Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో 20 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోలు...!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్‌ హీరోలు ఒకప్పుడు ఏడాదికి అయిదు నుంచి పది సినిమాలు విడుదల చేసిన దాఖలాలు ఉన్నాయి.

By:  Ramesh Palla   |   31 July 2025 1:00 PM IST
టాలీవుడ్‌లో 20 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోలు...!
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్‌ హీరోలు ఒకప్పుడు ఏడాదికి అయిదు నుంచి పది సినిమాలు విడుదల చేసిన దాఖలాలు ఉన్నాయి. కొందరు హీరోలు ఏడాదిలో ఏకంగా డజనుకు పైగా సినిమాలను విడుదల చేసిన సందర్బాలు ఉన్నాయి. చిరంజీవి, కృష్ణలతో పాటు పలువురు సీనియర్‌ స్టార్‌ హీరోల నుంచి ఏడాదిలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఒకప్పుడు ఏడాదిలో డజను సినిమాలు చేసిన మెగాస్టార్‌ చిరంజీవి సైతం ఇప్పుడు ఏడాదికి కనీసం ఒక్కటి కూడా విడుదల చేయలేక పోతున్నారు. చిరంజీవి మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ఏ స్టార్‌ హీరో కూడా గడచిన రెండు దశాబ్దాలుగా కంటిన్యూగా ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలను విడుదల చేయలేక పోతున్నారు. స్టార్‌ హీరోల సంగతి పక్కన పెడితే చిన్న హీరోలు సైతం ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేయలేక పోతున్నారు.

కరోనా తర్వాత ఇండస్ట్రీలో మార్పులు

ఇప్పటికే ఇండస్ట్రీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఇలాంటి సమయంలో సినిమాలు తక్కువగా వస్తే ముందు ముందు మరింతగా ఇండస్ట్రీ కుదేలయ్యే ప్రమాదం ఉంది. సినిమాలు తగ్గుతున్నాయి, వసూళ్లు తగ్గుతున్న ఈ సమయంలో హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకుని, ఎక్కువ సినిమాలు చేయడం ఉత్తమం అని అంతా భావిస్తున్నట్లుగా ఉన్నారు. ఇంతకు ముందు ఏడాదికి కనీసం ఒక్క సినిమాను కూడా చేయని హీరోలు ఇప్పుడు ఏడాదిలో కనీసం రెండు సినిమాలు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే కొందరు హీరోలు ఇలా ఏడాదికి రెండు సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. కానీ ఏ ఒక్కరికి అది సాధ్యం కాలేదు. కానీ ఇండస్ట్రీ పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చిన మార్పుల కారణంగా ఏడాదిలో రెండు సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చిరంజీవి, బాలకృష్ణ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు

ప్రస్తుతం మహేష్ బాబు తప్ప మిగిలిన హీరోలు అంతా కూడా చాలా స్పీడ్‌గా సినిమాలు చేసేందుకు రెండేసి, మూడేసి ప్రాజెక్ట్‌లను రెడీ చేసుకున్నారు. సీనియర్‌ స్టార్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణతో పాటు, ఇతర స్టార్‌ హీరోలు, యంగ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి వారు సైతం చాలా స్పీడ్‌గా సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. కొందరు హీరోలు ఇప్పటికీ భారీ బడ్జెట్‌ సినిమాల వైపు ఆసక్తి చూపుతున్నా కూడా తక్కువ సమయంలో పూర్తి అయ్యే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. అదే కనుక నిజం అయితే వచ్చే ఏడాది నుంచి స్టార్‌ హీరోల సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభాస్‌ ఈ జాబితాలో ముందు ఉన్నాడు. ఆయన నుంచి బ్యాక్ టు బ్యాక్‌ రాజాసాబ్‌, ఫౌజీ, స్పిరిట్‌, సలార్‌ 2, కల్కి 2 సినిమాలు రాబోతున్నాయి.

అనిల్‌ రావిపూడి స్పీడ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌

రెండు దశాబ్దాల తర్వాత ఇండస్ట్రీలో స్టార్‌ హీరోల సినిమాలు వరుసగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు మాదిరిగా కాకుండా వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు చేయకుండా, సింపుల్‌గా సినిమాలు చేయాలని కూడా కొందరు హీరోలు భావిస్తున్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు ఇప్పటికే సగానికి పైగా కనుమరుగు అయ్యాయి, ప్రేక్షకులు సినిమాలకు రావడం లేదు. ఇలాంటి సమయంలో రెండు మూడు ఏళ్లకు ఒకటి చొప్పున స్టార్‌ హీరోలు సినిమాలు తీస్తే ఇండస్ట్రీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. అందుకే స్టార్‌ హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలి అనుకోవడం, టైర్‌ 2 హీరోలు ఏడాదిలో మూడు సినిమాలను విడుదల చేయాలి అనుకోవడం మంచి పద్దతి. హీరోలు ఏడాదికి రెండు విడుదల చేసేందుకు రెడీగా ఉన్నా దర్శకులు పడనివ్వడం లేదు. అనిల్‌ రావిపూడి వంటి దర్శకులు మూడు నాలుగు నెలల్లో సినిమాలను పూర్తి చేస్తున్నారు. కానీ రాజమౌళి వంటి దర్శకులు మూడు నాలుగు ఏళ్లు తీసుకుంటున్నారు. దర్శకులు ఆరు నెలలకు ఒక సినిమాను తీస్తే అప్పుడు ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది.