ఐదు భాషలు అక్కర్లేదు.. తెలుగుతోనే రూ.200 కోట్లు!
తెలుగు సినిమా రూ.200 కోట్ల మార్క్ దాటడం ఇప్పుడు కొత్త విషయం కాదు.
By: M Prashanth | 14 Sept 2026 11:18 AM ISTతెలుగు సినిమా రూ.200 కోట్ల మార్క్ దాటడం ఇప్పుడు కొత్త విషయం కాదు. కానీ పాన్ ఇండియా రిలీజ్ లేకుండా, జస్ట్ తెలుగు వెర్షన్‌తోనే ఆ నెంబర్ ను అందుకోవడం మరో హైలెట్. బాహుబలి, పుష్ప, దేవర, హనుమాన్ లాంటి సినిమాలకు ఇతర భాషల మార్కెట్ కూడా తోడైంది. వాటిని పక్కన పెడితే తెలుగు ప్రేక్షకులు, ఓవర్సీస్ తెలుగు మార్కెట్‌తో రూ.200 కోట్లకు పైగా వెళ్లిన సినిమాల లిస్ట్ చిన్నదే.
అంచనాల ప్రకారం తెలుగు రీజినల్ సినిమాల్లో టాప్ 5 వరల్డ్ వైడ్ గ్రాస్..
1. మన శంకర వర ప్రసాద్ గారు: రూ.375 కోట్లు
2. అల.. వైకుంఠపురములో: రూ.262 నుంచి 280 కోట్లు
3. సరిలేరు నీకెవ్వరు: దాదాపు రూ.260 కోట్లు
4. సంక్రాంతికి వస్తున్నాం: దాదాపు రూ.255 నుంచి 258 కోట్లు
5. సర్కారు వారి పాట: రూ.230 కోట్లు
ఈ లిస్టులో మొదటి స్థానంలో చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు ఉండటం కంటే మరో ఇంట్రెస్టింగ్ లెక్క కూడా ఉంది. మొదటి ఐదింటిలో రెండు సినిమాలు అనిల్ రావిపూడివే. 2025లో వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాం రూ.250 కోట్ల మార్క్ దాటితే, ఏడాది తర్వాత చిరంజీవితో చేసిన మన శంకర వర ప్రసాద్ గారు దాన్ని చాలా దూరం తీసుకెళ్లింది. రెండు సినిమాలు కూడా సంక్రాంతి సీజన్‌లోనే వచ్చాయి.
2020 సంక్రాంతికి మాత్రం ఒకేసారి రెండు తెలుగు సినిమాలు రూ.200 కోట్ల క్లబ్‌లోకి వెళ్లాయి. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మధ్య అప్పట్లో పోటీ నడిచింది. అల వైకుంఠపురములోకు ట్రేడ్ లెక్కల్లో రూ.262 నుంచి రూ.280 కోట్ల వరకు నంబర్లు ఉండగా, సరిలేరు నీకెవ్వరు దాదాపు రూ.260 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. ఒకే పండగ సీజన్ నుంచి రెండు రీజినల్ సినిమాలు ఈ రేంజ్‌కు వెళ్లడం అప్పట్లో పెద్ద విషయం.
మహేష్ బాబు మరోసారి సర్కారు వారి పాటతో కూడా ఈ క్లబ్‌లోకి వచ్చారు. 2022లో విడుదలైన ఈ సినిమాకు మేకర్స్ రూ.230 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ప్రకటించారు. దీంతో ఈ టాప్ 5లో రెండు సినిమాలు ఉన్న హీరోగా మహేష్ కనిపిస్తున్నారు. రామ్ చరణ్ రంగస్థలం కూడా రూ.216 కోట్ల దగ్గరకు వెళ్లింది. ప్రస్తుతం టాప్ 5కు వెంటనే బయట ఉన్న పెద్ద తెలుగు రీజినల్ గ్రాసర్ అదే.
