ఇలా చెప్తే జనాలు నెక్స్ట్ టైమ్ ఎలా నమ్ముతారు రాజా?
రీసెంట్‌గా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాస్ జాతర సినిమా ఈవెంట్‌లో ఇలాంటి ఛాలెంజే విసిరారు. "సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా" అని గట్టిగా చెప్పారు.
By: M Prashanth | 3 Nov 2025 5:12 PM ISTఈ రోజుల్లో ప్రమోషన్ లేనిదే ఏదీ లేదు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. జనాల్లోకి వెళ్లాలంటే ఏదో ఒక హడావుడి చేయాలి. 'హైప్' క్రియేట్ చేయాలి. ఆ హైప్ క్రియేట్ చేసే క్రమంలో కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడినా జనం అర్థం చేసుకుంటారు. "మా సినిమా అద్భుతం, ఒక విజువల్ వండర్" అని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ, కొందరు ఈ ప్రమోషన్ల హడావుడిలో బ్యాలెన్స్ తప్పేస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.
అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. సినిమాను ప్రమోట్ చేసుకోవడం మానేసి, ఏకంగా ఆడియన్స్‌కే సవాళ్లు విసురుతున్నారని నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. "ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను ఇండస్ట్రీ వదిలేస్తా", "థియేటర్లు ఊగిపోకపోతే నా పేరు మార్చుకుంటా", "ఇది నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు" లాంటి భారీ డైలాగులు ఈవెంట్ స్టేజీల మీద పేలుతున్నాయి. ఆ క్షణానికి ఆ మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వొచ్చు, కానీ అసలు కథ రిలీజ్ తర్వాతే మొదలవుతుంది.
రీసెంట్‌గా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాస్ జాతర సినిమా ఈవెంట్‌లో ఇలాంటి ఛాలెంజే విసిరారు. "సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా" అని గట్టిగా చెప్పారు. కట్ చేస్తే, ఆ రొటీన్ కథను చూసి ఆడియన్స్ నిజంగానే షాక్ అయ్యారనే కామెంట్స్ వచ్చాయి. గతంలోనూ ఓ యువ హీరో ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చాడు. కానీ రిజల్ట్ రివర్స్ అయింది. ఒక్క నాని 'కోర్టు' సినిమా విషయంలో తప్ప, ఈ ఛాలెంజ్ ఫార్ములా చాలా మందిని దారుణంగా దెబ్బతీసింది.
ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. సినిమా అనేది వందల మంది టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అలాంటిది, మీ అందరికీ నచ్చేస్తుంది, నచ్చకపోతే ఇదే నా ఛాలెంజ్ అని ఏదో ఒకటి అని గ్యారెంటీ ఇవ్వడం అతిపెద్ద రిస్క్. సినిమా బాగోలేకపోతే, ఆడియన్స్ ఆ సినిమాను మర్చిపోవచ్చు, కానీ వీళ్లు మాట్లాడిన మాటలను మాత్రం మర్చిపోరు. అవే ట్రోల్ మెటీరియల్‌గా మారి, వాళ్ల కెరీర్‌ను డ్యామేజ్ చేస్తాయి.
అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఒక్క సినిమాతో పోయేది ఏముందిలే అనుకుంటే పొరపాటే. అసలు దెబ్బ నెక్స్ట్ సినిమాకు పడుతుందని మరికొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఈసారి వాళ్ళు నిజంగానే ఒక మంచి సినిమా తీసినా, ప్రమోషన్లలో గట్టిగా మాట్లాడినా జనం నమ్మరనేది మరికొందరి వాదన. "ఆ.. పోయినసారి కూడా ఇలాగే చెప్పాడుగా" అని లైట్ తీసుకుంటారనే అభిప్రాయలు వస్తున్నాయి. క్రెడిబిలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి సినిమా మీద నమ్మకంతో మాట్లాడండి తప్పులేదు, కానీ ఆడియన్స్ తెలివిని తక్కువ అంచనా వేసి సవాళ్లు విసిరితే, ఫ్యూచర్‌లో మనల్నే ఎవరూ నమ్మకుండా పోయే ప్రమాదం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
