రేపటి నుంచి సినిమా షూటింగులు బంద్
ఈ సోమవారం నుంచి విధులను బహిష్కరిస్తూ తెలుగు చిత్రసీమ కార్మిక ఫెడరేషన్ మెరుపు సమ్మెకు పిలుపునిచ్చింది.
By: Sivaji Kontham | 3 Aug 2025 11:45 PM ISTఈ సోమవారం నుంచి విధులను బహిష్కరిస్తూ తెలుగు చిత్రసీమ కార్మిక ఫెడరేషన్ మెరుపు సమ్మెకు పిలుపునిచ్చింది. దీని పర్యవసానంగా రేపటి నుంచి షూటింగులు నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. నిర్మాతలతో పలు దఫాలుగా చర్చించినా కార్మికులకు పెంచాల్సిన 30 శాతం భత్యం పెంపుదలకు నిరాకరిస్తున్నారని, దీంతో సమస్యకు ఏళ్ల తరబడి పరిష్కారం లభించడం లేదని ఫిలింఫెడరేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. దీని కారణంగా దాదాపు 10,000 మంది ఫెడరేషన్ కార్మికుల జీవనోపాధి గడిచిన కొన్నేళ్లుగా ప్రభావితం అయిందని తెలిపారు. ఈ సోమవారం నుంచి 24 శాఖల కార్మికులు తమ విధులను బహిష్కరిస్తున్నారని వేతన పెంపునకు అంగీకరించిన నిర్మాతల కోసం మాత్రమే విధుల్లోకి తిరిగి వస్తారని వెల్లడించారు. ఆ మేరకు ఫిలింఫెడరేషన్ అధికారికంగా ఒక నోట్ కూడా విడుదల చేసింది. తక్షణం పెంచిన భత్యాలను నిర్మాతలు విధిగా కార్మికులకు ఇవ్వాలని కూడా ఈ నోట్ లో అల్టిమేటమ్ జారీ చేసారు.
తెలుగు ఫిలింఛాంబర్- నిర్మాతల మండలి సమక్షంలో సాగించిన చర్చలు సఫలం కాకపోవడంతో ఫెడరేషన్ సమ్మె చేసేందుకు నిర్ణయించుకుందని తెలుస్తోంది. నిజానికి దిగువ స్థాయి కార్మికుల సమస్య ఈనాటిది కాదు. కొన్నేళ్లుగా నిర్మాతలతో చర్చిస్తున్నా భత్యం పెంపు విషయంలో అంగీకారం కుదరడం లేదు. నిర్మాతలు దిగి రావడం లేదు. ప్రతిసారీ సమ్మె విరమింపజేస్తున్నారు. కానీ ఈసారి సమ్మె విరమించేది లేదని కార్మిక ఫెడరేషన్ ఖరాకండిగా ప్రకటించడంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చిన్నా పెద్ద సినిమాలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి.
ప్రస్తుతం కార్మికులకు రోజువారీ భత్యంగా రూ.1400 వరకూ అందుతోంది. కానీ హైదరాబాద్ లో పెరిగిన రోజువారీ ఖర్చుల దృష్ట్యా భత్యాన్ని పెంచాల్సి ఉందని, ప్రతి మూడేళ్లకు ఓసారి ఈ పెంపుదల వర్తిస్తుందని ఫెడరేషన్ చెబుతోంది. దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్లు, ఫైట్ మాస్టర్లు నిర్మాతలతో తమ భత్యం గురించి మాట్లాడుకుని పరిష్కరించుకుంటున్నా, దిగువ స్థాయి కార్మికుల సమస్య ఎప్పటికీ పరిష్కృతం కావడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. చర్చలు జరిపినా కానీ ఈ పెంపుదలకు నిర్మాతలు సిద్ధంగా లేరు. అయితే అకస్మాత్తుగా ఇలా బంద్ చేయడం వల్ల కార్మికుల సమస్యలు తొలగిపోవని పలువురు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. సినిమా సెట్స్ లో దాదాపు 100 నుంచి 200 కార్మికులు పని చేస్తుంటారు. తాజా ప్రతిష్ఠంభనతో వీరంతా విధులను బహిష్కరిస్తారు.
