Begin typing your search above and press return to search.

చిరంజీవి ఎంట్రీ.. వేతనాల పెంపు కొలిక్కి వచ్చేనా?

టాలీవుడ్ లో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

By:  M Prashanth   |   17 Aug 2025 10:31 AM IST
చిరంజీవి ఎంట్రీ.. వేతనాల పెంపు కొలిక్కి వచ్చేనా?
X

టాలీవుడ్ లో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. దీనిపై ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్‌ మధ్య సఖ్యత కుదరడం లేదు. ఇప్పటికే చర్చలు జరిపినా లాభం లేకుండా పోయింది. వేతనాలు పెంపునకు నిర్మాతలు ఒప్పుకుంటున్నా.. కండీషన్స్ కు కార్మికులు అంగీకరించడం లేదు.

దీంతో 14వ రోజుకు కార్మికుల సమ్మె చేరింది. ఇటీవల చర్చల్లో సమ్మె కొలిక్కి వస్తుందని అంతా అనుకున్నా.. అది కూడా జరగలేదు. ఇప్పుడు ఆ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. ఆయన సమక్షంలో ఆదివారం చర్చలు జరగనున్నాయి. నిర్మాతలు, కార్మిక సంఘాలతో విడివిడిగా సమావేశమై చర్చలు జరపనున్నారు చిరు.

అనంతరం ఇరు వర్గాలకు ఆమోదం అయ్యేలా నిర్ణయాలు వెలువడుతాయని తెలుస్తోంది. దీంతో 30 శాతం వేతనాల పెంపు కోరుతూ కార్మికులు సమ్మె చేపడుతుండగా, ఆదివారంతో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరికొన్ని గంటల్లో అంతా క్లియర్ అవ్వనుందని టాక్ వినిపిస్తోంది.

అయితే కొన్నిరోజులుగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. దీంతో అనేక సినిమాల రిలీజ్ డేట్స్ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. చివరి దశలో చిత్రీకరణలు జరుపుకుంటున్న సినిమాల విడుదల తేదీలపై ప్రభావం పడేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా సమ్మె కొనసాగితే ఇబ్బందేనని అంతా అభిప్రాయపడుతున్నారు.

అదే సమయంలో ఇప్పుడు మెగాస్టార్ విడివిడిగా చర్చలు జరపనున్నారు. దీంతో అంతా కొలిక్కి వస్తుందని.. సోమవారం నుంచి చిత్రీకరణలు మొదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం.. 30 శాతం వేతనాలు పెంపుపై చిరంజీవి హామీ ఇచ్చినట్లు తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఆ సమయంలో మెగాస్టార్ రెస్పాండ్ అయ్యి.. వాటిని ఖండించారు. ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశంలో సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంపుపై తాను హామీ ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. తప్పుడు ప్రచారంపై స్పష్టత ఇచ్చేందుకు రెస్పాండ్ అయినట్లు తెలిపారు. తీరా.. ఇప్పుడు ఆయన వద్దకు పంచాయతీ మొత్తం చేరింది. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.