నా అన్వేష్.. ఒక్క రోజులో ఎంతమంది అన్ సబ్ స్క్రైబ్ చేశారంటే..
ట్రావెల్ వ్లాగర్ గా ప్రపంచాన్ని చుట్టేస్తూ, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న అన్వేష్, ఇప్పుడు ఒక్క వీడియోతో తన కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు.
By: M Prashanth | 30 Dec 2025 11:20 AM ISTసోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సంపాదించడానికి ఏళ్లు పడుతుంది, కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు. ప్రస్తుతం ప్రముఖ తెలుగు యూట్యూబర్ అన్వేష్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ట్రావెల్ వ్లాగర్ గా ప్రపంచాన్ని చుట్టేస్తూ, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న అన్వేష్, ఇప్పుడు ఒక్క వీడియోతో తన కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆయన ఛానల్ నుంచి దాదాపు 3 లక్షల మంది సబ్ స్క్రైబర్లు అన్ సబ్ స్క్రైబ్ చేశారంటే, ఆడియెన్స్ లో ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు అంటున్నారు.
3 మిలియన్ ఫాలోవర్స్ కి చేరువవుతాడు అనికుంటున్న తరుణంలో ఇప్పుడు ఈ వివాదం కారణంగా అతని గ్రాఫ్ పడిపోతున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ ఫాలోవర్స్ దూరమైతే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. శివాజీ, అనసూయ వివాదం నడుస్తుండగా, మధ్యలో అనవసరంగా తలదూర్చడమే అన్వేష్ చేసిన మొదటి తప్పని, అంతటితో ఆగకుండా గరికపాటి నరసింహారావు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, పెద్దవారి పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తించడం ఆగ్రహం తెప్పించిందని నెటిజన్స్ అంటున్నారు. ఏదో ఒక పక్షం వహించి మాట్లాడటం వేరు, కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం, తన స్థాయిని మరిచి ప్రవర్తించడం వల్ల అన్వేష్ తనకున్న ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజ్ చేసుకున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి.
అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. తన వాదన నెగ్గడం కోసం మన ఇతిహాసాలను, పురాణాలను కించపరచడం. సీతమ్మ తల్లిని, ద్రౌపదిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయనే అభిప్రాయం వస్తోంది. మోడ్రన్ సొసైటీలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించడానికి, పవిత్రమైన పురాణ పాత్రలను తప్పుగా ఉదహరించడం అన్వేష్ అజ్ఞానానికి నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు.
దీని ఫలితమే ఈ 'డిజిటల్ స్ట్రైక్'. అన్వేష్ ప్రవర్తన నచ్చని ఫాలోవర్స్ మూకుమ్మడిగా ఛానల్ ను అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒక రోజులో 3 లక్షల మంది వెళ్లిపోవడం అనేది యూట్యూబ్ చరిత్రలోనే చాలా అరుదు. ఇది కేవలం నెంబర్ తగ్గడం మాత్రమే కాదు, ఆడియెన్స్ కు అతని కంటెంట్ పై, వ్యక్తిత్వం పై ఉన్న నమ్మకం పోయిందనడానికి స్పష్టమైన సంకేతమని అంటున్నారు.
మరోవైపు ఆన్‌లైన్ లో వ్యతిరేకత మాత్రమే కాకుండా, ఆఫ్‌లైన్ లోనూ చిక్కులు మొదలయ్యాయి. హిందూ దేవుళ్లను కించపరిచినందుకు గాను అన్వేష్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అన్వేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. క్షమాపణ చెప్పినా సరే, అందులో పశ్చాత్తాపం కంటే పొగరు ఎక్కువగా కనిపిస్తోందనే విమర్శలు కూడా బలంగా ఉన్నాయి.
ఏదేమైనా అన్వేష్ ఎపిసోడ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఒక పెద్ద గుణపాఠం అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే, నెత్తి మీద పెట్టుకున్న జనమే కిందకు లాగేస్తారని అంటున్నారు. మరి అన్వేష్ మళ్ళీ ఈ డ్యామేజ్ నుంచి కోలుకుని, పాత వైభవాన్ని సంపాదించుకుంటాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
