Begin typing your search above and press return to search.

నా విజయానికి నందమూరి కుటుంబమే కారణం: TFPC కొత్త ట్రెజరర్ చదలవాడ

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కోలాహాలం గురించి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   6 Sept 2026 10:51 PM IST
నా విజయానికి నందమూరి కుటుంబమే కారణం: TFPC కొత్త ట్రెజరర్ చదలవాడ
X

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కోలాహాలం గురించి తెలిసిందే. 2026-28 సీజ‌న్ కి ఎన్నికైన కొత్త కార్య‌వ‌ర్గం ముందు పెను స‌వాళ్లు ఉన్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. నూతనంగా ట్రెజరర్‌గా ఎన్నికైన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ విజ‌యోత్స‌వం సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రతిరోజూ తమ ప్యానెల్‌కు హృదయపూర్వక సపోర్ట్ అందించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేశారు. ఎన్నికల్లో తమ టీమ్‌కు లభించిన భారీ మద్దతుపై సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో తనకు ఇంతటి భారీ మెజారిటీ రావడానికి నందమూరి కుటుంబమే ప్రధాన కారణమని చదలవాడ శ్రీనివాసరావు వెల్లడించారు. కారణజన్ముడు ఎన్టీఆర్ పుత్రుడు నందమూరి మోహన్ కృష్ణ తన నామినేషన్ పత్రాలపై సంతకం చేసి.. పోటీకి క్వాలిఫై అయ్యేలా రికమండ్ చేశారని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి మోహన్ కృష్ణ కు, అలాగే నందమూరి కుటుంబం మొత్తానికి మీడియా ముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల విజయంపై మాట్లాడుతూ.. నందమూరి కుటుంబ మద్దతుతో పాటు సీ. కళ్యాణ్, ప్రసన్న కుమార్ . తమ టీమ్ సభ్యులందరి సమష్టి కృషితోనే ఈ ఘనవిజయం సాధ్యమైందని చెప్పారు. తాము ఈ స్థాయిలో దాదాపు 99 శాతం స్థానాల్లో విజయం సాధిస్తామని ఊహించలేదని అన్నారు. గెలవడం అనేది మొదటి చాప్టర్ మాత్రమేనని.. భగవంతుని దయ వల్ల.. నిర్మాత దేవుళ్ల ఆశీస్సులతోనే ఈ ఫలితం దక్కిందని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చాక ఇండస్ట్రీకి, ముఖ్యంగా చిన్న నిర్మాతలకు చేయాల్సింది చాలా ఉందన్నారు. డిజిటల్ ప్రొజెక్షన్ సర్వీసులు అయిన క్యూబ్‌, యుఎఫ్ఓ ఛార్జీల భారాన్ని తగ్గించడం..అలాగే పబ్లిసిటీ ప్రచారాలు నేరుగా ఛాంబర్ నుంచే వెళ్లేలా చర్యలు తీసుకోవడం వంటి కీలక అంశాలను ఇప్పటికే అధ్య‌క్షుడు సీ. కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో క్రమం తప్పకుండా జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అనుభవజ్ఞులైన సీ. కళ్యాణ్, ప్రసన్న కుమార్ ల నాయకత్వంలో సినీ పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలలోని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీకి ఎంతో సపోర్టివ్‌గా ఉండటం తమకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పారు. నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు.. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి సహకారంతో అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తామని... తమను గెలిపించిన అందరికీ శతకోటి కృతజ్ఞతలు అని స‌మావేశం ముగించారు.