Begin typing your search above and press return to search.

ఎవరీ నాగదుర్గ? ఫోక్ సాంగ్స్ టూ హీరోయిన్ గా.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?..

యూట్యూబ్‌లో ఒక్క ఫోక్ సాంగ్ వస్తే చాలు.. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఊగిపోయే తెలంగాణ జానపద గీతాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

By:  Madhu Reddy   |   26 Jun 2026 12:00 PM IST
ఎవరీ నాగదుర్గ? ఫోక్ సాంగ్స్ టూ హీరోయిన్ గా.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?..
X

యూట్యూబ్‌లో ఒక్క ఫోక్ సాంగ్ వస్తే చాలు.. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఊగిపోయే తెలంగాణ జానపద గీతాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి పాటల్లో తన డ్యాన్స్‌తో కుర్రకారును స్టెప్పులేయించిన బ్యూటీనే గుత్తా నాగదుర్గ. 'తిన్నా తిరం పడతలే' అంటూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ నల్గొండ పల్లెటూరి అమ్మాయి, ఇప్పుడు వెండితెరపై కథానాయికగా మెరవబోతోంది. ఫోక్ సాంగ్స్ నుంచి సినిమాల వరకు సాగిన ఆమె సక్సెస్ జర్నీ విశేషాలు తెలుసుకుందాం..

నల్గొండ టూ కూచిపూడి మాస్టర్స్:

నాగదుర్గ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నృత్యంపై ఉన్న మక్కువతో ఆమె క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు. ఇక కేవలం సరదాగా కాకుండా, కూచిపూడి నృత్యంలో ఏకంగా మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేసి ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత తన టాలెంట్‌ను ప్రపంచానికి చూపించడానికి యూట్యూబ్ వేదికను ఎంచుకున్నారు.

యూట్యూబ్‌ను షేక్ చేసిన జానపదాలు:

క్లాసికల్ డ్యాన్సే కాకుండా తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఫోక్ సాంగ్స్‌లో నాగదుర్గ చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా 'తిన్నా తిరం పడతలే', దారిపొంటత్తుండు, పేరుగల్ల పెద్ది రెడ్డి, అలాగే కప్పోళ్ల ఇంటికాడ వంటి సూపర్ హిట్ సాంగ్స్ ఆమెకు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఈ పాటలతో ఆమె ప్రతి ఇంట్లో సుపరిచితమైన ఫేస్ అయిపోయారు.

'NN నృత్యాలయం' అకాడమీ స్థాపన:

కళపై ఉన్న గౌరవంతో నాగదుర్గ కేవలం తను మాత్రమే డ్యాన్స్ చేయకుండా, ఇతరులకు కూడా నేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆమె 'NN నృత్యాలయం' అనే డ్యాన్స్ అకాడమీని స్థాపించారు. ఈ అకాడమీ ద్వారా ఎంతో మంది చిన్నపిల్లలకు, ఆసక్తి గల వారికి డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తూ గురువుగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా:

యూట్యూబ్ స్టార్‌గా మారిన నాగదుర్గ ప్రతిభను గుర్తించిన సినీ పరిశ్రమ ఆమెకు హీరోయిన్ ఆఫర్లను తెచ్చిపెట్టింది. టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా, సుకుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న 'ఇడుపు కాయితం' అనే చిత్రంతో ఆమె టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళంలో ఆమె నటించిన 'లవ్ ఓ లవ్' అనే సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఒక సాధారణ పల్లెటూరి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి, చదువుకుంటూనే డ్యాన్స్‌పై నమ్మకంతో యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఫోక్ సాంగ్స్‌తో అలరించిన ఈ కూచిపూడి కళాకారిణి, ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా కూడా మంచి విజయాలు అందుకోవాలని, తన నటనతో ప్రేక్షకులను మరింతగా మెప్పించాలని ఆశిద్దాం.