Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో సంవత్సరానికి 5 హిట్స్ మాత్రమే వస్తున్నాయా? మరి ఇండస్ట్రీ పరిస్థితేంటి.?

తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా బాట పట్టింది. ప్రతి ఒక్కరు సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

By:  Gopi Velupala   |   21 Oct 2026 1:34 PM IST
టాలీవుడ్ లో సంవత్సరానికి 5 హిట్స్ మాత్రమే వస్తున్నాయా? మరి ఇండస్ట్రీ పరిస్థితేంటి.?
X

తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా బాట పట్టింది. ప్రతి ఒక్కరు సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. నిజానికి ఒక సంవత్సరంలో వంద సినిమాలు రిలీజ్ అయితే కేవలం 5 సినిమాలు మాత్రమే సక్సెస్ లను సాధిస్తున్నాయి. తెలుగు సినిమాలు వందల వేల కోట్ల కలెక్షన్స్ ను రాబడుతున్నాయి. మా మూవీ మొదటి రోజు భారీ రికార్డులను కొల్లగొట్టింది అంటూ ప్రొడ్యూసర్లు భారీ ఎత్తున పోస్టర్లు వేస్తున్నారు. రికార్డ్ బ్రేక్ అయింది అంటూ వాళ్ళు వేసే పోస్టర్ల వెనుక ఎంతవరకు నిజం ఉంది? కేవలం ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడానికి ఈ పోస్టర్లను వాడుతున్నారా? లేదంటే జెన్యూన్ గానే పోస్టర్లను వేస్తున్నారా? సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కి ఎంతవరకు లాభాలు వస్తున్నాయి? కమర్షియల్ సక్సెస్ లను సాధించిన సినిమాలు ఎన్ని? అనే విషయాలను మనం కులంకష గా చర్చించుకుందాం...

హిట్టు, ఫ్లాప్ ఏదైనా ప్రొడ్యూసర్ సేఫేనా

ఒక సినిమా సక్సెస్ అయితే ప్రొడ్యూసర్స్ లాభాల బాట పడుతున్నారు. సినిమా ఫ్లాప్ అయినప్పటికి ఆయన సేఫ్ జోన్ లోనే ఉంటున్నాడు. కారణమేంటంటే ప్రొడ్యూసర్ ఒక సినిమాకి 30 కోట్ల వరకు బడ్జెట్ పెడితే అతనికి సినిమా రిలీజ్ కి ముందే ఓటిటి రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ పేరుతో వాళ్లకు రావాల్సిన డబ్బులు ముందుగానే వస్తున్నాయి. దీనివల్ల సినిమా అమ్మిన ప్రొడ్యూసర్ సేఫ్ గానే ఉంటున్నాడు. కానీ దాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు వాటిని థియేటర్లలో ప్లే చేస్తున్న ఎగ్జిబ్యూటర్లు మాత్రం సినిమా ఆడకపోతే విపరీతమైన నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ప్రొడ్యూసర్స్ భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. కానీ దాని నష్టాన్ని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు భరించాల్సిన అవసరమైతే వస్తుంది... ఒక సినిమాకి లాభాలు వస్తే అందరూ మరో సినిమా చేయడానికి ముందుకు వస్తారు. కానీ నష్టం వచ్చినప్పుడు దానిని ఎవరు భరించాలి. వందల కోట్లు పెట్టి సినిమాలను తీసిన ప్రొడ్యూసర్లు సినిమాని అమ్ముకొని సేఫ్ జోన్ లో ఉంటున్నారు. సినిమాలు రిలీజ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు మీద ఈ నష్టం పడుతుంది...

