టాలీవుడ్ ట్రిపుల్ ధమాకా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతున్న ఫిలిం ఇండస్ట్రీలో నెలకో నిఖార్సయిన హిట్ రావడం కూడా గగనం అయిపోయింది.
By: Garuda Media | 14 Sept 2025 2:05 PM ISTసక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతున్న ఫిలిం ఇండస్ట్రీలో నెలకో నిఖార్సయిన హిట్ రావడం కూడా గగనం అయిపోయింది. సంవత్సరం మొత్తం సగటు తీస్తే సక్సెస్ రేట్ ఐదారు శాతం కూడా ఉండని పరిస్థితి కనిపిస్తోంది. వారం వారం సగటున రెండు మూడు సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. కానీ వాటిలో ఒక్కటీ విజయవంతం కాదు. ఆగస్టు నెలలో రెండంకెల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కటీ సక్సెస్ కాలేదు. ఇలాంటి టైంలో వారం వ్యవధిలో మూడు సినిమాలు విజయవంతం కావడం.. ఒకే సమయంలో అవి హౌస్ ఫుల్స్‌తో రన్ అవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
గత వారం వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ తొలి రోజు నుంచే హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. వీకెండ్లో ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం రెండో వారంలో కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ వారం ‘మిరాయ్’ మంచి హైప్‌తో రిలీజైంది. దాన్ని నిలబెట్టుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులేస్తోంది. శనివారం సాయంత్రం ఈ సినిమాకు టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఆదివారం కూడా రాంపేజ్‌ను కొనసాగిస్తోంది ‘మిరాయ్’. దీంతో పాటుగా రిలీజై కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకుని ‘కిష్కింధపురి’ సైతం బాగానే ఆడుతోంది. శనివారం ఈ సినిమాకు కూడా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఆదివారం కూడా పరిస్థితి ఆశాజనకంగా ఉంది. షోలన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. ఈ రెండు చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నా కూడా ‘లిటిల్ హార్ట్స్’ బాగానే ప్రభావం చూపిస్తోంది. షోలు తగ్గినప్పటికీ.. ఆక్యుపెన్సీలు చాలా బాగున్నాయి.
ఇలా ఒకే సమయంలో మూడు తెలుగు చిత్రాలు సక్సెస్ ఫుల్‌గా రన్ అవడం.. చివరగా గత ఏడాది దీపావళికి చూశాం. ఆ సీజన్లో రిలీజైన ‘లక్కీ భాస్కర్’, ‘క’, ‘అమరన్’ చాలా బాగా ఆడాయి. మూడూ హిట్టయ్యాయి. అంతకుముందు ఇలాంటి పరిస్థితి 2022లో చూశాం. ఆ ఏడాది ఆగస్టులో ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ-2’ బ్లాక్ బస్టర్ సక్సెస్ చూశాయి. ఒకే సమయంలో హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ మిరాయ్, కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ ఏడాది కళ తప్పిన టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఇది గొప్ప ఉపశమనమే.
