టాలీవుడ్ దర్శకుల వెయిటింగ్ లిస్ట్!
ప్రస్తుతం టాలీవుడ్ ఓ ప్రత్యేకమైన దశలో ఉంది. `పాన్ ఇండియా` అనే మంత్రం వెనుక పడి భారీ బడ్జెట్ చిత్రాలు -అగ్ర హీరోల ప్రాజెక్టులకే దర్శక, నిర్మాతలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
By: Srikanth Kontham | 9 July 2026 7:00 PM ISTప్రస్తుతం టాలీవుడ్ ఓ ప్రత్యేకమైన దశలో ఉంది. `పాన్ ఇండియా` అనే మంత్రం వెనుక పడి భారీ బడ్జెట్ చిత్రాలు -అగ్ర హీరోల ప్రాజెక్టులకే దర్శక, నిర్మాతలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలో ఉన్న టాప్ ఫోర్, ఫైవ్ హీరోల డేట్స్ కోసం దర్శకులు ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుండటంతో తదుపరి సినిమా కోసం ఎదురుచూసే దర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ వెయిటింగ్ లిస్ట్ సంస్కృతి కొత్త దర్శకులనే కాకుండా ఇప్పటికే విజయవంతమైన చిత్రాలు తీసిన స్టార్ డైరెక్టర్లను కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. అగ్ర హీరోతో సినిమా చేయాలనే కల ప్రతి దర్శకుడికి ఉంటుంది. కానీ అందుబాటులో ఉన్న కొద్దిమంది స్టార్ హీరోల కోసం భారీ లైన్ అప్ ఉండటం వల్ల సమయం వృథా అవుతోంది. గడిచిన నాలుగేళ్లలో గమనిస్తే స్టార్ డైరెక్టర్లు తదుపరి ప్రాజెక్టులను ప్రకటించడానికి సగటున ఏడాదికి పైగా సమయం తీసుకుంటున్నారు. ఇది దర్శకులు సృజనాత్మకతకు అడ్డంకిగా మారుతోంది.
అగ్ర హీరోలు కూడా కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండటంతో పాటు, భారీ సెట్టింగ్‌లు, వీఎఫ్ఎక్స్ , అంతర్జాతీయ ప్రమాణాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ నేథ్యంలో ఒక సినిమా నుంచి మరో సినిమాకు మారే లోపు దర్శకుల కెరీర్ గ్రాఫ్ మీద ప్రభావం పడుతోంది. ఉదాహరణకు అగ్ర దర్శకుడు ఫామ్‌లో ఉన్న సమయంలో ఒకే హీరో కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే? మధ్యలో ఇతర చిన్న లేదా మీడియం రేంజ్ ప్రాజెక్టులను పట్టించుకునే అవకాశం లేకుండా పోతోంది.
ఈ పరిస్థితి వల్ల పరిశ్రమలో ఒక రకమైన అస్థిరత నెలకొంటోంది. కేవలం అగ్ర హీరోల మీదనే ఆధారపడకుండా కథా బలంతో కొత్త కథానాయకులను సృష్టించాల్సిన అవసరం కనిపిస్తోంది. టాలీవుడ్ గతంలో కథే హీరోగా ఉన్న ఎన్నో అద్భుతాలను చూసింది. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా అంచనాలు పెరిగిపోవడంతో కేవలం స్టార్ పవర్ కోసమే దర్శకులు తహతహలాడుతున్నారు. ఈ ధోరణి మారకపోతే ప్రతిభావంతులైన దర్శకుల సమయం వృథా కావడమే కాకుండా పరిశ్రమలో కొత్త కథల ప్రవాహం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
అలాగే అగ్ర హీరోల డేట్ల కోసం వేచి చూసే పద్ధతి నిర్మాతల మీద ఆర్థిక భారాన్ని పెంచుతోంది. ఒక ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి ముందే ప్రీ-ప్రొడక్షన్ పనులకు భారీ ఖర్చు అవుతోంది. కానీ హీరో అందుబాటులో లేకపోవడంతో ఆ మొత్తం ఖర్చు నిలిచిపోతోంది. ఈ రకమైన అనిశ్చితి వల్ల దర్శకులు స్క్రిప్టులను మలు చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హీరో అందుబాటులోకి వచ్చేసరికి ఆ కథ పాతబడిపోవడం లేదా ప్రేక్షకుల నాడి మారే అవకాశం కూడా ఉంటుంది.
టాలీవుడ్ దర్శకులు వెయిటింగ్ ను అధిగమించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ప్రతి సినిమాకు స్టార్ హీరోనే ఉండాలనే కండిషన్ నుంచి బయటపడి కథకు తగిన నటులను ఎంచుకోవడం వల్ల సృజనాత్మక స్వేచ్ఛ పెరుగుతుంది. హీరోల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించే కంటే? కథలోని సత్తాను నమ్ముకుని ముందుకు సాగడమే నేటి తరం దర్శకులకు సరైన మార్గం. అప్పుడే పరిశ్రమలో స్థిరమైన ప్రగతి సాధ్యమవు తుందన్నది అంతే వాస్తవం.