కొత్త నిర్మాతల రాక

ఒకప్పటితో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు ఎక్కువ సినిమాలను ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్ అంటే దాదాపు 50 నుంచి 100 సినిమాల వరకు ప్రొడ్యూస్ చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఒక సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన వ్యక్తి ఆ సినిమా అనుకున్న విజయాన్ని సాధిస్తే మరికొన్ని సినిమాలు చేయగలుగుతున్నాడు. ఒకవేళ భారీ బడ్జెట్ సినిమా తీసినప్పుడు దానివల్ల తీవ్రమైన నష్టాలను చవిచూడటమే కాకుండా మరో సినిమాను చేయడానికి సైతం అతను ముందుకు రావడం లేదు. ఎందుకంటే అతనికి ముందు చేసిన సినిమా వల్ల భారీ నష్టం ఏర్పడుతుంది. దానివల్ల ఫైనాన్స్ లు కట్టలేక, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నారు. ఇంకో మూవీ చేసి ఆ నష్టాన్ని భర్తీ చేద్దాం అనుకున్నప్పటికి వర్కౌట్ కావడం లేదు. ఈ లోపు తనకి ఎదురయ్యే ఆర్థిక పరిస్థితుల కారణం గా ఆయన ఇండస్ట్రీ నుంచి దూరమవుతున్నాడు...

కొత్త ప్రొడ్యూసర్స్

సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తో స్టార్ హీరోలతో కలిసి పనిచేయవచ్చనే ఉత్సాహంతో కొంతమంది బిజినెస్ మెన్స్ ప్రొడ్యూసర్స్ గా మారుతున్నారు. పాత ప్రొడ్యూసర్స్ నష్టాలను చవి చూస్తుంటే కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చి మూవీస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒకటి రెండు సినిమాలతో నష్టం వస్తే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇదంతా ఒక లూప్ లాగా జరుగుతుంది... నిజానికి ప్రొడ్యూసర్స్ అందరూ నష్టాల్లోనే ఉన్నారా అంటే కొంతమంది ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నారు వాళ్ళకి మంచి విజయాలే దక్కుతున్నాయి. తద్వారా వాళ్ళు సక్సెస్ లోనే ఉంటున్నారు. ఎంతమంది కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చిన పాట ప్రొడ్యూసర్ ను కాదుకున్నప్పుడే ఇండస్ట్రీ లో మంచి సినిమాలు రావడానికి ఇంకా ఎక్కువ మంది ప్రొడక్షన్ రంగంలోకి రావడానికి అవకాశం ఉంటుంది.

బడ్జెట్ తగ్గిస్తే బాగుంటుందా?

ఒక హీరో మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టడం వల్ల మూవీ సక్సెస్ అయితే లాభాలు వస్తున్నాయి. కానీ ఫ్లాప్ అయినప్పుడు ఎగ్జిబ్యూటర్స్ దగ్గరి నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరు నష్టపోతున్నారు. నిజానికి హీరో మార్కెట్ ఎంత? సినిమా కంటెంట్ ప్రకారం ఈ మూవీని ఎంతలో చేయచ్చు అనే విషయాల మీద క్లారిటీగా ఉంటే బాగుంటుంది. బడ్జెట్ పెరగడానికి ముఖ్య కారణం హీరో రెమ్యూనరేషన్స్... ప్రస్తుతం మన స్టార్ హీరోలు వందల కోట్ల రెమ్యూనరేషన్స్ ఛార్జ్ చేస్తున్నారు. దీనివల్ల సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన వాళ్ళకి రావల్సిన రెమ్యూనరేషన్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి. దర్శకుల పారితోషికాలు కూడా పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రొడ్యూసర్ మాత్రం సినిమా ఫ్లాప్ లో నష్టాలను భరించాల్సి వస్తుంది. అలాగే సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి పెద్ద మొత్తం లో ప్రమోషన్స్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ప్రచార ఖర్చులకు కొన్ని కోట్లల్లో వెచ్చించాల్సి ఉంటుంది...హీరోలు ఎక్కువ రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకుంటున్నారు తగ్గించుకోవచ్చు కదా అంటే మాకు క్రేజ్ ఉంది కాబట్టి మేము తీసుకుంటున్నాం. ఒకవేళ వరుసగా మా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్స్ మా దగ్గరికి వస్తారా రారు కదా! మేము అడిగినంత ఇస్తారా లేదు కదా! అందుకే సక్సెస్ లో ఉన్నప్పుడే మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ హీరోల వైపు నుంచి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి... వాళ్ళు చెప్పే మాటల్లో తప్పులేదు. కానీ సినిమా ప్రొడ్యూసర్స్ నష్టాల్లో ఉన్నప్పుడు కొంచెం రెమ్యూనరేషన్స్ తగ్గించుకొని కావాలంటే సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఇంకా కొన్ని డబ్బులు తీసుకుంటే బాగుంటుంది...గతంలో కొన్ని సినిమాలు డిజాస్టర్లు అయినప్పుడు రెమ్యూనరేషన్స్ వెనక్కి ఇచ్చేసిన హీరోలు కూడా ఉన్నారు...

