Begin typing your search above and press return to search.

గ్లోబ‌ల్ వేదిక‌పై తెలుగు తేజాల స్ఫూర్తి..శోభిత అక్కినేని ది గ్రేట్!

ఈ క్రమంలోనే దుబాయ్‌కి చెందిన తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రీలత అడెపల్లి ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్న తెలుగు మహిళా శక్తిని కొనియాడుతూ ఒక ప్రత్యేకమైన వీడియోను రూపొందించారు.

By:  Sivaji Kontham   |   9 May 2026 12:26 PM IST
గ్లోబ‌ల్ వేదిక‌పై తెలుగు తేజాల స్ఫూర్తి..శోభిత అక్కినేని ది గ్రేట్!
X

గ్లోబల్ వేదికలపై తెలుగు మహిళలు ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఒకప్పుడు కేవలం మెట్రో నగరాలకు, సంపన్న కుటుంబాలకే పరిమితమైన గ్లామర్ - సృజనాత్మక రంగాలు ఇప్పుడు చిన్న పట్టణాల నుంచి వచ్చే ప్రతిభావంతులకు కూడా స్వాగతం పలుకుతున్నాయి. మోడలింగ్ నుంచి నటన వరకు.. రాప్ సంగీతం నుంచి వ్యాపార రంగం వరకు తెలుగు మూలాలున్న మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు. చానల్ మోడల్ భావిత మండవ, రాపర్ రాజా కుమారి, మబ్యూటీ ఎంట్ర‌ప్రెన్యూర్ దీపిక ముత్యాల వంటి వారు ఈ మార్పుకు నిదర్శనంగా నిలుస్తూ భ‌విష్య‌త్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే దుబాయ్‌కి చెందిన తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రీలత అడెపల్లి ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్న తెలుగు మహిళా శక్తిని కొనియాడుతూ ఒక ప్రత్యేకమైన వీడియోను రూపొందించారు. ఇందులో గ్లోబల్ ఐకాన్స్‌గా ఎదిగిన తెలుగు తేజాల ప్రయాణాన్ని శ్రీ‌ల‌త‌ అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పోస్ట్ కేవలం ఒక అభినందనగా మాత్రమే కాకుండా శ్రీలత వంటి ఎంతో మంది ఉత్సాహవంతులైన మహిళలకు అంతర్జాతీయ వేదికలపై తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలనే ఆశను, ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ఉంది.

శ్రీలత చేసిన ఈ పోస్ట్‌కు నటి శోభిత ధూళిపాళ ఇచ్చిన స్పందన ఇప్పుడు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇటువంటి పోస్ట్‌లకు కృతజ్ఞతలు చెప్పి వదిలేస్తారు.. కానీ శోభిత తన మనసులోని ఇన్ డెప్త్ భావాలను శ్రీ‌ల‌త కోసం షేర్ చేసారు. మన నిర్ణయాలు తర్కానికి అందకపోయినా..మన అంతరాత్మ ప్రబోధాన్ని నమ్మినప్పుడే జీవితం అత్యంత అర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. మ‌న‌సు చెప్పిన‌దానిని కాదని తీసుకున్న నిర్ణయాలతో ఎదురుదెబ్బలు తిన్నాన‌ని శోభిత నిజాయితీగా అంగీకరించడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.

శోభిత తన మెసేజ్‌లో జీవితాన్ని నదిపై సాగే ఒక చిన్న ప్రయాణంతో పోల్చుతూ గొప్ప తాత్విక చింతనను ప్రదర్శించారు. ``జీవితం చాలా చిన్నది.. ప్రవహించే నీటిని, వీచే గాలిని ఆస్వాధిస్తూ సాగాలి`` అని త‌ను చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ప్రతి మనిషి తనను తాను గౌరవించుకోవాలని.. తన సహజత్వాన్ని ఎప్పుడూ వదులుకోకూడదని శోభిత‌ ఇచ్చిన పిలుపు సామాన్యమైనది కాదు. ఈ మాటల్లోని జ్ఞానం- ప్రశాంతత త‌న వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా ఆవిష్క‌రించాయి.

ఈ వైరల్ సంభాషణ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చర్చగా కాకుండా... ఒక తెలుగు మహిళ మరో తెలుగు మహిళకు అందించిన అసాధార‌ణ‌ మద్దతుగా నిలిచిపోయింది. సోషల్ మీడియాలో సాధారణంగా ఉండే పైపై మెరుగుల‌ కంటే భిన్నంగా.. ఇంత లోతైన అంశం డెప్త్ తో చర్చకు రావడం విశేషం. సరిహద్దులు దాటి తెలుగు తేజాలు ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. ఆత్మవిశ్వాసంతో జీవించే ప్రతి మహిళకు ఈ ఉదంతం ఒక దిక్సూచిలా మారింది.