ధనుష్ 'తేరే ఇష్క్ మే'.. టాక్ ఎలా ఉంది?
ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్ అంటేనే 'రాంఝణా' మ్యాజిక్ గుర్తొస్తుంది. మళ్లీ అలాంటి ఒక క్లాసిక్ లవ్ స్టోరీని ఆశించి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఈసారి కొంచెం మిక్స్ డ్ అనుభవమే ఎదురైంది.
By: M Prashanth | 28 Nov 2025 5:03 PM ISTధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్ అంటేనే 'రాంఝణా' మ్యాజిక్ గుర్తొస్తుంది. మళ్లీ అలాంటి ఒక క్లాసిక్ లవ్ స్టోరీని ఆశించి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఈసారి కొంచెం మిక్స్ డ్ అనుభవమే ఎదురైంది. ఈరోజు విడుదలైన 'తేరే ఇష్క్ మే' సినిమాపై బయట వినిపిస్తున్న టాక్ చూస్తుంటే.. ఇది అందరికీ నచ్చే సినిమా కాదని అర్థమవుతోంది. కేవలం హెవీ ఎమోషన్స్ ను భరించే వారికే ఇది ఎక్కుతుందనీ అంటున్నారు.
ఇందులో ధనుష్ పోషించిన శంకర్ పాత్ర చాలా వైల్డ్ గా డిజైన్ చేశారు. కోపం, ఆవేశం, అదుపులేని ప్రవర్తన చూస్తుంటే రీసెంట్ గా వచ్చిన 'యానిమల్' సినిమా హీరో షేడ్స్ గుర్తొస్తున్నాయని ఆడియన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీని తగలబెడతా అని అనడం కూడా అలానే ఉంది. ఒక వైలెంట్ స్టూడెంట్ ను మార్చడానికి హీరోయిన్ (కృతి సనన్) చేసే థీసిస్ ప్రయోగం, దాని చుట్టూ తిరిగే ప్రేమకథ వినడానికి కొత్తగా ఉన్నా.. తెరపై మాత్రం చాలా సాగదీసినట్లు అనిపిస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే ఎవరూ వంక పెట్టలేరు. ధనుష్ తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఆవేశం, బాధను కళ్ళతోనే పలికించి 'రెబల్ లవర్'గా మెప్పించాడు. ఇక కృతి సనన్ అయితే కొన్ని సీన్లలో ధనుష్ ను కూడా డామినేట్ చేసింది. అయితే వీరిద్దరి మధ్య వచ్చే స్మోకింగ్ సీన్స్ మరీ ఎక్కువగా ఉండటం, కథలో డ్రామా మోతాదు మించిపోవడం సాధారణ ప్రేక్షకుడికి కాస్త విసుగు తెప్పిస్తోందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
ఇక ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అని.. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని కొందరు చెబుతున్నారు. కానీ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉండటమే పెద్ద మైనస్ అని.. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని మరికొందరు చెబుతున్నారు. ఫస్టాఫ్ లో కొన్ని అనవసరమైన సన్నివేశాలు సినిమా పేస్ ను దెబ్బతీశాయనేది మరో టాక్.
కథలో విలన్ ఎవరూ లేరు.. వాళ్ళ మనస్తత్వాలే విలన్లు అని చెప్పే ప్రయత్నం చేశారు. కాశీ ఎపిసోడ్, ప్రకాష్ రాజ్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నా.. కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు మరీ టూ మచ్ గా అనిపిస్తాయి. లవ్ స్టోరీలో ఉండాల్సిన సున్నితమైన ఫీల్ కంటే, సైకలాజికల్ డ్రామానే ఇందులో ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
మొత్తంగా చెప్పాలంటే 'తేరే ఇష్క్ మే' ఒక బరువైన, సుదీర్ఘమైన ప్రేమకథ. సాఫ్ట్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారికి ఇది నచ్చకపోవచ్చు. భారీ ఎమోషనల్ డ్రామాలను, సంక్లిష్టమైన పాత్రలను ఇష్టపడే వారు ఒకసారి ట్రై చేయొచ్చు. ధనుష్ నటన కోసం వెళ్తే ఓకే కానీ, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు. "నీట్ గా ఉంది కానీ.. మరీ సాగదీశారు" అనేదే పబ్లిక్ టాక్.
