Begin typing your search above and press return to search.

పల్లెటూరి అమ్మాయి పాత్రల్లో ఒదిగిన భామలు వీళ్ళే!

తెలుగు తెరపై హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ తారలే కాదు, మట్టి వాసన ఉన్న పాత్రల్లోనూ ప్రాణం పోయగలరని మన ముద్దుగుమ్మలు నిరూపించారు.

By:  Madhu Reddy   |   31 Jan 2026 5:00 PM IST
పల్లెటూరి అమ్మాయి పాత్రల్లో ఒదిగిన భామలు వీళ్ళే!
X

తెలుగు తెరపై హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ తారలే కాదు, మట్టి వాసన ఉన్న పాత్రల్లోనూ ప్రాణం పోయగలరని మన ముద్దుగుమ్మలు నిరూపించారు. 'ఫిదా'లో సాయి పల్లవి తెగువ, 'రంగస్థలం'లో సమంత మాస్ మేనరిజమ్స్ ప్రేక్షకులను ఇప్పటికీ మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా 'భగవంతుడు' సినిమా కోసం పక్కా పల్లెటూరి పిల్లలా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చింది. తన హైట్, మోడ్రన్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఆమె చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి పల్లెటూరి అమ్మాయి పాత్రల్లో ఒదిగిన భామల పైన ఓ లుక్ వేద్దాం..

గ్లామర్ కన్నా.. పల్లెటూరి పరిమళం మిన్న :

తెలుగు సినిమాల్లో హీరోయిన్ అంటే అల్ట్రా మోడ్రన్ లేదా రిచ్‌గా ఉండాలనే రూల్ ఏమీ లేదు. కొన్నిసార్లు పచ్చని పొలాల మధ్య, లంగా ఓణి కట్టిన అమాయకత్వం కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. 'ఫిదా'లో సాయి పల్లవి భానుమతి గా చూపించిన తెలంగాణ పల్లెటూరి తెగువ, 'రంగస్థలం'లో రామలక్ష్మిగా సమంత పండించిన మాస్ పల్లెటూరి హావభావాలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే.

దేవర మూవీలో జాన్వీ కపూర్ మొదటిసారి తెలుగు మూవీ చేస్తూ గ్లామర్ కన్నా పల్లెటూరు మిన్న అన్నట్టు ఫుల్ మూవీ అంతా అదే పాత్రలో కొనసాగింది. ఇక అప్పట్లో వచ్చిన 'చందమామ'లో కాజల్, 'మిర్చి'లో అనుష్క, 'కరెంట్ తీగ'లో రకుల్, 'అ ఆ'లో అనుపమ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ గ్లామర్ ఇమేజ్‌ని పక్కన పెట్టి మట్టి వాసన కలిగిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఈ పాత్రలే వారి కెరీర్‌కు మైలురాళ్లుగా నిలిచాయి.

చిట్టి ఇక పల్లెటూరి గుమ్మ:

'జాతి రత్నాలు' సినిమాతో చిట్టిగా అందరి మనసు దోచుకున్న ఫరియా అబ్దుల్లా, ఇప్పుడు 'భగవంతుడు' చిత్రంతో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. తాజాగా విడుదలైన టీజర్‌లో ఆమె లుక్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎత్తుగా ఉండే ఫరియా, పల్లెటూరి లంగా ఓణిలో ఎంతో ఒద్దికగా కనిపిస్తూనే, మరోవైపు తనదైన శైలిలో రొమాంటిక్ సీన్స్‌లో గ్లామర్ టచ్ కూడా ఇచ్చింది. సాధారణంగా పల్లెటూరి పాత్రలు అంటే కొంత రిస్క్ అని భావిస్తారు, కానీ సాయి పల్లవి, సమంతల మాదిరిగానే ఫరియా కూడా ఈ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి సక్సెస్ బాట పడుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

హీరోయిన్లు పల్లెటూరి పాత్రలు చేయడం వల్ల వారిలోని నటనా సామర్థ్యం బయటపడటమే కాకుండా, మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. 'భగవంతుడు' సినిమాలో ఫరియా చేస్తున్న ఈ పల్లెటూరి ప్రయత్నం తప్పకుండా ఆమెకు మంచి బ్రేక్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటేనే ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం రాణించవచ్చని భావించి, ఇప్పుడు ఫరియా కూడా అదే బాటలో నడుస్తోంది. మరి ఈ 'పల్లెటూరి భామ' బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు మేపిస్తుందో చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే..