Begin typing your search above and press return to search.

కాస్టింగ్ కౌచ్: ఆ డైరెక్టర్ నడుముపై చెయ్యి వేయబోతే చెప్పు తీసి కొట్టా!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వెలుగు జిలుగుల వెనుక ఉన్న చీకటి కోణాన్ని, కాస్టింగ్ కౌచ్ చేదు నిజాలను ఒక సీనియర్ నటి తాజాగా బయటపెట్టారు.

By:  Sivaji Kontham   |   1 Jun 2026 10:38 AM IST
కాస్టింగ్ కౌచ్: ఆ డైరెక్టర్ నడుముపై చెయ్యి వేయబోతే చెప్పు తీసి కొట్టా!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వెలుగు జిలుగుల వెనుక ఉన్న చీకటి కోణాన్ని, కాస్టింగ్ కౌచ్ చేదు నిజాలను ఒక సీనియర్ నటి తాజాగా బయటపెట్టారు. హీరోయిన్‌గా అవకాశం ఇస్తానంటూ ఒక దర్శకుడు తన ఇంటికి వచ్చి చేసిన వికృత చేష్టలను ఈ న‌టి క్లారిటీగా వివరించారు. కథ వినిపించే సాకుతో వచ్చిన సదరు దర్శకుడు..మొదట తాను ధరించిన దుస్తులను మార్చమని కోరాడని... అలా ఒకటి కంటే ఎక్కువసార్లు చీర మార్పించి వేర్వేరు యాంగిల్స్‌లో చూశాడని అయితే ఇదంతా ఆడిష‌న్ లో భాగం అనుకున్నాన‌ని చెప్పారు. అంతటితో ఆగకుండా చివరకు త‌న‌ నడుముపై చెయ్యి వేయడానికి ప్రయత్నించడంతో.. తీవ్ర ఆగ్రహానికి లోనై చెప్పు తీసి కొట్టబోగా అతడు అక్కడి నుండి భయంతో పారిపోయాడని స‌ద‌రు నటీమ‌ణి సంచలన విషయాన్ని వెల్లడించారు.

పరిశ్రమలో అవకాశాలు రావాలంటే కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలంటూ కొందరు సీనియర్ నటీమణులు చెప్పే మాటలను కూడా ఈ సందర్భంగా ఈ సీనియర్ న‌టి గుర్తు చేసుకున్నారు. ``వారికి కావలసినది మనం ఇస్తే, మనకు కావలసినది వారు ఇస్తారు`` అనే సూత్రం ఇండస్ట్రీలో నడుస్తోందని.. అయితే తనకు ఎవరైనా అటువంటి అసభ్యకరమైన ప్రపోజల్స్ తెస్తే వెంటనే నిర్మొహమాటంగా తిరస్కరించానని చెప్పారు. టీనేజీ వయసులోనే చిత్రరంగంలోకి ప్రవేశించి ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన అనుభవం ఉన్న ఈ నటి.. ప్రస్తుతం పలు టీవీ సీరియళ్లతో పాటు వెండితెరపైనా కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

అవకాశాల పేరుతో కొత్తగా వచ్చే అమ్మాయిలపై కొందరు ఎలా వలలు వేస్తున్నారో ఈ ఘటన ద్వారా పరిశ్రమలోని తెరవెనుక చీకటి కోణం మరోసారి స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ సదరు సీనియర్ నటీమణి ఎవరు అనే పేరు కంటే కూడా.. సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎదురవుతున్న ఇటువంటి వేధింపుల స్వరూపాన్ని గ్రహించడం అత్యంత ముఖ్యం. సినిమా ఆఫీసులు, స్టూడియోల చుట్టూ తిరిగే యువతుల నమ్మకాన్ని.. అవకాశాల ఆశను ఆసరాగా చేసుకుని కొందరు పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారనేదానికి ఈ ఉదంతమే నిదర్శనం.

అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మహిళల రక్షణ కోసం షూటింగ్ లొకేషన్లలో - ఆన్ సెట్స్ సరైన వసతులు, భద్రత కల్పించడం కోసం ప్రత్యేకంగా కొన్ని మహిళా కమిటీలు పనిచేస్తున్నాయి. ఇటువంటి కమిటీల ఏర్పాటు తర్వాతైనా పరిశ్రమలో మహిళల పట్ల ప్రవర్తించే తీరులో.. అంతర్గత వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఇండస్ట్రీలోని ఇలాంటి సీనియర్ నటీమణులే ధృవీకరించాల్సి ఉంటుంది. చట్టాలు, కమిటీలు ఎన్ని ఉన్నా.. మహిళలపై జరిగే ఇటువంటి వేధింపులను అడ్డుకోవడానికి చిత్ర పరిశ్రమ అంతర్గతంగా మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.