Begin typing your search above and press return to search.

పాన్-ఇండియా స్టార్ల కొత్త జానర్లు!

గతంలో కేవలం విదేశీ సినిమాల్లో మాత్రమే చూసిన సూపర్ హీరోలు, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లు ఇప్పుడు తెలుగు తెరపై మన హీరోలతో చూడటం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

By:  Srikanth Kontham   |   2 April 2026 10:37 AM IST
పాన్-ఇండియా స్టార్ల కొత్త జానర్లు!
X

టాలీవుడ్ స్టార్ హీరోలు కేవలం ప్రాంతీయ భాషా చిత్రాలకే పరిమితం కాకుండా గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని సరికొత్త జానర్లలో అడుగుపెడుతున్నారు. ఒకప్పుడు మాస్ మసాలా, కమర్షియల్ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చిన మన పాన్-ఇండియా స్టార్లు ఇప్పుడు సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, సూపర్ హీరో వంటి విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు. ఈ మార్పు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాల్లో మరో మెట్టు ఎక్కించబోతోంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ప్రభంజనం తర్వాత పూర్తిగా తన రూటు మార్చేశారు.

ప్ర‌స్తుతం ఈ క్రేజీ స్టార్ దర్శకుడు అట్లీతో కలిసి ఒక భారీ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మూవీని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న విజువల్ వండర్ కోసం బన్నీ ఎంతో శ్రమిస్తున్నారు. అంతేకాదు త‌దుప‌రి ప్రాజెక్ట్ ను అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్స‌తున్నారు. మిన్నల్ మురళి ఫేమ్ బేసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సూపర్ హీరో చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలు అల్లు అర్జున్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచడం ఖాయం. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.

రంగస్థలం వంటి మట్టి కథతో సంచలనం సృష్టించిన సుకుమార్ దర్శకత్వంలోనే చరణ్ ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కి రెడీ అవుతున్నారు. మునుపెన్నడూ టచ్ చేయని ఓ కొత్త కాన్సెప్ట్‌తో సుకుమార్ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. టెక్నాలజీ , ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం చరణ్ కెరీర్‌లో మ‌రో మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే విభిన్న జానర్లను టచ్ చేస్తూ దూసుకుపోతున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

డార్లింగ్ ఇంత‌వ‌ర‌కూ కాప్ స్టోరీల్లో న‌టించ‌ని సంగ‌తి తెలిసిందే. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకె క్కుతున్న ఫౌజీ చిత్రంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి చారిత్రాత్మక నేపథ్యంలో ఒక భావోద్వేగపూరితమైన పాత్రను పోషిస్తున్నారు. కల్కి 2 వంటి ఫ్యూచరిస్టిక్ చిత్రాలతో సత్తా చాటిన ప్రభాస్ మరింత వైవిధ్యమైన కథలతో పలకరించబోతున్నారు. స్టార్ హీరోలు ఇలాంటి కొత్త జానర్లను ఎంచుకోవడం వల్ల టాలీవుడ్ మేకింగ్ స్టైల్ కూడా అంతర్జాతీయ స్థాయికి చేరుతోంది.

గతంలో కేవలం విదేశీ సినిమాల్లో మాత్రమే చూసిన సూపర్ హీరోలు, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లు ఇప్పుడు తెలుగు తెరపై మన హీరోలతో చూడటం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూ ళ్లు మాత్రమే కాకుండా తెలుగు సినిమా ప్రతిష్ట గ్లోబల్ లెవల్‌లో పెరుగుతుంది.స్టార్ హీరోలు కంఫర్ట్ జోన్‌కు పరిమితం కాకుండా రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం శుభపరిణామం. విభిన్న జానర్లలో రాబోతున్న ఈ సినిమాలు కేవలం టాలీవుడ్ రికార్డులను తిరగరాయడమే కాదు. ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పనున్నాయి.