Begin typing your search above and press return to search.

ఈవారం సినిమాలు.. రెస్పాన్స్ ఎలా ఉంది?

ఈ వీకెండ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు మూడు సినిమాలు వచ్చాయి. అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’, కొత్తవాళ్లతో వచ్చిన ‘సహ’, దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.

By:  M Prashanth   |   4 Sept 2026 10:37 PM IST
ఈవారం సినిమాలు.. రెస్పాన్స్ ఎలా ఉంది?
X

ఈ వీకెండ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు మూడు సినిమాలు వచ్చాయి. అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’, కొత్తవాళ్లతో వచ్చిన ‘సహ’, దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’. మూడు సినిమాల బ్యాక్‌గ్రౌండ్ కూడా వేరు. ఒకటి నరేష్ మళ్లీ కామెడీ జోన్‌కు వచ్చిన సినిమా. ఇంకొకటి రిలీజ్‌కు ముందే బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో పేరు తెచ్చుకున్న చిన్న చిత్రం. మూడోది దుల్కర్ మార్కెట్‌తో వచ్చిన మలయాళ యాక్షన్ ఫాంటసీ. అయితే టాక్ మాత్రం ముగ్గురికీ ఒకేలా లేదు.

‘రంభ ఊర్వశి మేనక’ మీద ఉదయం నుంచి వచ్చిన రియాక్షన్స్ లో కామెడీ పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదనే మాట ఎక్కువగా కనిపిస్తోంది. అల్లరి నరేష్‌ను మళ్లీ తన పాత జోన్‌లో చూడాలనుకున్న వాళ్లకు కొన్ని సీన్లు నచ్చినా, కథ, ట్రీట్‌మెంట్ పాతగా అనిపించిందని కామెంట్స్ వస్తున్నాయి. ఫాంటసీ సెటప్, పెద్ద కామెడీ క్యాస్ట్ ఉన్నా కామెడీ ఆశించినంతగా రాలేదన్నదే ఇప్పటివరకు వినిపిస్తున్న కామెంట్.

‘సహ’ పరిస్థితి ఇంకోలా ఉంది. హీరోయిన్ “సినిమా నచ్చకపోతే అమీర్‌పేట్‌లో గుండు గీసుకుంటా” అని చెప్పడం, హీరో బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తాం.. అనడం రిలీజ్‌కు ముందే వైరల్ అయ్యాయి. కానీ సినిమా మాత్రం చాలా పరిమిత థియేటర్లలోనే వచ్చింది. కొన్ని రివ్యూల్లో క్లైమాక్స్ ఎమోషన్ గురించి పాజిటివ్‌గా చెప్పినా, కథ కొత్తగా లేదని, నేరేషన్ ఎక్కువగా కనెక్ట్ కాలేదని టాక్ వస్తోంది. కొత్త టీమ్‌కు ఇప్పుడు టాక్ కంటే ముందుగా షోలు పెరగడం కూడా అవసరం.

దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’కు మాత్రం ఓపెనింగ్ పరంగా పాజిటివ్ గా స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ 3న మలయాళంలో మొదలైన సినిమా తొలి రోజు ఇండియాలో దాదాపు రూ.5.40 కోట్ల నెట్ చేసింది. అందులో తెలుగు వెర్షన్ నుంచి సుమారు రూ.75 లక్షలు వచ్చాయి. వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.11 కోట్లకు పైగా నమోదైంది. అయితే దుల్కర్ గత మలయాళ సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్త’ ఓపెనింగ్‌ను మాత్రం దాటలేకపోయింది.

టాక్ దగ్గర ‘ఐ యామ్ గేమ్’కు కూడా క్లీన్ పాజిటివ్ కనిపించడం లేదు. ఫస్ట్ హాఫ్‌లో ఫాంటసీ సెటప్, కొన్ని యాక్షన్ భాగాలు నచ్చాయనే కామెంట్స్ వచ్చాయి. తర్వాత కథ రెగ్యులర్ రివెంజ్ వైపు వెళ్లడం, స్క్రీన్‌ప్లే ఒకే ఫ్లోలో లేకపోవడం మైనస్‌ అంటున్నారు. అయితే కేరళలో ఈవెనింగ్, నైట్ షోలకు ఆక్యుపెన్సీ పెరగడం కనిపించింది. ఇక వీకెండ్ లో ఈ టాక్ ను ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి.

‘సహ’ టీమ్‌కు మరో సమస్య థియేటర్ల నెంబర్. చాలా తక్కువ థియేటర్లతోనే మొదలైంది. అక్కడ నుంచి షోలు పెరగాలంటే వీకెండ్‌లో ఫుట్ ఫాల్స్ పెరగాలి. ‘రంభ ఊర్వశి మేనక’కు నరేష్ క్రేజ్, ‘ఐ యామ్ గేమ్’కు దుల్కర్ బ్రాండ్ కలిసొచ్చాయి. కొత్తవాళ్ల ‘సహ’కు మాత్రం శనివారం నుంచి థియేటర్లు పెరుగుతాయా అన్నదే అసలైన సవాల్. ఇక మూడు సినిమాల్లో ఏది వీకెండ్ వరకు బలంగా నిలబడుతుందో చూడాలి.