Begin typing your search above and press return to search.

ట్రావెల్ ప్లాన్స్‌కు బ్రేక్.. థాయిలాండ్ ఫ్రీ వీసా షాక్!

భారతీయులకు అత్యంత ఇష్టమైన పర్యాటక దేశం థాయిలాండ్ పర్యాటకులకు ఊహించని షాక్ ఇచ్చింది.

By:  Madhu Reddy   |   23 May 2026 1:51 PM IST
ట్రావెల్ ప్లాన్స్‌కు బ్రేక్.. థాయిలాండ్ ఫ్రీ వీసా షాక్!
X

భారతీయులకు అత్యంత ఇష్టమైన పర్యాటక దేశం థాయిలాండ్ పర్యాటకులకు ఊహించని షాక్ ఇచ్చింది. భారత్‌తో సహా 93 దేశాల వారికి ఇన్నాళ్లూ అందుబాటులో ఉన్న '60 రోజుల ఉచిత వీసా' (వీసా ఫ్రీ) సదుపాయాన్ని పూర్తిగా రద్దు చేస్తూ థాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదం పొందిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై భారతీయులు థాయిలాండ్ వెళ్తే కేవలం 'వీసా ఆన్ అరైవల్' ద్వారా తక్కువ రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి లభిస్తుంది. దీంతో ఎక్కువ రోజులు అక్కడ గడపాలనుకునే పర్యాటకుల ప్లాన్స్‌కు గట్టి బ్రేక్ పడింది.ఆ వివరాలు చూద్దాం..

కేబినెట్ కీలక నిర్ణయం.. ఎందుకంటే?:

థాయిలాండ్ కేబినెట్ తాజాగా మే 19న సమావేశమై ఈ కొత్త వీసా నిబంధనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో పర్యాటక రంగాన్ని పెంచేందుకు 2024 జూలైలో భారతీయులకు 60 రోజుల ఉచిత వీసాను ప్రకటించారు. అయితే, ఈ సుదీర్ఘ కాల పరిమితి వల్ల అక్రమ చొరబాట్లు, అంతర్జాతీయ నేరాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి భద్రతా సమస్యలు పెరుగుతున్నాయని థాయ్ అధికారులు గుర్తించారు. ఇక అందుకే దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఈ సదుపాయాన్ని రద్దు చేశారు.

15 రోజులకు పరిమితం:

కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కింద థాయిలాండ్ చేరుకున్నాక కేవలం 15 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఇందుకోసం ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ థాయిలాండ్‌లో అంతకంటే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే, ప్రయాణానికి ముందే ఇ-వీసా (e-Visa) లేదా ఇతర తగిన వీసాల కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి.

నిబంధనల్లో మరికొన్ని మార్పులు:

కేవలం భారత్‌కే కాకుండా మొత్తం వీసా విధానంలోనే థాయిలాండ్ పెద్ద మార్పులు చేసింది. 30 రోజుల వీసా మినహాయింపు ఉన్న దేశాల సంఖ్యను 57 నుంచి 54కి తగ్గించారు. అలాగే వీసా ఆన్ అరైవల్ పొందే దేశాల జాబితాను కూడా భారీగా తగ్గించి, కేవలం 4 దేశాలకే పరిమితం చేశారు. ఈ కొత్త నిబంధనలన్నీ అక్కడి అధికారిక గెజిట్లో ప్రచురించిన 15 రోజుల తర్వాత నుండి పూర్తి స్థాయిలో అమలులోకి రానున్నాయి.

ఎవరికి ఇబ్బంది:

థాయిలాండ్‌లో ఎక్కువ రోజులు ఉంటూ పని చేసే బ్యాక్‌ప్యాకర్లు, ఫ్రీలాన్సర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఈ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. థాయ్ పర్యాటక మంత్రి సురసక్ ఫంచారోయెన్ వోరాకుల్ మాట్లాడుతూ.. కేవలం పర్యాటకుల సంఖ్యను పెంచడం కంటే, నాణ్యమైన మరియు సురక్షితమైన పర్యాటకానికే తాము ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ కొత్త వీసా రూల్స్ వల్ల భారత్-థాయిలాండ్ పర్యాటకంపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ, తక్కువ రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కాబట్టి, థాయిలాండ్ వెళ్లాలనుకునే వారు ఇప్పుడు ప్రయాణానికి ముందే తాజా వీసా గైడ్‌లైన్స్‌ను చెక్ చేసుకోవడం మంచిది.