Begin typing your search above and press return to search.

మిడ్ రేంజ్ అయినా..కాన్పిడెంట్ గా 100 కోట్లు!

వంద‌కోట్ల బ‌డ్జెట్ సినిమా అంటే ఇప్పుడు పెద్ద విష‌యం కాదు. తెలుగు సినిమా బ‌డ్జెట్ 500 కోట్లు దాట‌డంతో? 100 కోట్ల బ‌డ్జెట్ సినిమా అన్న‌ది పెద్ద‌గా హైలైట్ అవ్వ‌డం లేదు.

By:  Srikanth Kontham   |   23 Nov 2025 8:00 AM IST
మిడ్ రేంజ్ అయినా..కాన్పిడెంట్ గా 100 కోట్లు!
X

వంద‌కోట్ల బ‌డ్జెట్ సినిమా అంటే ఇప్పుడు పెద్ద విష‌యం కాదు. తెలుగు సినిమా బ‌డ్జెట్ 500 కోట్లు దాట‌డంతో? 100 కోట్ల బ‌డ్జెట్ సినిమా అన్న‌ది పెద్ద‌గా హైలైట్ అవ్వ‌డం లేదు. టైర్ వ‌న్ హీరోలెవ‌రూ వంద కోట్ల బ‌డ్జెట్ సినిమాలు చేయ‌లేదు. ఈ కోవ‌లోకి వ‌చ్చేది టైర్ 2 హీరోలు మాత్ర‌మే. కానీ వాళ్ల మీద వంద కోట్లు అంటే? కాస్త రిస్క్ అయినా నిర్మాత‌లు మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ముందుకొస్తున్నారు. హీరోల‌కంటే క‌థ‌ని న‌మ్మడంతో నిర్మాణ ప‌రంగా రాజీ ప‌డ‌టం లేదు. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు వినూత్న‌మైన క‌థ‌లు రాయ‌డంతో? కాన్పిడెండ్ గా కోట్ల రూపాయ‌లు గుమ్మ‌రిస్తున్నారు.

రాజీలేని నిర్మాణంతో నిర్మాత‌లు:

కొంత మంది టైర్ 2 హీరోల జాబితాలో అలాంటి ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేసారు. ఆ సెట్లు చూస్తుంటే? పెట్టిన ప్ర‌తీ రూపాయి సినిమాలో క‌నిపించేలా ఉంది. గుహ నేప‌థ్యంలో సాగే క‌థ కావ‌డంతో వీలైనంత రియాల్టీ చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈసినిమా బ‌డ్జెట్ 100 కోట్లు అని స‌మాచారం. కానీ అంత‌కు మించే ఖ‌ర్చు అవుతుంద‌న్న‌ది తాజాగా తెలిసిన మ‌రో విష‌యం. నాగ చైత‌న్య‌కెరీర్ లో తొలి భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిదే.

సీజీ కోసం అద‌నంగా బ‌డ్జెట్:

అలాగే మ‌రో యంగ్ స్టార్ నిఖిల్ హీరోగా భ‌ర‌త్ కృష్ణ‌మాచారి ద‌ర్శ‌క‌త్వంలో `స్వ‌యంభు` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. భారీ సెట్లు వేసి చిత్రీక‌రించారు. ఈ సినిమా సీజీ వ‌ర్క్ కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. ఈ సినిమా ప్రాధ‌మిక బ‌డ్జెట్ కూడా 100కోట్లు అని తెలిసింది. బ‌డ్జెట్ అద‌నంగా పెరుగుతుంద‌ని తెలిసింది. ఇంకా నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ది ప్యార‌డైజ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదీ పిరియాడిక్ నేప‌థ్యంలో సాగే స్టోరీ కావ‌డంతో 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న‌ట్లు స‌మాచారం.

కెరీర్లో తొలి భారీ బ‌డ్జెట్ చిత్రాలు:

అలాగే మెగా మేన‌ల్లుడు సాయితేజ్ హీరోగా రోహిత్ కె.పి అనే కొత్త కుర్రాడు `సంబ‌రాల ఏటిగ‌ట్టు` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `విరూపాక్ష` త‌ర్వాత సాయితేజ్ న‌టిస్తోన్న చిత్ర‌మిది. అలాగే ద‌ర్శ‌కుడికి ఇదే తొలిసినిమా అయినా క‌థ‌పై న‌మ్మ‌కంతో 100 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇంకా సిద్దు జొన్న‌ల‌గడ్డ హీరోగా నాగ‌వంశీ రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఒకే క‌థ‌ను రెండు భాగాలుగా చెప్పాల‌ని స‌న్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా కు కూడా 100కోట్లు కేటాయిస్తున్నారుట‌. ఇలా ఈ న‌యా హీరోలంద‌రి కెరీర్ లో తొలి భారీ బ‌డ్జెట్ చిత్రాలుగా రికార్డు న‌మోదు చేస్తున్నాయి.