ప్రెస్‌మీట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. TFPC ఎన్నికల వేళ ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు
కౌన్సిల్ ఎదుగుదలకు.. సంక్షేమానికి పలువురు సినీ పెద్దలు అందించిన ఆర్థిక సహకారాన్ని ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ కొనియాడారు.
By: Sivaji Kontham | 3 Sept 2026 11:15 PM ISTతెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల సందర్భంగా ప్రముఖ నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ ప్రసంగిస్తూ గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలు- ప్యానెల్ అన్యాయాలను తీవ్రంగా నిరసించారు. గత ఎన్నికల్లో చదలవాడ శ్రీనివాసరావు హామీ ప్రకారం గిల్డ్ ప్రొడ్యూసర్లకు 16 సీట్లు, తమ(మండలి)కు 7 సీట్లు కేటాయించేలా ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. అయితే నందమూరి తారకరత్న ఆసుపత్రిలో ఉన్న క్లిష్ట సమయంలో... విత్‌డ్రా గడువు ముగిసే సమయంలో తమను బయటకు పంపి అవతలి వర్గం ఫుల్ ప్యానల్ వేసుకుని రాజకీయం చేశారని ఆరోపించారు. ఈ ఆకస్మిక పరిణామంతో చివరి నిమిషంలో వ్యూహం మార్చి చౌదరి గారిని వైస్ ప్రెసిడెంట్ నుండి సెక్రటరీగా, రామ సత్యనారాయణ గారిని ట్రెజరర్‌గా మార్చి పోటీకి దిగామని వివరించారు. గిల్డ్ వర్గానికి మెజారిటీ ఉన్నా సాధారణ నిర్మాతలు తమపై ఉంచిన నమ్మకంతో తమ ప్యానెల్‌కు ఏకంగా 9 పోస్టులు ఇచ్చి గెలిపించారని పేర్కొన్నారు.
కౌన్సిల్ కేవలం అధికారం కోసం మాత్రమే కాకుండా నిర్మాతల సంక్షేమం - చారిటీ కోసం పారదర్శకంగా పనిచేస్తుందని ప్రసన్నకుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కౌన్సిల్‌లోని 70 శాతం మంది వయోవృద్ధులైన నిర్మాతలకు ఉచిత డయాగ్నోస్టిక్ సేవలు, ఇన్సూరెన్స్ వసతి , క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. గతంలో సీనియర్ నటి - నిర్మాత అయిన ఝాన్సీ గారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆమెను `అమ్మ నాన్న` వృద్ధాశ్రమంలో చేర్పించి.. ప్రతినెల రూ. 5,000 నేరుగా అందేలా ఏర్పాట్లు చేశామని ఉదాహరణగా చెప్పారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది వంద శాతం పేద, వయోవృద్ధ నిర్మాతలను ఆదుకునే వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అని స్పష్టం చేశారు.
ఇక ఎన్నికల వేళ తలెత్తుతున్న నామినేషన్ల వివాదం .. కోర్టు నోటీసుల అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. నామినేషన్ల విత్‌డ్రాయల్ ప్రక్రియ అంతా కౌన్సిల్ బైలా నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా జరిగిందని చెప్పారు. నిర్ణీత సమయం (మధ్యాహ్నం 2 గంటల) దాటిన తర్వాత వచ్చిన విత్‌డ్రాయల్ అభ్యర్థనలను ఎలక్షన్ ఆఫీసర్ నిరాకరించారని తెలిపారు. కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని... స్క్రూటినీ సమయం పూర్తయిన తర్వాత (సాయంత్రం 6:53 కి) వాట్సాప్‌లో సందేశాలు పంపడం చట్టబద్ధం కాదని హితవు పలికారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగని ఎలక్షన్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ నిబంధనలకు అనుగుణంగానే నామినేషన్లను ఇన్వాలిడ్ చేశారని సమర్థించారు.
కౌన్సిల్ ఎదుగుదలకు.. సంక్షేమానికి పలువురు సినీ పెద్దలు అందించిన ఆర్థిక సహకారాన్ని ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ కొనియాడారు. 2019లో చదలవాడ శ్రీనివాసరావు గారు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, లైన్ ఇన్స్‌పెక్టర్లు, పేస్టింగ్ బాయ్స్ కోసం తన సొంత డబ్బులు కోట్లాది రూపాయలు ఇచ్చి ఆదుకున్నారని గుర్తుచేశారు. అంతేకాకుండా సునీల్ నారంగ్, నటుడు శివాజీ కూడా కౌన్సిల్‌కు భారీగా విరాళాలు అందించి సేవా కార్యక్రమాలకు తోడ్పడ్డారని చెప్పారు. చదలవాడ శ్రీనివాసరావు వంటి దయాగుణం ఉన్న ధర్మాత్ముడిని ట్రెజరర్‌గా నియమించడం కౌన్సిల్ నిధులకు ఎంతో రక్షణ - లాభదాయకమని అభిప్రాయపడ్డారు.
సౌత్ ఇండియన్ చాంబర్, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిర్వహణలో సి. కళ్యాణ్ గారికి అపారమైన అనుభవం ఉందని.. అలాగే ఆస్కార్ స్థాయిలో గుర్తింపు పొందిన నిర్మాత డివివి దానయ్య గారు తమ ప్యానెల్‌తో ఉన్నారని తుమ్మల తెలిపారు. కౌన్సిల్ ట్రెజరర్ రామ సత్యనారాయణ గారు ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ, రూపాయి కూడా ఎఫ్‌డీలు విత్‌డ్రా చేయకుండా సంస్థ నిధులను పదిలంగా కాపాడారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో సి. కళ్యాణ్ గారు ప్రతిపాదించిన సంక్షేమ ప్రణాళికలన్నింటినీ వంద శాతం అమలు చేస్తూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చారిటీని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
