Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల సినిమాల వేగం - అభిమానుల నిరీక్షణ!

ఈ పరిణామం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబ‌డుతున్నా? అభిమాన నటుడిని వెండితెరపై తరచుగా చూడాలనుకునే అభిమానులకు మాత్రం నిరీక్షణగా మారుతోంది.

By:  Srikanth Kontham   |   21 April 2026 12:00 AM IST
స్టార్ హీరోల సినిమాల వేగం - అభిమానుల నిరీక్షణ!
X

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రాంతీయ స‌రిహ‌ద్దులు దాటి పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ గ్లోబల్ ఇమేజ్ వారి సినిమాల వేగాన్ని మాత్రం గణనీయంగా తగ్గించింద‌న్న‌ది అంతే వాస్త‌వం. ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు ఒక్క సినిమాను పూర్తి చేయడానికి ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. ఈ పరిణామం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబ‌డుతున్నా? అభిమాన నటుడిని వెండితెరపై తరచుగా చూడాలనుకునే అభిమానులకు మాత్రం నిరీక్షణగా మారుతోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే? `ఆర్ఆర్ఆర్` తర్వాత చ‌ర‌ణ్‌ వేగం పెంచుతాడ‌ని అంతా భావించారు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని స్వయంగా ప్ర‌క‌టించినా `గేమ్ ఛేంజర్` షూటింగ్ స‌హా రిలీజ్ ఆల‌స్య మ‌వ్వ‌డం...అటుపై ప్లాప్ అవ్వ‌డం చ‌ర‌ణ్ ప్లానింగ్ నే మార్చేసింది. ఫలితంగా చ‌ర‌ణ్ అభిమానుల‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. `గేమ్ ఛేంజ‌ర్` రిలీజ్ అయి ఏడాదిన్న‌ర అవుతుంది. కానీ ఈ సినిమా సంవ‌త్స రాల పాటు సెట్స్ లో ఉంది. త్వ‌ర‌లోనే `పెద్ది` రిలీజ్ అవుతుంది. బుచ్చిబాబు కొత్త ద‌ర్శ‌కుడు కావ‌డంతో? వేగంగా పూర్తి చేసి `పెద్ది`ని రిలీజ్ చేయ‌గ‌ల్గుతున్నాడు. అదే మ‌రో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ అయితే ఈ సినిమా రిలీజ్ కూడా రెండేళ్ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టేదే.

అలాగే సూపర్ స్టార్ మహేష్ పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో రిలీజ్ అయ్యే అడ్వెంచరస్ థ్రిల్లర్ కోసం మ‌హేష్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రి-ప్రొడక్షన్ పనులకే సుదీర్ఘ సమయం పట్టడంతో? మహేష్ దాదాపు మూడేళ్లుగా వెండితెరకు దూరమవుతున్న‌ట్లే. ఇంత లాంగ్ గ్యాప్ మ‌హేష్ ఇంత వ‌ర‌కూ ఏ సినిమాకు తీసుకోలేదు. మ‌హేష్ మూడేళ్లు తెర‌పై క‌నిపించ‌డా? అనే వార్త అభిమానుల్లో ఓ నిరాశ‌ను నింపుతుంది. కానీ రాజమౌళి ఇచ్చే అవుట్‌పుట్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందనే నమ్మకంతో వారంతా ఎంతో ఆస‌క్తిగానూ ఎదురు చూస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే బాటలో కనిపిస్తున్నారు. `పుష్ప: ది రూల్` సాధించిన సంచలన విజయం తర్వాత అట్లీతో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం తీసుకోలేదు. కానీ సెట్స్ కు వెళ్లిన త‌ర్వాత మాత్రం చాలా జాప్యం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న‌ది క్లారిటీ లేదు. 2027 లో రిలీజ్ ఉండొచ్చు అన్న‌ది ఓ అంచ‌నా మాత్ర‌మే. దీనిపై మేక‌ర్స్ స్పందిస్తే గానీ క్లారిటీ రాదు. అయినా `రాకా` కూడా రెండున్న‌రేళ్ల త‌ర్వాత రిలీజ్ అయ్యే చిత్ర‌మే అవుతుందంటున్నారు.

ఇలాంటి రిలీజ్ ల విష‌యంలో ప్రభాస్ మాత్ర‌మే మిగతా హీరోల కంటే మెరుగైన స్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. `బాహుబలి` తర్వాత ఆయన ఒక్కో సినిమాకు సమయం తీసుకున్నా? ఆ త‌ర్వాత ఒకేసారి అరడజను ప్రాజెక్టులను లైన్ పెట్టి బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లు ఉండేలా భారీ గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `ఫౌజీ`, `స్పిరిట్`, `క‌ల్కి 2` చిత్రాలు సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మొత్తంగా పాన్ ఇండియా మార్కెట్ తో సినిమాల స్కేల్ , నాణ్యత పెరిగాయి. కానీ కంటెంట్ డెలివరీలో వేగం తగ్గింది. భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ , అంతర్జాతీయ ప్రమాణాల కోసం జాప్యం అనివార్యమని పరిశ్రమ సైతం భావిస్తుంది.