Begin typing your search above and press return to search.

'రెమ్యూనరేషన్' రోల్.. ఎంతలో ఉంటే మంచిది..

సినిమా హిట్ అయితే హీరో రేంజ్ మారుతుంది. కొత్త ఛాన్సులు వస్తాయి. మార్కెట్ పెరుగుతుంది.

By:  M Prashanth   |   20 Oct 2026 10:00 PM IST
రెమ్యూనరేషన్ రోల్.. ఎంతలో ఉంటే మంచిది..
X

సినిమా హిట్ అయితే హీరో రేంజ్ మారుతుంది. కొత్త ఛాన్సులు వస్తాయి. మార్కెట్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ పెరుగుతుంది. ఇందులో తప్పేమీ లేదు. కానీ ఒక్క హిట్‌ తో భారీ మొత్తాన్ని ఆశించడం, డబ్బు విషయంలో పట్టుదలకు పోవడం వల్ల కొన్నిసార్లు మంచి ఛాన్సులు చేజారిపోతాయి. అందుకే రెమ్యూనరేషన్ విషయంలో హీరోలు ఎంతవరకు వెళ్లాలనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

సినీ ఇండస్ట్రీలో డబ్బుకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోలు కూడా తమ కష్టానికి తగిన రిజల్ట్ కోరుకుంటారు. ఒక సినిమా విజయం సాధిస్తే తమ మార్కెట్ పెరిగిందని భావిస్తారు. అందుకు తగ్గట్టుగా తర్వాతి సినిమాలకు ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతారు. అయితే అది ఒక లిమిట్ లోనే ఉంటేనే మంచిది. ఎందుకంటే హీరో తీసుకునే మొత్తం పెరిగే కొద్దీ నిర్మాతపై భారం కూడా పెరుగుతుంది.

ఒక సినిమా కోసం నిర్మాత భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తే, ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించడం పెద్ద సవాలుగా మారుతుంది. హీరో పారితోషికంతో పాటు స్టోరీ, డైరక్షన్, ఇతర క్యాస్టింగ్, ప్రమోషన్స్, రిలీజ్ ఖర్చులు కూడా ఉంటాయి. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకున్నప్పుడే సినిమా బడ్జెట్ అదుపులో ఉంటుంది. హీరో రెమ్యూనరేషన్ ఎక్కువై మిగిలిన ఖర్చులకు ఇబ్బంది వస్తే, అది రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది.

అయితే ఒక్క హిట్‌ తో హీరో మార్కెట్ పెరగొచ్చు. కానీ ఆ రేంజ్ నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. వరుసగా మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో ఆదరణ పెంచుకున్నప్పుడే కెరీర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక సక్సెస్ ఇచ్చిన జోష్ తో ప్రతి సినిమాకు భారీ మొత్తం ఆశిస్తే, తర్వాత ప్రాజెక్టుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో నిర్మాతలతో సంబంధాలు కూడా ముఖ్యమే.

ఒక సినిమాకు పారితోషికం విషయంలో తేడాలు వచ్చినప్పుడు వెంటనే మరో ప్రాజెక్టు వైపు వెళ్లిపోవడం కంటే, చర్చలకు ఛాన్స్ ఇవ్వడం మంచిది. నిర్మాతకు తన లెక్కలు ఉంటాయి. హీరోకు తన అంచనాలు ఉంటాయి. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటేనే సినిమా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో ఇద్దరికీ ఓకే అయ్యే డెసిషన్ ను తీసుకోవచ్చు.

అయితే హీరోలు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవాలన్నది దీని అర్థం కాదు. తమ మార్కెట్‌ కు తగ్గ మొత్తం అడగడంలో తప్పులేదు. కానీ ఆ మొత్తం వల్ల సినిమా నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. తనకు ఎంత వస్తుందనే దానితో పాటు, సినిమా సక్సెస్ అయితే నిర్మాతకు ఎంత లాభం వస్తుందనే విషయాన్ని కూడా ఆలోచించాలి. అప్పుడే ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది.

ముఖ్యంగా హీరో కెరీర్‌ లో డబ్బుతో పాటు మంచి కథలు, సరైన సినిమాలూ మెయిన్. ఎక్కువ రెమ్యూరేషన్ తీసుకున్నా సినిమా రిజల్ట్ బాగుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఆశించిన స్థాయిలో ఆడకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రెమ్యూనరేషన్ కెరీర్‌ లో మెయిన్ రోల్ పోషించాలి. కానీ అదే కెరీర్‌ ను నడిపించే ఏకైక ఎలిమెంట్ కాకూడదని నెటిజన్లు అనేక మంది అభిప్రాయపడుతున్నారు.