Begin typing your search above and press return to search.

సినిమాల్ని మించిన రియల్ పోలీస్ స్టంట్లు!

సినిమాల్లో హీరోలు విలన్లను పట్టుకోవడానికి రకరకాల మారువేషాలు వేస్తుంటే థియేటర్లలో చప్పట్లు కొడతాం. కానీ, నిజ జీవితంలో పోలీసులు లేడీ డాన్సర్లుగా మారి నిందితుడిని ఆటపట్టించి మరీ పట్టుకున్నారు.

By:  Madhu Reddy   |   26 May 2026 9:56 AM IST
సినిమాల్ని మించిన రియల్ పోలీస్ స్టంట్లు!
X

సినిమాల్లో హీరోలు విలన్లను పట్టుకోవడానికి రకరకాల మారువేషాలు వేస్తుంటే థియేటర్లలో చప్పట్లు కొడతాం. కానీ, నిజ జీవితంలో పోలీసులు లేడీ డాన్సర్లుగా మారి నిందితుడిని ఆటపట్టించి మరీ పట్టుకున్నారు. థాయిలాండ్‌లో జరిగిన ఈ రియల్ లైఫ్ యాక్షన్ డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఖాకీల చాకచక్యం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సినిమాలను తలపించే ఆ నమ్మశక్యం కాని కథేంటో చూద్దాం..

డ్రగ్స్ కేటుగాడికి స్కెచ్:

థాయిలాండ్‌లోని లోప్‌బురి ప్రావిన్స్, థా లువాంగ్ జిల్లాలో ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉన్నాడు. వాడు మామూలోడు కాదు.. డ్రగ్స్ అమ్మడం, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నిర్వహించడంలో ఆరితేరిపోయాడు. వాడిని పట్టుకోవాలని పోలీసులు ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకు పోలీసుల జాడ గమనిస్తే ముందే తప్పించుకునేవాడు. ఈసారి మాత్రం ఎలా అయినా అతడిని పట్టుకోవాలని పోలీసులు చక్కని ప్లాన్ సిద్ధం చేశారు.

లేడీ డాన్సర్లుగా మారిన ఖాకీలు:

ఆ నిందితుడికి అమ్మాయిల డ్యాన్స్ అంటే పడిచస్తాడని పోలీసులకు తెలిసింది. ఇంకేముంది, వాడి బలహీనతనే పోలీసులు ఆయుధంగా మార్చుకున్నారు. ఇక ఇద్దరు మగ పోలీసులు ఏకంగా మహిళా డాన్సర్లుగా గెటప్ మార్చేశారు. రంగురంగుల దుస్తులు, మేకప్, విగ్గులు వేసుకుని అచ్చం ప్రొఫెషనల్ లేడీ డాన్సర్లలా తయారయ్యారు. వాళ్లను చూస్తే అసలు పోలీసులనే అనుమానం ఎవరికీ రాదు, అంతలా ఒదిగిపోయారు.

వల వేసి పట్టేశారు: ప్లాన్ ప్రకారం ఆ 'కళాకారులు' నిందితుడు ఉన్న చోటికి వెళ్లారు. అక్కడ హంగామా చేస్తూ, డాన్స్ చేస్తూ వాడికి దగ్గరయ్యారు. నిందితుడు కూడా వాళ్లను చూసి నిజమైన మహిళా డాన్సర్లే అనుకుని ఫుల్ ఖుషీ అయిపోయాడు. ఇక వాడు మైమరచిపోయిన టైం లో పోలీసులు ఒక్కసారిగా తమ అసలు రూపం చూపించారు. ఇంకేముంది.. క్షణాల్లో వాడి చేతులకు బేడీలు పడిపోయాయి.

ఫొటో వైరల్.. నెటిజన్లు ఫుల్ ఖుష్:

నిందితుడిని పట్టుకున్నాక, ఆ లేడీ డాన్సర్ల గెటప్‌లోనే పోలీసులు వాడితో కలిసి ఫొటోలు దిగారు. ఇక ఇప్పుడు ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. "పోలీసుల ఐడియా అద్భుతం", "డ్యూటీ కోసం ఎంతకైనా లొంగుతారు" అంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు. ఆ పోలీసుల నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తప్పులేదంటున్నారు.

నేరస్థులు ఎంత తెలివిగా తప్పించుకోవాలని చూసినా, చట్టం ముందు తలవంచక తప్పదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇక సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ పోలీసులు అవసరమైతే ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారని థాయిలాండ్ పోలీసులు నిరూపించారు. ఇక బాధ్యత గల డ్యూటీలో ఉంటూనే, ఇలాంటి క్రియేటివ్ ఐడియాతో నిందితుడిని పట్టుకున్న ఆ పోలీసులను మెచ్చుకుని తీరాల్సిందే.