రీల్ బాడీ డబుల్.. రియల్ గ్రాండ్ స్లామ్ ప్లేయర్!
ఐదేళ్ల క్రితం 'కింగ్ రిచర్డ్' షూటింగ్ సమయంలో 12 ఏళ్ల వయసున్న థే ఫ్రాడిన్, సెరెనా విలియమ్స్ టెన్నిస్ షాట్లను రీ క్రియేట్ చేయడానికి ఎంపికైంది.
By: Srikanth Kontham | 1 Sept 2026 5:00 PM ISTసినిమా రీల్స్‌పై ఐకానిక్ క్రీడాకారుల పాత్రలకు ప్రతిరూపంగా కనిపించిన వ్యక్తులు నిజ జీవితంలో అదే క్రీడలో అగ్రస్థానానికి చేరుకోవడం అత్యంత అరుదుగా జరుగుతుంది. 2021లో ఆస్కార్ విన్నింగ్ మూవీ `కింగ్ రిచర్డ్` చిత్రంలో దిగ్గజ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ చిన్ననాటి పాత్రకు బాడీ డబుల్‌గా నటించిన 17 ఏళ్ల అమెరికన్ టెన్నిస్ సంచలనం థే ఫ్రాడిన్ ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక యుఎస్ ఓపెన్ ప్రధాన డ్రాలో అడుగుపెట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఐదేళ్ల క్రితం 'కింగ్ రిచర్డ్' షూటింగ్ సమయంలో 12 ఏళ్ల వయసున్న థే ఫ్రాడిన్, సెరెనా విలియమ్స్ టెన్నిస్ షాట్లను రీ క్రియేట్ చేయడానికి ఎంపికైంది.
విల్ స్మిత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాలో సెరెనా పాత్ర ధరించిన నటి తరఫున కోర్టులో కష్టమైన టెన్నిస్ షాట్లను కొడుతూ ఆమె బాడీ డబుల్‌గా పనిచేసింది. ఆ సమయంలో సెరెనా ఐకానిక్ షాట్లను అనుకరించడంలో మునిగిపోయిన ఫ్రాడిన్ షూటింగ్ పూర్తయ్యాక నిజ జీవితంలో కూడా సెరెనా లాగే షాట్లు కొట్టడం అలవాటు చేసుకుంది. చివరికి ఆమె కోచ్‌లు కష్టపడి మళ్లీ ఫ్రాడిన్ సొంత శైలికి తీసుకొచ్చారు.
సినీ రంగానికి పరిమితం కాకుండా టెన్నిస్ కోర్టులో ప్రతిభను చాటుకున్న థే ఫ్రాడిన్ ప్రతిష్టాత్మక USTA బిల్లీ జీన్ కింగ్ గర్ల్స్ 18స్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంతో 2026 యుఎస్ ఓపెన్ వైల్డ్ కార్డ్ అర్హతను సాధించింది. గ్రాండ్ స్లామ్ టోర్నీలో ప్రధాన డ్రాకు అర్హత సాధించడం ద్వారా చిన్ననాటి కల నెరవేరిందని, ఇది తనకు దక్కిన గొప్ప అవకాశమని ఫ్రాడిన్ భావోద్వేగానికి గురైంది.
యుఎస్ ఓపెన్ మొదటి రౌండ్‌లోనే 17 ఏళ్ల యువ సంచలనానికి ఊహించని సవాలు ఎదురైంది. ప్రపంచ రెండో నంబర్ ర్యాంకర్ మాజీ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ ఎలెనా రైబకినాతో థే ఫ్రాడిన్ తలపడనుంది. కఠినమైన ప్రత్యర్థి అయినప్పటికీ కోర్టులో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి మ్యాచ్‌ను పోరాటపటిమతో ఎదుర్కోవడానికి తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని ఫ్రాడిన్ విశ్వాసం వ్యక్తం చేసింది.
ఇదే ఏడాది యుఎస్ ఓపెన్ టోర్నీలో ఫ్రాడిన్‌కు మరో అరుదైన అవకాశం దక్కింది. తన ఆరాధ్య దైవాలైన సెరెనా విలియమ్స్ -వీనస్ విలియమ్స్ ఇద్దరూ కూడా ఇదే టోర్నీలో డబుల్స్ విభాగంలో బరిలోకి దిగుతున్నారు. చిన్నతనం నుంచి ఏ విలియమ్స్ సిస్టర్స్‌ను చూసి ఆరాధించిందో? వారితో కలిసి ప్రాక్టీస్ కోర్టును పంచుకునే అవకాశం రావడం తన జీవితంలో మర్చిపోలేని కలగా భావిస్తున్నట్లు ఫ్రాడిన్ పేర్కొంది.
మొత్తానికి రీల్ లైఫ్‌లో విలియమ్స్ సిస్టర్స్ విజయగాథకు ప్రతిరూపంగా నిలిచిన థే ఫ్రాడిన్ నేడు రియల్ లైఫ్‌లో యుఎస్ ఓపెన్ వంటి అతిపెద్ద వేదికపై మెరవడం క్రీడా ప్రపంచంలో సరికొత్త కథనంగా మారింది. రీల్ బాడీ డబుల్ నుంచి రియల్ గ్రాండ్ స్లామ్ ప్లేయర్‌గా రూపాంతరం చెందిన ఫ్రాడిన్ ప్రయాణం రాబోయే తరం యువ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తోంది.