100 కోట్ల సినిమాకి 200 కోట్ల కలెక్షన్స్ వస్తే ప్రొడ్యూసర్స్ కి ఎంత లాభమస్తుంది

థియేటర్లు వసూలు చేసే గ్రాస్ కలెక్షన్స్ మొత్తం ప్రొడ్యూసర్ కి రావు. థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు, టాక్స్ లు, వివిధ ఖర్చులు పోను మిగిలినవి మాత్రమే ప్రొడ్యూసర్ కి వస్తాయి... నిజానికి ఓటిటి లు వచ్చి ప్రొడ్యూసర్స్ మీద కొంతవరకు భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి...

ఉదాహరణకు ఒక మూవీ బడ్జెట్ 100 కోట్లయింది అనుకుంటే ఆ మూవీ రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా ఒక 70 కోట్ల బిజినెస్ జరిగినట్లయితే సినిమా థియేటర్ లో 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన అన్ని పోను ప్రొడ్యూసర్ కి 30 కోట షేర్ వస్తుంది. పెట్టిన పెట్టుబడి తనకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు నష్టం ఉండదు. 200 కోట్ల కలెక్షన్స్ ను సంపాదించినప్పుడు ప్రొడ్యూసర్ కి అందులో 100 కోట షేర్ వస్తుంది. అలాగే సినిమాను 70 కోట్లకు అమ్మారు. ఇక మొత్తం 170 కోట్లు వచ్చింది. అందులో 100 బడ్జెట్ పోతే 70 కోట్ల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది...

ఇలా కాకుండా ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్లకు రైట్స్ అమ్మేసి ఉంటే ఆ ఏరియాలో వచ్చే లాభనష్టాలు డిస్ట్రిబ్యూటర్స్ భరించుకోవాల్సి ఉంటుంది...

ఓటిటి లేకపోతే ప్రొడ్యూసర్స్ పరిస్థితేంటి?

ఓటిటి లు ప్రొడ్యూసర్స్ కి కొంచెం అండగా నిలబడుతున్నప్పటికీ వాళ్ళు సైతం హీరో మార్కెట్ కంటెంట్ విషయంలో కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. ఓటిటి లో వ్యూయర్ షిప్ ఉన్న సినిమాల ద్వారానే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అలాగే ఒక సూపర్ హిట్ మూవీ ఓటిటి లోకి వచ్చిందంటే దాన్ని చూడటానికి ఓటిటి సబ్స్క్రిప్షన్స్ పెరిగేలా ఉండాలి.

ప్రొడ్యూసర్స్ వాళ్ళకి వచ్చే రాబడిలో థియేటర్ తో పాటు శాటిలైట్, ఓటిటి రైట్స్ ను కూడా లెక్కలోకి వేసుకుంటున్నారు. ఒకవేళ ఓటిటి లు చేతులెత్తేస్తే ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి?

వాళ్ల సినిమాలు సక్సెస్ అయితే పర్లేదు కానీ ప్లాప్ అయితే మరింత ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది...

జనాలను థియేటర్ కి రప్పించడం ఎలా?

ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదు. స్టార్ హీరోల సినిమాలకు సైతం మొదటి వారం రోజులు మినహాయిస్తే ఆ తర్వాత జనాలు పెద్దగా కనిపించడం లేదు. ఇక చిన్న సినిమాల పరిస్థితి మరి దారుణం గా తయారైంది. ఆ సినిమాలు రిలీజై సక్సెస్ సాధించిన కూడా వారం రోజులు పోతే ఓటిటి లో వస్తుంది కదా అప్పుడు చూద్దాంలే అనే దోరణిలో ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఇక దీనికి తోడు ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ప్రేక్షకుడి ఎంటర్ టైన్ మెంట్ ను అందించే ప్లాట్ ఫామ్ లు ఎక్కువైపోయాయి. ఫోన్ లో ఒక నిమిషం వీడియోస్ చూస్తూ ఎంటర్ టైన్ చేసేవాళ్ళు థియేటర్ లో మూడు గంటల సినిమా చూడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు...దాని తోడు టికెట్ రేట్లను పెంచుతున్నారు. బ్రేక్ టైం లో తిందాం అంటే స్నాక్స్, కూల్ డ్రింక్స్ రేట్ విపరీతంగా పెంచేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదు. అందువల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లను నడిపించడం కష్టమవుతుంది. ఆ కారణంతోనే చాలా థియేటర్లు మూతబడుతున్నాయి... వీటన్నింటికి చెక్ పెడితే జనాలు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది...

ప్రతి సంవత్సరం 100 సినిమాలు రిలీజైతే అందులో 5 సినిమాలు హిట్టై 300 కోట్ల ఆదాయాన్ని తీసుకువచ్చాయి. మిగిలిన 95 సినిమాలు 425 కోట్ల కలెక్షన్స్ ను తీసుకువచ్చాయి అనుకుందాం మొత్తం 100 సినిమాల మీద 1000 కోట్లు పెడితే 725 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన 275 కోట్ల నష్టం వచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిస్థితులను బట్టి అంచనా వేసి చెప్పాం... కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు వచ్చి ఈ లెక్కలన్నింటినీ మార్చవచ్చు. కానీ ఎక్కువ మొత్తం లో సంవత్సరం చివరలో లెక్కలను బయటికి తీస్తే మాత్రం చాలా మంది ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు నష్టపోతున్నారు...

ప్రస్తుతం మన ఇండస్ట్రీ ప్రపంచస్థాయి కి వెళ్తుంది కదా ఇప్పుడు ఇండస్ట్రీ కి వచ్చే ప్రమాదం ఏం ఉంది అనే డౌట్ రావచ్చు. మన సినిమాను ఎన్ని దేశాల్లో ప్రదర్శించిన సినిమాకి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్స్ ను బతికించుకున్నప్పుడే ఇంకా మంచి సినిమాలు వస్తాయి.. ఇప్పటి వరకు అలాంటి సినిమాలు వచ్చాయి కాబట్టే మన ఇండస్ట్రీ ప్రపంచస్థాయి వరకు వెళ్లగలిగింది. అందుకే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది...థియేటర్లు మూతపడకుండా ఉండాలంటే మంచి కంటెంట్ తో రావాలి అలా వస్తే ప్రతి సంవత్సరం వచ్చే సినిమాల సక్సెస్ రేట్ పెరుగుతుంది. దానివల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది అందరు బాగుంటారు...

ఒక సినిమా చేస్తే హీరో మార్కెట్ బడ్జెట్ అన్ని కచ్చితమైన లెక్కలు వేసి సినిమాలు చేస్తే అందరు సేఫ్ జోన్ లో ఉండచ్చు. అలా కాకుండా నేల విడిచి నింగి సాము చేద్దాం అంటే అది అన్నివేళలా వర్కౌట్ కాకపోవచ్చు... ఒక సినిమా చేసిన ప్రొడ్యూసర్ ఇంకా చాలా సినిమాలు చేసేలా ఉండాలి. కానీ తను నష్టపోయి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతే అది ఇండస్ట్రీ కి తీరని లోటు. అతని ప్లేస్ లో కొత్త ప్రొడ్యూసర్ వస్తాడు. కానీ ఇక్కడున్న విధానం మారకపోతే చాలా మంది ప్రొడ్యూసర్స్ వస్తారు పోతారు కానీ నిలబడలేరు...