Begin typing your search above and press return to search.

ఆశ్చర్యపరుస్తున్న విజయ్ దళపతి ఆస్తుల విలువ.. మరి అప్పుల సంగతేంటి?

తమిళనాట అగ్ర హీరోగా వెలిగి, ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 'దళపతి' విజయ్ తన ఆస్తుల వివరాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

By:  Madhu Reddy   |   31 March 2026 9:48 AM IST
ఆశ్చర్యపరుస్తున్న విజయ్ దళపతి ఆస్తుల విలువ.. మరి అప్పుల సంగతేంటి?
X

తమిళనాట అగ్ర హీరోగా వెలిగి, ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 'దళపతి' విజయ్ తన ఆస్తుల వివరాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి నిలుస్తున్న ఆయన, పెరంబూర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్‌లో తన వేల కోట్ల సామ్రాజ్యాన్ని బయటపెట్టారు. వందల కోట్ల నగదు, ఖరీదైన కార్లు, స్థిరాస్తులతో పాటు ఆయనకు ఉన్న అప్పుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.

వందల కోట్ల డిపాజిట్లు.. చరాస్తుల జోరు!:

విజయ్ తన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయన వద్ద భారీగా చరాస్తులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలోనే ఏకంగా రూ. 213 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక మొత్తం చరాస్తుల విలువ రూ. 404.58 కోట్లుగా ఉంది. ఇక నగదు విషయానికి వస్తే విజయ్ వద్ద రూ. 2 లక్షలు, ఆయన భార్య సంగీత వద్ద రూ. 1 లక్ష ఉన్నట్లు తెలిపారు. సినిమా సంపాదనతో పాటు వడ్డీలు, అద్దెల ద్వారా ఆయనకు భారీగా ఆదాయం వస్తోంది. గత ఐదేళ్లలో ఆయన ఆదాయం రూ. 200 కోట్లు కూడా దాటడం గమనార్హం.

లగ్జరీ కార్లు.. కిలోల కొద్దీ బంగారం:

విజయ్‌కి కార్లంటే ఎంత ఇష్టమో ఆయన అఫిడవిట్ చూస్తే అర్థమవుతుంది. దాదాపు రూ. 14.35 కోట్ల విలువైన ఖరీదైన కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి. ఇక వీటిలో బీఎండబ్ల్యూ i7, టయోటా లెక్సస్, వెల్‌ఫైర్ వంటి లగ్జరీ వాహనాలతో పాటు సామాన్యులు వాడే మారుతీ స్విఫ్ట్, టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్‌ కూడా ఉండటం విశేషం. ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే, ఆయన వద్ద 883 గ్రాముల బంగారం (విలువ సుమారు రూ. 1.20 కోట్లు), రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు.

రూ. 200 కోట్ల విలువైన స్థిరాస్తులు:

చరాస్తులే కాకుండా స్థిరాస్తుల విషయంలోనూ విజయ్ వెనక్కి తగ్గలేదు. ఆయన పేరు మీద రూ. 198 కోట్ల విలువైన భూములు, భవనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆయన సొంతంగా సంపాదించినవి కాగా, మరికొన్ని వారసత్వంగా వచ్చినవి. అలాగే ఆయన భార్య సంగీత పేరు మీద కూడా రూ. 15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇక ప్రధానంగా చెన్నై పరిసర ప్రాంతాల్లోనే ఈ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కలిపితే విజయ్ ఆస్తుల విలువ సుమారు రూ. 600 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

అప్పులు లేని 'దళపతి'.. క్లీన్ ఇమేజ్!:

సాధారణంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు వందల కోట్ల అప్పులు ఉండటం చూస్తుంటాం. కానీ విజయ్ విషయంలో అది రివర్స్. తనకు ఎలాంటి అప్పులు లేవని ఆయన అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఆర్థికంగా ఇంత పటిష్టంగా ఉంటూ, అప్పులు లేకుండా ఉండటం విజయ్ క్రమశిక్షణకు నిదర్శనమని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అగ్ర హీరోగా సినిమాల్లో వందల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న విజయ్, ఇప్పుడు ఆ సంపదతో రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.