Begin typing your search above and press return to search.

సింగిల్ థియేటర్ల మనుగడ: రెంటల్ - పర్సంటేజీ విధానంలో ఏది బెస్ట్?

మొత్తంగా చూస్తే.. సినిమా పరిశ్రమ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ రెండు వ్యవస్థల మధ్య సమతుల్యత అవసరం.

By:  Sivaji Kontham   |   12 April 2026 7:00 PM IST
సింగిల్ థియేటర్ల మనుగడ: రెంటల్ - పర్సంటేజీ విధానంలో ఏది బెస్ట్?
X

తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ థియేటర్ల మనుగడ ప్రధానంగా రెంటల్ -పర్సంటేజీ అనే రెండు కీలక వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏ పద్ధతిని ఎంచుకోవాలనేది ఆ సినిమా ఫలితం.. థియేటర్ ఉన్న భౌగోళిక ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. రెంటల్ వ్యవస్థలో డిస్ట్రిబ్యూటర్ థియేటర్ యజమానికి నిర్ణీత మొత్తాన్ని అద్దెగా చెల్లిస్తారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా యజమానికి స్థిరమైన ఆదాయం లభించడం వల్ల థియేటర్ నిర్వహణ ఖర్చులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది యజమానులకు ఒక రకమైన ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.

అయితే రెంటల్ వ్యవస్థలో డిస్ట్రిబ్యూటర్లకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే అద్దె చెల్లించడం వారికి పెను భారంగా మారుతుంది. మరోవైపు సినిమా భారీ విజయాన్ని అందుకుని కోట్లు వసూలు చేసినా థియేటర్ యజమానికి మాత్రం కేవలం ఒప్పందం చేసుకున్న అద్దె మాత్రమే మిగులుతుంది. ఈ లోపాన్ని అధిగమించడానికి మల్టీప్లెక్స్‌లు, ప్రధాన నగరాల్లోని సింగిల్ థియేటర్లు ప్రస్తుతం పర్సంటేజీ వ్యవస్థను అనుసరిస్తున్నాయి. ఇందులో వసూలైన గ్రాస్ ఆదాయాన్ని యజమాని- డిస్ట్రిబ్యూటర్ మధ్య నిర్ణీత నిష్పత్తిలో పంచుకుంటారు.

పర్సంటేజీ వ్యవస్థ వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఒక గొప్ప వెసులుబాటు ఉంటుంది. సినిమా సరిగ్గా ఆడకపోతే అద్దె భారం మొత్తం వారిపై పడదు. వచ్చిన ఆదాయంలో వాటా ఇస్తే సరిపోతుంది. అదే సమయంలో సినిమా సూపర్ హిట్ అయితే పర్సంటేజీ రూపంలో థియేటర్ యజమానికి అద్దె కంటే చాలా రెట్లు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇద్దరికీ ప్రయోజనకరంగా అనిపించినా.. సినిమా అస్సలు ఆడనప్పుడు థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు, కరెంట్ బిల్లులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చిన్న థియేటర్ యజమానులను ఆర్థికంగా దెబ్బతీస్తుంది.

పెద్ద సినిమాల విషయానికి వస్తే... రెంటల్ వ్యవస్థలో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ లాభపడగా... పర్సంటేజీ వ్యవస్థలో ఎగ్జిబిట‌ర్ - పంపిణీదారు ఇద్దరికీ సమాన వాటా లభిస్తుంది. కానీ ఫ్లాప్ సినిమాల విషయంలో పర్సంటేజీ పద్ధతి వల్ల ఇద్దరూ నష్టాన్ని పంచుకుంటారు. అదే రెంటల్ అయితే డిస్ట్రిబ్యూటర్ ఒక్కరే నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతం సిటీల్లో ఉండే పెద్ద థియేటర్లు పర్సంటేజీ వైపు మొగ్గు చూపుతుండగా.. గ్రామాల్లోని బి, సి సెంటర్ థియేటర్లకు రెంటల్ వ్యవస్థే సురక్షితమైన మార్గంగా కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే.. సినిమా పరిశ్రమ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ రెండు వ్యవస్థల మధ్య సమతుల్యత అవసరం. చిన్న సినిమాలకు పర్సంటేజీ వ్యవస్థను అమలు చేయడం వల్ల నిర్మాతలకు విడుదల భారం తగ్గుతుంది. అలాగే పెద్ద సినిమాలకు రెంటల్ లేదా షేర్ ప్రాతిపదికన ఒప్పందాలు చేసుకోవడం వల్ల థియేటర్ వ్యవస్థ నిలదొక్కుకుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు పరస్పర సహకారంతో అడుగులు వేసినప్పుడే సింగిల్ థియేటర్లు ఓటీటీల కాలంలోనూ మనుగడ సాగించగలవు.

నిర్మాత‌ల గిల్డ్ చీలిక‌..

ప్ర‌స్తుతం రెంట‌ల్ విధానం, ప‌ర్సంటేజీ విధానం వ్య‌వ‌హారంలో టాలీవుడ్ యాక్టివ్ నిర్మాత‌ల గిల్డ్ లో చీలిక‌లు వ‌చ్చాయ‌ని, కొంద‌రు నిర్మాత‌లు కేవ‌లం ప‌ర్సంటేజీ విధానానికి అనుకూలంగా ఉంటే, చాలా మంది నిర్మాత‌లు దీనికి వ్య‌తిరేకంగా రెంట‌ల్ విధానం కొన‌సాగించాల‌ని కోరుతున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.