టికెట్ ప్రైజ్ హైక్ తో థియేటర్లకు తీవ్ర నష్టం.. ఇప్పటికైనా మారాల్సింది వాళ్లే!
గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితిత అత్యంత దారుణంగా తయారైంది.
By: M Prashanth | 6 Aug 2025 8:00 AM ISTగత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితిత అత్యంత దారుణంగా తయారైంది. థియేటర్ కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య ఇటీవల సంవత్సరాలల్లో రోజురోజుకూ తగ్గుతుంది. ఇది ఇలాగే కొనసాగితే జనాలు థియేటర్లకు రాకపోవడంతో భవిష్యత్ రోజుల్లో థియేటర్ల మనుగడే కష్టమవుతుంది. అయితే థియేటర్లకు ఈ పరిస్థితికి ముఖ్య కారణం టికెట్ ధరల పెంపు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కొన్నేళ్లుగా, ముఖ్యంగా కొవిడ్ తర్వాత తెలుగులో బడా హీరో సినిమా రిలీజ్ ఉందంటే చాలు.. టికెట్ ధరలు అమాంతం పెంచేస్తున్నారు. ఇవి సామాన్యుడికి అతి భారంగా మారుతున్నాయి. అందుకే క్రమక్రమంగా థియేటర్ కు వచ్చే వాళ్ల సంఖ్య పడిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే నెలలో దాదాపు రెండున్నర మూడు వారాల కంటే ఎక్కువ రోజులు థియేటర్లు లోటును ఎదుర్కొంటున్నాయి.
ఇటీవల, విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు కన్నప్ప, హరి హర వీర మల్లు, కింగ్డమ్ చిత్రాలు తొలి వీకెండ్ లో రూ.1 కోటి షేర్ ను కూడా రాబట్టలేని పరిస్థితి ఉంది. అయ్యర్లు భారీ మొత్తం డబ్బులిచ్చి సినిమా హక్కులు కొంటుంటారు. కానీ ఆ సినిమాలు నష్టాల్లో ముగుస్తున్నాయి. దీంతో థియేటర్లు కూడా లోటులో నడుస్తున్నాయి. ఈ క్రమంలో థియేటర్ మెయింటేనెన్స్ కూడా భరించలేని పరిస్థితి మేనేజ్ మెంట్కు ఎదురవుతుంది.
ప్రతి నెలా థియేటర్ ఓనర్లు లక్షల్లో నష్టాలను చవిచూస్తున్నారు. థియేటర్ యజమానులు మనుగడ సాగించడం కష్టంగా ఉంది. పాన్ఇండియా బడ్జెట్ సినిమాలు సహా 90 శాతం సినిమాలు మొదటి వారంలోనే నష్టాన్ని చూస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు థియేటర్లను బతికించడంపై దృష్టి పెట్టాలి. ప్రతి సినిమాకు టికెట్ ధరల పెంపు కాకుండా.. ధరలు తగ్గించి ప్రేక్షకులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించి, ఆక్యూపెన్సీ పెంచే ప్రయత్నం చేయాలి.
అప్పుడే థియేటర్లు బతికే ఛాన్స్ ఉంటుంది. సినిమాలను బట్టి వీకెండ్స్ లో టికెట్ ధరలను 20%, 30% లేదా 50% మేర తగ్గించాలి. అప్పుడే థియేటర్ల ఆక్సుపెన్సీ పెరుగుతుంది. లేదంటే ఇలాగే ధరలు పెంచే ట్రెండ్ కొనసాగితే.. ఖచ్చితంగా థియేటర్లు సంఖ్య ఇప్పుడు కంటే చాలా తగ్గుతుంది. చూడాలి మరి నిర్మాతలు ఇప్పటికైనా దీనిపై దృష్టి పెడాతారా? టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకుడిని థియేటర్ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? అనేది చూడాలి.
