Begin typing your search above and press return to search.

ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన టాలీవుడ్ మూవీస్.. స్పెషల్ ఏంటంటే?

మరి మన టాలీవుడ్‌లో అత్యధిక భాషల్లో రీమేక్ అయి, అసలు సిసలైన రికార్డు క్రియేట్ చేసిన ఆ సినిమాలేంటో ఓసారి చూసేద్దామా..

By:  Madhu Reddy   |   28 May 2026 8:45 AM IST
ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన టాలీవుడ్ మూవీస్.. స్పెషల్ ఏంటంటే?
X

టాలీవుడ్ సినిమాల రేంజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకప్పుడు కేవలం డబ్బింగ్ సినిమాలకే పరిమితం అనుకున్న మన కథలు, ఇప్పుడు దేశవిదేశాల్లోని రకరకాల భాషల్లోకి రీమేక్ అవుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమల వాళ్లు మన తెలుగు కథల కోసం క్యూ కడుతున్నారు. మరి మన టాలీవుడ్‌లో అత్యధిక భాషల్లో రీమేక్ అయి, అసలు సిసలైన రికార్డు క్రియేట్ చేసిన ఆ సినిమాలేంటో ఓసారి చూసేద్దామా..

రీమేక్ అంటే ఏంటి?:

ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమా కథను, వేరే భాషలోని ప్రేక్షకుల అలవాట్లకు, అక్కడి నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేసి మళ్లీ తీయడాన్ని 'రీమేక్' అంటారు. ఇక మన తెలుగులో వచ్చిన ఎన్నో అద్భుతమైన ఫ్యామిలీ, యాక్షన్ సినిమాలు ఇతర భాషల దర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

9 భాషల్లో రీమేక్.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రికార్డ్:

టాలీవుడ్ లో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుంటే.. అందరికంటే ముందు నిలిచేది ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. సిద్ధార్థ్, త్రిష హీరోహీరోయిన్లుగా ప్రభుదేవా డైరెక్షన్‌లో వచ్చిన ఈ ప్యూర్ లవ్ స్టోరీ ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయి ఎవరికీ సాధ్యంకాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

8 భాషలను ఊపేసిన మహేష్ బాబు ‘ఒక్కడు’:

మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ఒక్కడు’ సినిమా అప్పట్లో కేవలం తెలుగులోనే రిలీజ్ అయింది. కానీ దీని కథలోని దమ్ము చూసి దాదాపు 8 భాషల్లో రీమేక్ చేశారు. తమిళంలో విజయ్ ‘గిల్లి’గా, హిందీలో అర్జున్ కపూర్ ‘తేవర్’గా, కన్నడలో ‘అజయ్’గా తీశారు. ఇక అంతేకాదు బెంగాలీ, ఒడియా, చివరికి శ్రీలంకకు చెందిన సింహళ భాషలో కూడా ‘కబడ్డీ’ పేరుతో రీమేక్ కావడం విశేషం.

6 భాషల్లో రౌడీయిజం చేసిన ‘విక్రమార్కుడు’:

దర్శక ధీరుడు రాజమోళి, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు. ఈ పవర్‌ఫుల్ పోలీస్ కథ మొత్తం 6 భాషల్లో పునర్నిర్మితమైంది. ఇక హిందీలో అక్షయ్ కుమార్ ‘రౌడీ రాథోడ్’గా, తమిళంలో కార్తీ ‘సిరుతై’గా చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఇక బెంగాలీతో పాటు బంగ్లాదేశ్‌లో కూడా ఈ సినిమాను రెండు సార్లు రీమేక్ చేశారు.

బాలీవుడ్‌కు ఊపిరిపోసిన ‘పోకిరి’:

మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ కేవలం 3 భాషల్లోనే రీమేక్ అయినప్పటికీ, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ స్పెషల్ రీమేక్‌గా నిలిచింది. ఎందుకంటే తమిళంలో విజయ్ ‘పోక్కిరి’గా, కన్నడలో ‘పోర్కి’గా హిట్ అవ్వడమే కాకుండా.. హిందీలో సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్’గా వచ్చి అప్పట్లో ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ కెరీర్‌ను మళ్లీ నిలబెట్టింది.

కథలో బలం, ఎమోషన్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఏ దేశ ప్రజలైనా ఆదరిస్తారని మన తెలుగు సినిమాలు నిరూపించాయి. ఇక టాలీవుడ్ నుంచి వెళ్లిన రీమేక్ సినిమాలు అన్ని భాషల్లోనూ వందల కోట్లు వసూలు చేయడం మన తెలుగు సినిమా స్క్రిప్ట్ పవర్ ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది. ఇది మన తెలుగు వారు ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం..