Begin typing your search above and press return to search.

ఇడ్లీ కొట్టు.. మరీ ఇంత తేడానా?

By:  Garuda Media   |   3 Oct 2025 6:48 PM IST
ఇడ్లీ కొట్టు.. మరీ ఇంత తేడానా?
X

ఒకప్పుడు కంటెంట్, సక్సెస్ పరంగా సౌత్ ఇండియాలో నంబర్ వన్ స్థానంలో ఉండేది తమిళ ఇండస్ట్రీ. అక్కడి సినిమాలు దక్షిణాదిన అంతటా చాలా బాగా ఆడేవి. తెలుగు వాళ్లు తమిళ చిత్రాలను ఎగబడి చూసేవాళ్లు. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య లాంటి హీరోలు.. మణిరత్నం, శంకర్, మురుగదాస్ లాంటి దర్శకుల చిత్రాలను మన వాళ్లు గొప్పగా ఆదరించేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. తమిళ సినిమాల క్వాలిటీ పడిపోయింది. ఒకప్పుడు కొత్తదనానికి మారుపేరుగా ఉన్న తమిళ సినిమాల్లో ఇప్పుడు ఏమాత్రం నవ్యత కనిపించడం లేదు.

గతంలో డిఫరెంట్ సినిమాలను ఆదరించడంలో తమ అభిరుచిని చాటుకున్న తమిళ ప్రేక్షకులు.. ఇప్పుడు రొటీన్ సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకు తాజా ఉదాహరణ.. ఇడ్లీ కొట్టు. ఈ చిత్రానికి తెలుగులో బ్యాడ్ రివ్యూలు వచ్చాయి. రేటింగ్స్ 2కు అటు ఇటుగా వచ్చాయి. టాక్ కూడా ఏమాత్రం బాగా లేదు. రెండు రోజులకే సినిమా వాషౌట్ అయిపోయింది. శుక్రవారం మినిమం కలెక్షన్లు లేవీ చిత్రానికి. చివరగా తెలుగులోనే ‘కుబేర’ సినిమా చేసి హిట్టు కొట్టిన ధనుష్‌కు ఇది పెద్ద షాకే.

ఐతే తెలుగులో ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్న సినిమాకు తమిళంలో మాత్రం గొప్ప ఆదరణ దక్కుతోంది. ‘కుబేర’ లాంటి మంచి సినిమాను తిరస్కరించిన తమిళ జనాలు.. రొటీన్ సెంటిమెంట్ మూవీ అయిన ‘ఇడ్లీ కొట్టు’ను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ సినిమాకు తమిళ క్రిటిక్స్ 3, 3.5, 4 రేటింగ్స్ ఇచ్చేయడం విశేషం. తమిళంలో టాక్ కూడా బాగుంది. నిన్న దసరా సెలవు రోజు ‘ఇడ్లీ కడై’ హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది.

వీకెండ్ అంతా సినిమా బాగా ఆడే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళం వరకు సినిమా సూపర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మామూలుగా తెలుగు, తమిళ ప్రేక్షకుల దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ ఈ మధ్య అభిరుచిలో స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మన వాళ్లు కొత్తదనం కోరుకుంటున్నారు. రొటీన్ సినిమాలను తిరస్కరిస్తున్నారు. కానీ తమిళ ప్రేక్షకులు రొటీన్ సినిమాలనే ఆదరిస్తున్నారు. ‘ఇడ్లీ కొట్టు’ ఆ కోవలోనే తమిళంలో విజయవంతం అయ్యేలా ఉంది.