Begin typing your search above and press return to search.

గ్రాఫిక్స్ కష్టాలు - వాయిదాల పర్వం!

మిస్టిక్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ కావ‌డంతో? టెక్నిక‌ల్ గా సినిమాను హైలైట్ చేయాల్సి రావ‌డంతో? పిన్ టూ పిన్ జా్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా కూడా రిలీజ్ ఆల‌స్య‌మువుతుంది.

By:  Srikanth Kontham   |   12 April 2026 2:00 PM IST
గ్రాఫిక్స్ కష్టాలు - వాయిదాల పర్వం!
X

భారీ సెట్లు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను మెప్పించాలని దర్శకులు ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నాసిరకం గ్రాఫిక్స్ సినిమాలకు పెద్ద మైనస్‌గా మారుతున్నాయి. గతంలో ప్రభాస్ నటించిన `ఆదిపురుష్` టీజర్ విడుదలైనప్పుడు ఎదుర్కొన్న విమర్శలు తెలిసిందే. అలాగే శంకర్ వంటి విజనరీ డైరెక్టర్ తెరకెక్కించిన `గేమ్ చేంజర్లో` కూడా కొన్ని చోట్ల గ్రాఫిక్స్ నాణ్యత లోపించిందనే కామెంట్స్ తెర‌పైకి వ‌చ్చాయి. ఈ ర‌క‌మైన నెగిటివిటీ వందల కోట్ల బడ్జెట్ సినిమాల ప్రతిష్టను దెబ్బతీస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం `విశ్వంభర` ప్రస్తుతం ఇదే విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా సందిగ్ధంలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యినా? గ్రాఫిక్స్ అవుట్‌పుట్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మేకర్స్ పదేపదే మార్పులు చేస్తున్నారు. అందుకే ఈ భారీ చిత్రం విడుదల తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. నాణ్యత విషయంలో రాజీ పడితే ఫలితం దెబ్బతింటుందని భావించిన చిరంజీవి అండ్ కో ఈ విషయంలో దర్శకుడు వశిష్టకు పూర్తి సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కేవలం సీనియర్ హీరోలే కాదు. యువ హీరోల ప్రాజెక్టులు కూడా గ్రాఫిక్స్ మాయాజాలంలో చిక్కుకుంటున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ నటించిన పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా `స్వయంభు` ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. యుద్ధ సన్నివేశాలు, పురాతన కట్టడాలను గ్రాఫిక్స్‌లో చూపించే క్రమంలో సాంకేతిక ఇబ్బందులు ఎదుర వుతున్నాయి. అలాగే నాగచైతన్య న‌టిస్తోన్న `వృశ‌క‌ర్మ` చిత్రానికి సంబంధించి విజువ‌ల్ ఎఫెక్స్ట్ అత్యంత కీల‌కం.

మిస్టిక్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ కావ‌డంతో? టెక్నిక‌ల్ గా సినిమాను హైలైట్ చేయాల్సి రావ‌డంతో? పిన్ టూ పిన్ జా్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా కూడా రిలీజ్ ఆల‌స్య‌మువుతుంది.

అలాగే గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే `నాగబంధం` చిత్రం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పౌరాణిక, జానపద కథలను తెరకెక్కించేటప్పుడు విజువల్స్ సహజంగా లేకపోతే ప్రేక్షకులు వాటిని తిరస్కరిస్తున్నారు. అందుకే క్వాలిటీ కోసం వాయిదా అనేది టాలీవుడ్‌లో కామన్ గా మారిపోయింది. విఎఫ్ఎక్స్ కంపెనీలు ఇచ్చిన గడువుకు పనులు పూర్తి చేయలేకపోవడం లేదా దర్శకులు ఊహించిన అవుట్‌పుట్ రాకపోవడం వల్ల నిర్మాతలు భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది అన్న‌ది కాద‌న‌లేని నిజం.

గ్రాఫిక్స్ అనేవి కథను ఎలివేట్ చేయడానికి ఉపయోగపడాలి తప్ప కథను మరుగున పరచకూడదు. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఉండాలని కోరుకోవడం మంచిదే కానీ దానికి తగ్గట్టుగా ముందే పక్కా ప్లానింగ్ లేకపోవడం పెద్ద లోపం. విఎఫ్ఎక్స్ కోసం ఎంత సమయం పడుతుందో సరిగ్గా అంచనా వేయలేక రిలీజ్ డేట్లను ప్రకటించడం, ఆ తర్వాత వాయిదా వేయడం వల్ల సినిమాపై ఉన్న బజ్ తగ్గే ప్రమాదం ఉంది. రిలీజ్ తేదీలు ప్ర‌క‌టించి మ‌ళ్లీ అప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేయ‌డం వ‌ల్ల ప్రేక్షకుల్లో కూడా అసహనం పెరుగుతుంది. భ‌విష్య‌త్ లోనైనా ఇఆంటి పున‌రావృతం కాకుండా మేక‌ర్స్ ముందుగానే జాగ్ర‌త్త‌ప‌డాలి.

తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలంటే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో పక్కా విజన్ ఉండాలి. వందల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు సాంకేతిక నిపుణులతో సమన్వయం చేసుకుంటూ నాణ్యతను కాపాడుకోవాలి. `విశ్వంభర`, `స్వయంభు` వంటి చిత్రాలు ఆలస్యమైనా సరే? అద్భుతమైన విజువల్స్‌తో థియేటర్లకు వస్తేనే ఆ వాయిదాలకు అర్థం ఉంటుంది. లేదంటే బాక్సాఫీస్ వద్ద భారీ మూల్యం చెల్లించక తప్పదు.