తెర మరుగైన హీరోయిన్స్.. మళ్ళీ సందడి చేస్తారా?
పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే, కొత్త పాత్రల్లో ఒదిగిపోవడానికి సిద్ధమవుతున్న ఆ తారల రీ-ఎంట్రీ కోసం సగటు సినిమా ప్రేక్షకుడు ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.
By: Madhu Reddy | 30 Jan 2026 1:00 AM ISTవెండితెరపై ఒక మెరుపు మెరిసి మాయమైన తారలు మళ్ళీ కనిపిస్తే ఆ కిక్కే వేరు. ఒకప్పుడు తమ నటనతో, గ్లామర్‌తో కుర్రకారు మనసు గెలుచుకున్న హీరోయిన్లు పెళ్లి తర్వాతో లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్లనో పరిశ్రమకు దూరమయ్యారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. అలనాటి అందాల తారలు మళ్ళీ మేకప్ వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే, కొత్త పాత్రల్లో ఒదిగిపోవడానికి సిద్ధమవుతున్న ఆ తారల రీ-ఎంట్రీ కోసం సగటు సినిమా ప్రేక్షకుడు ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.
ఆ హీరోయిన్స్ ఇస్తున్న కొత్త హోప్, మారుతున్న ట్రెండ్:
ఒకప్పుడు 'స్వయంవరం' సినిమాతో తెలుగింటి అమ్మాయిలా మెప్పించిన లయ 14 సంవత్సరాల తరువాత 'తమ్ముడు' లో నటించారు. 'మన్మథుడు'లో తన క్యూట్ యాక్టింగ్‌తో కట్టిపడేసిన అన్షు అంబానీ 22 సంవత్సరాల తరువాత 'మజాకా' మూవీలో కనిపించారు.ఇక అలాగే బొమ్మరిల్లు మూవీలో హాసిని గా తెలుగు వారి గుండె దోచుకున్న జెనీలియా కూడా 13 ఏళ్ల తరువాత 'జూనియర్' మూవీలో పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించి మెప్పించారు. ఇక నువ్వు నేను ఫేమ్ అనిత కూడా దాదాపు 20 సంవత్సరాల తరువాత 'ఓ భామ అయ్యో రామ' అనే సినిమాతో కెమెరా ముందుకు వచ్చారు.
వీరంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల హృదయాలను మళ్ళీ తడుముతున్నారు. పైగా ఈ హీరోయిన్స్ తాజా ఫోటోలు, వీడియోలు చూస్తుంటే వారు సెకండ్ ఇన్నింగ్స్ కోసం మరింత సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లయ, జెనీలియా ఇటీవల కనిపిస్తున్న తీరు, డ్యాన్స్ వీడియోలు చూస్తుంటే వీరు ఇంకా అదే గ్రేస్‌తో ఉన్నారని నిరూపిస్తున్నాయి. అన్షు కూడా సినిమాలో గట్టి కం బ్యాక్ ఇవ్వాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం విశేషం. వీరిని స్ఫూర్తిగా తీసుకుని, ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా వెలిగిన మరికొంతమంది తారలు కూడా వెండితెరపై తిరిగి మెరవడానికి కథల వేటలో పడ్డారు. ఇప్పుడున్న ఓటీటీ విప్లవం వారికి మంచి వేదికగా మారుతోంది.
కథ కుదిరితే సెకండ్ ఇన్నింగ్స్ ఖాయమేనా?:
హీరోయిన్ల రీ-ఎంట్రీ అనేది కేవలం గ్లామర్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఇప్పుడున్న ప్రేక్షకులు కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలనే కోరుకుంటున్నారు. జ్యోతిక, నయనతార, టబు,విజయశాంతి,రమ్యకృష్ణ వంటి వారు సెకండ్ ఇన్నింగ్స్‌లో పవర్‌ఫుల్ పాత్రలతో దూసుకుపోతున్నారు. ఇదే బాటలో మన తెలుగు హీరోయిన్లు కూడా బలమైన క్యారెక్టర్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం హీరోకు తల్లిగానో, అక్కగానో పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే కీలక పాత్రలు పడితే మళ్ళీ పాత రోజులను గుర్తుకు తెస్తూ థియేటర్లలో సందడి చేయడం ఖాయం. ఒకవేళ వీరికి తగిన కథలు, ఉత్తమమైన క్యారెక్టర్లు దొరికితే మాత్రం బాక్సాఫీస్ వద్ద పాత తారల హవా మళ్ళీ మొదలవుతుందనడంలో సందేహం లేదు.
