తెలుగు మూవీ టీవీ డ్యాన్సర్స్ వివాదంలో కోర్టు షాకింగ్ ట్వస్టు!
ఇటీవలి కాలంలో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ మధ్య సృజనాత్మక రంగంలో ఎదురైన పోటీ, ఆధిపత్య పోరు .. వ్యక్తిగత విభేదాలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
By: Sivaji Kontham | 12 Sept 2026 11:52 AM ISTటాలీవుడ్‌లో మరోసారి వివాదాల నీడలు కమ్ముకున్నాయి. `తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్` (TFTDDA) వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసోసియేషన్ నిర్వహణను చేజిక్కించుకునేందుకు ఇరు వర్గాలు చేస్తున్న ప్రయత్నాలు చివరకు కోర్టు మెట్లు ఎక్కేలా చేశాయి.
గత డిసెంబర్ లో వి.వి. సుమలతా దేవి అధ్యక్షతన 2025-2027 కాలానికి ఎన్నికైన అధికారిక కార్యవర్గం చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తోంది. అయితే అప్పటి నుంచి వారి మధ్య విభేధాలు పొడసూపాయి. నిబంధనలను పక్కన పెట్టి కొందరు వ్యక్తులు యూనియన్‌పై పట్టు సాధించేందుకు తెరవెనుక ఒక వర్గం వ్యక్తులు ప్రయత్నించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేదా అనుమతులు లేకుండానే గత నెల ఆగస్టు 30న ఏకపక్షంగా సమావేశం ఏర్పాటు చేసి కొత్త కమిటీని ప్రకటించుకోవడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.
అంతటితో ఆగకుండా.. అసోసియేషన్ అధికారిక ఈమెయిల్ ఖాతాను హ్యాక్ చేసి.. జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు నకిలీ లెటర్లు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్యాంక్ ఖాతా లావాదేవీల హక్కులను, సంతకాలను మార్చేందుకు ఈ అనధికారిక యత్నాలు జరగడంతో అసోసియేషన్ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమైంది. కార్మికుల సంక్షేమం కోసం దాచుకున్న సుమారు నాలుగు కోట్ల రూపాయల నిధులను కాపాడుకోవడానికి బాధితులు వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 13న ఇందిరా నగర్‌లోని హోటల్ అనుపమ వేదికగా మరో సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రతివాదులు సన్నాహాలు చేశారు. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కూకట్‌పల్లి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కావ్య జాడ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదుల చర్యలను ప్రాథమికంగా తప్పుబట్టిన న్యాయస్థానం.. సెప్టెంబర్ 13న తలపెట్టిన జనరల్ బాడీ సమావేశంపై మధ్యంతర స్టే విధించింది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం కే రాఘవేంద్ర, వై మెహర్ బాబా తదితర ప్రతివాదులు అసోసియేషన్ పేరుతో లెటర్ హెడ్లు, ముద్రలు వాడకూడదని స్పష్టం చేశారు. అలాగే బ్యాంకులు లేదా ఇతర అధికారిక సంస్థలకు ఎలాంటి లేఖలు రాయరాదని హెచ్చరించారు. ఈ వివాదానికి సంబంధించి తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసిన న్యాయస్థానం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ వివాదం:
ఇటీవలి కాలంలో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ మధ్య సృజనాత్మక రంగంలో ఎదురైన పోటీ, ఆధిపత్య పోరు .. వ్యక్తిగత విభేదాలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డ్యాన్స్ డైరెక్టర్ల సంఘంలో ఆధిపత్యం కోసం.. అలాగే పెద్ద హీరోల సినిమాలకు పాటలు కంపోజ్ చేసే విషయంలో వీరిద్దరి మధ్య తరచూ మనస్పర్థలు తలెత్తుతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తుంటాయి. ఇండస్ట్రీలో తమదైన శైలితో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ఇద్దరు ప్రముఖ మాస్టర్ల మధ్య నెలకొన్న ఈ వార్.. టాలీవుడ్ తెరవెనుక రాజకీయాలపై రకరకాల చర్చలకు తావిస్తోంది.
రఘు మాస్టార్ అధ్యక్షుడిగా..?
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ సతీమణి వి.వి. సుమలతా దేవి కొనసాగుతుండగా.. మరో ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవడం టాలీవుడ్‌లో పెద్ద కలకలం రేపింది. అసోసియేషన్ నిధుల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని సుమలతా వర్గం ఆరోపించడం.. బైలా నిబంధనలకు విరుద్ధంగా కొందరు కొత్త ప్యానెల్‌ను తెరపైకి తెచ్చి రఘు మాస్టర్‌ను అధ్యక్షుడిగా ప్రకటించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఫెడరేషన్ మద్దతుతో రఘు మాస్టర్ వర్గం(శేఖర్ మాస్టర్ మద్ధతుతో) తమదే అసలైన కార్యవర్గమని వాదిస్తుండగా..తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా కొత్త కమిటీని ఎలా ప్రకటిస్తారని సుమలతా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ఆధిపత్య పోరు చివరకు పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు చేరడంతో పాటు.. ఇరువర్గాల వాదనలతో టాలీవుడ్‌లోని 24 క్రాఫ్ట్స్ కార్మిక సంఘాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
