | 13 April 2026 10:24 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లీడ్ రోల్ లో రూపొందిన జన నాయగన్ మూవీ విడుదలకు ముందే లీక్ కావడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఆ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. ఇంకా థియేటర్లలోకి రాకముందే క్వాలిటీ ప్రింట్ ఆన్ లైన్ లో బయటకు రావడం చిత్రబృందాన్ని షాక్ కు గురిచేసింది.
అదే సమయంలో ఆ లీక్ ఎలా జరిగిందన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ఎడిటింగ్ దశలోనే లీక్ జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో క్లిప్స్ లో కనిపించిన వాటర్ మార్క్ ఆధారంగా, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలోనే ఆ ఘటన జరిగి ఉండొచ్చని టాక్ నడుస్తోంది. అయితే ఆ ప్రచారాలపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ స్పందించింది.
ఆ అసోసియేషన్ అధ్యక్షుడు గోపీ కృష్ణ సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చారు. లీక్ వ్యవహారంపై తమ ప్రెస్ మీట్ లో ఏ ఒక్క పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీని కూడా ప్రస్తావించలేదని తెలిపారు. ఆ చిత్రానికి అనేక మంది వ్యక్తులు, పలు సంస్థలు పని చేశాయని వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. నిరాధారమైన వార్తలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, చిత్రబృందం ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. లీక్ కు సంబంధించి పలు డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లీక్ క్లిప్ లను అరికట్టేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. దాదాపు 300కి పైగా లింక్‌లను తొలగించినట్లు వెల్లడించారు.
చిత్రబృందం తరఫున లాయర్ కూడా కఠిన హెచ్చరిక జారీ చేశారు. సినిమా సన్నివేశాలను డౌన్లోడ్ చేయడం, షేర్ చేయడం, లేదా ఫార్వర్డ్ చేయడం చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పైరసీకి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. విజయ్ కెరీర్ లో చివరి సినిమా అయిన జన నాయగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే సెన్సార్ సర్టిఫికెట్ ప్రక్రియలో జాప్యం కారణంగా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే సినిమా లీక్ కావడం చిత్ర బృందాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆ ఘటనపై సినీ ప్రముఖులు ఇప్పటికే స్పందించారు.. మెగాస్టార్ చిరంజీవి, లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు విజయ్ కు మద్దతుగా నిలుస్తూ పైరసీని ఖండించారు. ఆ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉండగా, అసలు నిందితులు ఎవరో త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
