నార్త్ మార్కెట్‌పై టాలీవుడ్ హీరోల ఫోకస్ !
టాలీవుడ్ హీరోల ఆలోచనా ధోరణిలో పెను మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమైన మన సినిమాలిప్పుడు ఉత్తరాది గడ్డపై జెండా పాతడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.
By: Srikanth Kontham | 10 May 2026 4:00 PM ISTటాలీవుడ్ హీరోల ఆలోచనా ధోరణిలో పెను మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమైన మన సినిమాలిప్పుడు ఉత్తరాది గడ్డపై జెండా పాతడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. `బాహుబలి`, `పుష్ప` వంటి చిత్రాలు సాధించిన అసాధారణ విజయాలు హిందీ మార్కెట్ పొటెన్షియల్‌ను తెలుగు హీరోలకు రుచి చూపిం చాయి. ఈ నేపథ్యంలో సినిమాలను ఇప్పుడు డబ్ చేయడమే కాకుండా అక్కడి ప్రేక్షకులకు చేరువయ్యేలా వినూత్నమైన ప్రమోషన్ వ్యూహాలను టాలీవుడ్ అగ్ర తారలు అమలు చేస్తున్నారు.
ఈ వ్యూహంలో భాగంగా ప్రమోషన్ల కోసం ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా హిందీ రాష్ట్రాల్లోని టైర్-2 నగరాలపై తెలుగు హీరోలు ఫోకస్ పెంచడం ఓ ఆసక్తికరమైన మలుపు. అల్లు అర్జున్ `పుష్ప 2` ఈవెంట్‌ను బీహార్‌లోని పాట్నాలో నిర్వహించి అక్కడ లక్షలాది మంది జనాన్ని ఆకర్షించడం భారతీయ సినీ పరిశ్రమలోనే ఓ సంచలనం సృష్టించింది. ఒక తెలుగు హీరో బీహార్ నడిబొడ్డున అంతటి ఆదరణ పొందడం చూసి బాలీవుడ్ సైతం విస్తుపోయింది. ఆ సక్సెస్ ఫార్ములానే ఇప్పుడు ఇతర హీరోలు కూడా ఫాలో అవుతున్నారు.
సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ సైతం తన మార్కెట్‌ను విస్తరించుకునే క్రమంలో `అఖండ 2: తాండవం` సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించారు. మాస్ సినిమాలకు నార్త్ ఇండియాలో ఉండే క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో బాలయ్య ఒకడుగు ముందే ఉన్నారు. `అఖండ` మొదటి భాగం హిందీ టెలివిజన్ , యూట్యూబ్ వెర్షన్లకు వచ్చిన మిలియన్ల కొద్దీ వ్యూస్ చూశాక సీక్వెల్‌ను నేరుగా హిందీ బెల్ట్‌లో ప్రమోట్ చేయడం ద్వారా సినిమా రేంజ్‌ను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోయే చిత్రం `పెద్ది` విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చరణ్‌కు నార్త్‌లో ఉన్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని భోపాల్ వంటి ప్రధాన నగరాల్లో ఈవెంట్ చేయడం ద్వారా సినిమాకు దేశవ్యాప్తంగా భారీ బజ్ తీసుకు రావొచ్చు అన్నది మేకర్స్ ప్లాన్. `ఆర్ఆర్ఆర్` తర్వాత చరణ్ నుంచి వస్తోన్న మాస్ సినిమా కావడంతో హిందీ ఆడియెన్స్ కూడా దీనిపై ఆసక్తిగా ఉన్నారు.
ఇలా తెలుగు హీరోలు ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించడం వెనుక బలమైన ఆర్థిక సమీకరణాలు ఉన్నాయి. ఒక సినిమా హిట్టు కొట్టడమే కాకుండా తమ తదుపరి చిత్రాలకు కూడా అక్కడ మార్కెట్ స్థిరపడాలని కోరుకుంటున్నారు. తెలుగు సినిమాల మేకింగ్ స్టైల్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు , ఎమోషన్స్ హిందీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అందుకే తెలుగు హీరోలు కూడా అక్కడి స్థానిక భాషా సంస్కృతులను గౌరవిస్తూ ప్రజలతో నేరుగా మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు.చివరిగా టాలీవుడ్ ప్రాంతీయ సరిహద్దులను చెరిపివేసి జాతీయ స్థాయి ఇండస్ట్రీగా అవతరించింది.
పాట్నాలో పుష్ప రాజ్ చూపిన జోరు, రేపు భోపాల్‌లో `పెద్ది` చూపించబోయే సందడి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచనున్నాయి. తెలుగు హీరోలు అనుసరిస్తున్న నార్త్ ఫోకస్ వ్యూహం తో రెవెన్యూ మాత్రమే కాకుండా భారతీయ సినిమా అంటే టాలీవుడ్ అనే స్థాయికి గుర్తింపు రావడం ఖాయం. భవిష్యత్తులో తెలుగు చిత్రాల వేడుకలు ఉత్తరాది గడ్డపై మరిన్ని కొత్త నగరాల్లో జరిగే అవకాశం ఉంది.
