మేకింగ్ తపనతోనే డైరెక్టర్లుగా!
కమర్షియల్ విజయాల కంటే కూడా తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ చిత్రానికి మెగాఫోన్ పట్టారు.
By: Srikanth Kontham | 17 May 2026 1:27 PM ISTస్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు దర్శకత్వం వైపు అడుగులు వేయడం వెనుక సక్సెస్ ఫార్ములా మాత్రమే ఉండదు. అంతకుమించిన సినిమా అంటే ఫ్యాష్.. తమదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరించాలనే బలమైన తపన ఉంటుంది. ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ సైతం భవిష్యత్తులో మెగాఫోన్ పడతానని ప్రకటిం చిన నేపథ్యంలో టాలీవుడ్‌లో రామ్ కంటే ముందే దర్శకులుగా మారిన అగ్ర హీరోల ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఓ పాయింట్ స్పష్టమవుతుంది.
స్టార్ హీరోలు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయా ? ప్లాప్ అయ్యాయా? అన్నదానితో సంబంధం లేకుండా వారు చేసిన టెక్నికల్ ప్రయోగాలు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ప్రస్థానం అత్యంత అద్భుతమైనది. నటుడిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కమర్షియల్ ఫార్ములాకే పరిమితం కాలేదు. `దాన వీర శూర కర్ణ`, `సీతారామ కళ్యాణం` వంటి క్లాసిక్ చిత్రాలకు స్వయంగా దర్శకత్వం వహించారు.
ఒకే సినిమాలో మూడు విభిన్న పాత్రలు పోషిస్తూ నిర్మాణ విలువలను పర్యవేక్షిస్తూ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సినిమాను డైరెక్ట్ చేయడం అప్పట్లో సంచలనం. మేకింగ్ పరంగా ఆయన చూపించిన క్రమశిక్షణ షాట్ మేకింగ్ విధానం తెలుగు సినిమాకు సరికొత్త పాఠాలు నేర్పాయి. ఆ తర్వాతి కాలంలో సూపర్ స్టార్ కృష్ణ సైతం నటుడిగా వందలాది సినిమాలు చేస్తూనే దర్శకత్వం వైపు అడుగులు వేశారు. కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన `సింహాసనం` చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది.
కమర్షియల్ విజయాల కంటే కూడా తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ చిత్రానికి మెగాఫోన్ పట్టారు. తెలుగులో తొలి 70ఎంఎం స్టీరియోఫోనిక్ సౌండ్ టెక్నాలజీని తీసుకొచ్చి టెక్నికల్ పరంగా డైరెక్టర్ ఎలా ఆలోచించాలో? ఆయన నిరూపించారు. బాక్సాఫీస్ ఫలితాలకు అతీతంగా కృష్ణ సాహసోపేతమైన టేకింగ్ స్టైల్ పరిశ్రమను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఆధునిక కాలంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన `జాని`పర్ఫెక్ట్ ఉదాహరణ. అప్పట్లో `ఖుషి` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయోగం కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించలే కపోయింది. కానీ ఆ సినిమాలో పవన్ ఉపయోగించిన లైవ్ ఆడియో రికార్డింగ్, సహజసిద్ధమైన ఫైట్ కంపోజిషన్స్, ఆల్టర్నేటివ్ స్క్రీన్‌ప్లే విధానం అప్పట్లో ఓ సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికాయి.
నేటి తరం యంగ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సైతం ఇదే బాటలో పయనిస్తున్నాడు. `ఫలక్‌నుమా దాస్`, `దాస్ కా ధమ్కీ` వంటి చిత్రాలను స్వయంగా డైరెక్ట్ చేసి నటుడిగా, దర్శకుడిగా తనలోని సృజనాత్మకతను చాటుకున్నాడు. హిట్, ప్లాపుల సమీకరణాల కంటే తన కథను తానే బెస్ట్‌గా ప్రెజెంట్ చేయగలననే నమ్మకంతోనే నేటి తరం హీరోలు మెగాఫోన్ పడుతున్నారు. అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ వంటి వారు కూడా రైటింగ్ మరియు మేకింగ్ విభాగాల్లో పూర్తి స్థాయి పట్టు సాధిస్తూ సినిమా బాధ్యతను భుజాన వేసుకుంటున్నారు.
